మైనర్‌ ప్రియుడితో కలిసి తండ్రి శరీరాన్ని కోసి..

Young Girl Killed Her Adoptive Father With Minor Boyfriend - Sakshi

సాక్షి, ముంబై : మైనర్‌తో ప్రేమ వద్దన్నందుకు ఓ యువతి తనను దత్తత తీసుకున్న తండ్రిని దారుణంగా చంపేసి శరీర భాగాలను కోసి పడేసింది. వివరాలు.. ముంబైలో ఉంటున్న బెన్నెట్‌ రెబెల్లో (59) ఘట్కోపర్‌ ప్రాంతంలోని రియా (19) అనే యువతిని రెండేళ్ల కింద దత్తత తీసుకున్నాడు. అయితే రియా ఓ మైనర్‌తో ప్రేమాయణం సాగిస్తుండడంతో గమనించిన తండ్రి, మైనర్‌తో ప్రేమ వ్యవహారం మంచిది కాదని కుమార్తెకు హితవు చెప్పేవాడు.

దీంతో విసిగిపోయిన రియా తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి నవంబర్‌ 27న తండ్రిని ఇంట్లోనే దారుణంగా చంపేసింది. ఎంతలా అంటే కొన ఊపిరితో తండ్రి కొట్టుమిట్టాడుతుంటే దోమల మందును ముఖంపై స్ప్రే చేసి మరీ చంపేసింది. అనంతరం పదునైన కత్తితో తండ్రి శరీర భాగాలను ముక్కలుగా కోసి వాటిని రెండు సంచులు, ఒక సూటుకేసులో నింపి సమీపంలోని మిథి నదిలో పడేసింది. మూడు రోజుల తర్వాత సూటుకేసు గురించి సమచారం అందడంతో పోలీసులు దాన్ని తెరిచి చూడగా అందులో ఒక కాలు, చెయ్యి, మర్మాయవాలు కనపడ్డాయి.

దీన్ని సవాల్‌గా భావించిన పోలీసులు, సూట్‌కేసులోని చేతి భాగానికి ఉన్న స్వెట్టర్‌ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి బెన్నెట్‌ రెబెల్లో ఫేస్‌బుక్‌ ఖాతాను కనుగొనగలిగారు. అందులోని బెన్నెట్‌ విజిటింగ్‌ కార్డుపై ఉన్న అడ్రస్‌ ఆధారంగా అతని ఇంటికి వెళ్లి విచారించగా, బెన్నెట్‌ పది రోజుల నుంచి కనిపించడం లేదని ఇరుగు పొరుగు వారు సమాధానమిచ్చారు. దాంతోపాటు యువతి దత్తత విషయం వెలుగులోకి రాగా, పోలీసులు రియాను గుర్తించి తమదైన శైలిలో విచారించడంతో తన మైనర్‌ ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు నేరం ఒప్పుకుంది. ప్రియుడు ఘట్కోపర్‌ ప్రాంతంలోని తమ పక్కింటి వాడని తెలిపింది. అంతేకాక, మైనర్‌తో ప్రేమ వ్యవహారం తెలిశాక, బెన్నెట్‌ తనను లైంగికంగా వేధించాడని, అందుకే హత్య చేసినట్టు పేర్కొంది. ఈ ఘటనపై డీసీపీ మాట్లాడుతూ.. రియా తల్లిదండ్రులు ఘట్కోపర్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. తల్లిదండ్రులు ఉండగా దత్తత ఎందుకు ఇచ్చారనే దానిపై విచారిస్తున్నాం. అంతేకాక, ఈ హత్య ప్రణాళిక ప్రకారం జరిగిందా? లేక యాధృచ్చికంగా జరిగిందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top