ఆమెది ఆత్మహత్యే! | Woman Who Found Burnt In Shamshabad Committed Suicide Says DCP Prakash Reddy | Sakshi
Sakshi News home page

ఆమెది ఆత్మహత్యే!

Dec 1 2019 5:41 AM | Updated on Dec 1 2019 5:41 AM

Woman Who Found Burnt In Shamshabad Committed Suicide Says DCP Prakash Reddy  - Sakshi

శంషాబాద్‌ రూరల్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని సిద్దులగుట్ట దారిలో ఉన్న మైసమ్మ దేవాలయం వద్ద శుక్రవారం వెలుగుచూసిన గుర్తు తెలియని మహిళ మృతి కేసు మిస్టరీ వీడింది. మహిళను హత్య చేసినట్లు ముందుగా భావించినా..మతిస్థిమితంలేని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. మృతురాలు హైదరాబాద్‌లోని ధూల్‌పేట ప్రాంతం బాబా భోలక్‌దాస్‌ నగర్‌కు చెందిన కవితాబాయి(32)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కవితాబాయికి కొంతకాలంగా మతిస్థిమితం లేదు. ఈక్రమంలో గతనెల 29న ఇంటి నుంచి ఒంటి గంట సమయంలో బయటకు వెళ్లింది. సాయంత్రం 5 గంటలకు చేతిలో బ్యాగు, బాటిల్‌తో నడుచుకుంటూ సిద్దులగుట్ట వైపు వచ్చింది.

ఈ దారిలో ఉన్న మైసమ్మ ఆలయం వద్ద కూర్చొని ఏడుస్తుండగా..అక్కడున్న అయ్యప్పమాల దీక్షదారులు గమనించి ఏమైందని అడిగారు. తాను కుటుంబీకుల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పడంతో కాసేపటికి వారు పూజకు వెళ్లారు. రాత్రి 8 గంటలకు ఆమె ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడ నుంచి వెళ్తున్న కొందరు ఆ మంటల్ని గమనించి దగ్గరకు వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా.. అప్పటికే మహిళ పూర్తిగా కాలిపోయి మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీ పుటేజీ, ఆలయం వద్ద ప్రత్యక్షసాక్షుల వివరాల ఆధారంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం కవితాబాయి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

ఎన్నో అనుమానాలు
సిద్దులగుట్ట ఘటనపై పోలీసులు చెబుతున్న వివరాలకు..ఘటనా స్థలంలో ఆనవాళ్లకు పొంతన కుదరడం లేదని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరో దుండగులు ఆమెను హత్య చేసి ఉంటారని వారు భావిస్తున్నారు. మతిస్థిమితంలేని మహిళ అంతదూరం నుంచి వచ్చి కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడం, అక్కడ మృతదేహం పడి ఉన్న తీరు, వివరాలు పలు అనుమానాలున్నాయని స్థానికులు చెబుతున్నారు. మహిళ చనిపోయేందుకు ఒంటికి నిప్పంటించుకున్నా మంటల బాధ కు తాళలేక కేకలు వేసే అవకాశం ఉంటుందని, పైగా కాలిపోతూ ఒకేచోట ఎలా ఉంటుం దని వారు ప్రశి్నస్తున్నారు. మూడ్రోజుల క్రితం తొండుపల్లిలో జరిగిన హత్యోదంతం నేపథ్యంలో వరుస ఘటనతో పోలీసులు తీరుపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చడానికి కేసును పక్కదారి పట్టిస్తున్నారనే అనుమానాలు స్థానికుల్లో నెలకొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement