రక్షించాల్సినోడే.. వంచించాడు!

Women Cheated By Her Husband In Guntur - Sakshi

సాక్షి, తాడేపల్లి(గుంటూరు) : కన్న తల్లిదండ్రులు, తోబుట్టువులను కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతి మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌  చేతిలో దారుణంగా మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచింది. వంచన తట్టుకోలేక జీవితంపై విరక్తి చెంది ఆ యువతి మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. కడుపులో ఉన్న బిడ్డ కోసం చావలేక ఇంటింటికి తిరిగి అడుక్కుంటూ దయనీయమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. న్యాయం చేయాలని మూడు నెలల నుంచి మంగళగిరిలో పోలీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ఎవ్వరూ తన మొర ఆలకించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతపురం టౌన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసే మారెప్ప రెండో కుమారుడు మూలుగుల మహేష్‌బాబు తన ఇంటి పక్కనే ఉండే లలితను 10 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నానంటూ వెంటబడి 2018 అక్టోబర్‌ 5వ తేదీ కనకదుర్గమ్మ గుడిలో వివాహం చేసుకున్నాడు.

వివాహం అనంతరం మంగళగిరి పట్టణ పరిధిలోని మిద్దె సెంటర్‌లో నివాసం ఉంటూ సంసార జీవితాన్ని సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే 2019 మే 5వ తేదీన అనంతపురం వెళ్దామని లలితను తీసుకొని మహేష్‌బాబు బయలదేరాడు. అనంతపురంలోని ఒక లాడ్జిలో దిగాడు. ఇప్పుడే వస్తానని భార్య లలితతో చెప్పి మహేష్‌ వెళ్లి ఎంతసేపటికీ తిరిగి రాలేదు. దీంతో లలిత మహేష్‌కు ఫోన్‌ చేయగా ఎత్తలేదు. వాళ్ల అన్నయ్య ఫోన్‌ తీసి తన నోటికొచ్చినట్లు దుర్భాషలాడాడు. చావమని చెప్పి ఫోన్‌ పెట్టేసాడని బాధితురాలు వాపోయింది. అక్కడ నుంచి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లలేక తిరిగి మంగళగిరి వెళ్లాలని నిర్ణయించుకుంది. తన గోడును అనంతపురం రైల్వేస్టేషన్‌లో ఒక మహిళకు చెప్పగా మంగళగిరి చేర్చింది. 

పట్టించుకోని బెటాలియన్‌ అధికారులు....
వెంటనే ఏపీఎస్పీ బెటాలియన్‌లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, వారు ఏమీ పట్టించుకోలేదని తెలిపింది. మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టినా మొదట ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. మంగళగిరి టౌన్‌ ఎస్సైకు, మరో కానిస్టేబుల్‌కు ఫోన్‌ చేసి రోజూ అడిగినా ఎటువంటి సమాధానం చెప్పడం లేదని వాపోయింది. చివరకు తన నెంబర్‌ సైతం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారని చెప్పింది. మూడు రోజుల నుంచి తనకు ఫిట్స్‌ వస్తున్నాయని, పక్కింటివారు ఆసుపత్రికి తీసుకువెళ్లారని తెలిపింది. తన గోడును ముఖ్యమంత్రికి విన్నవించుకుందామని వెళ్తుండగా, ఆటోలో ఫిట్స్‌ వచ్చి పడిపోయానని బోరున విలపించింది. అనంతపురంలో ఉన్న తమ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాలంటే మొహం చెల్లడం లేదని విలపించింది. మహేష్‌ను నమ్మి వచ్చినందుకు నాకు అన్నం పెట్టే వారు కూడా లేకుండా పోయారని కన్నీరుమున్నీరయింది. రోజూ చుట్టు పక్కల మహిళలను అడుక్కొని పొట్టపోసుకుంటున్నట్లు తెలిపింది.

కేసు నమోదు చేశాం... 
జరిగిన సంఘటనపై ఎస్సై భార్గవ్‌ను వివరణ అడగ్గా... లలిత అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి, కేసు నమోదు చేసామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో మహేష్‌ అనే ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మాట్లాడతానని తమతో చెప్పాడన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top