వరుస ప్రమాదాలు.. భయాందోళనలు

Woman Dies After Being Run Over By GHMC Lorry in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అదుపు తప్పిన జీహెచ్‌ఎంసీకి చెందిన చెత్త తరలించే టిప్పర్‌ ఓ శానిటరీ సూపర్‌వైజర్‌ను బలితీసుకుంది. డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందంటూ స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నెహ్రూనగర్‌లో నివసించే జీడికంటి సౌందర్య(35) కాప్రా సర్కిల్‌ కార్యాయలంలో పారిశుద్ధ్య విభాగంలో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. భర్త అశోక్‌ పెయింటర్‌గా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం. రోజూలానే మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరిన సౌందర్య ఈసీఐఎల్‌లో కార్మికుల హాజరును నమోదు చేసి అక్కడి నుంచి తన స్కూటీ(టీస్‌ 08 ఈఎక్స్‌ 4887)పై భవానీనగర్‌ కాలనీకి బయలుదేరారు. ఈ క్రమంలో రాధిక చౌరస్తా నుంచి సాకేత్‌ వైపుగా వెళ్తుండగా వెనుక నుంచి అదుపుతప్పిన వేగంతో వచ్చిన జీహెచ్‌ఎంసీ టిప్పర్‌ (టీఎస్‌ 08 యూఏ 5203) స్కూటీని వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో కింద పడిపోయిన సౌందర్యపై నుంచి టిప్పర్‌ వెనుక చక్రాలు వెళ్లడంతో ఆమె శరీరం పూర్తిగా ఛిద్రమై అక్కడిక్కడే మృతిచెందింది.

డ్రైవర్‌ నిర్లక్ష్యంగా టిప్పర్‌ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న టిప్పర్‌ డ్రైవర్‌ నరేందర్‌కు దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నవంబర్‌లో రాధిక చౌరస్తా సిగ్నల్‌ వద్దే ఇదే స్పాట్‌లో టీఎస్‌ఐఐసీ కాలనీకి సరిత అనే మహిళ వెళ్తున్న స్కూటీని ఇదే తరహాలో చెత్త టిప్పర్‌ వెనుక నుంచి ఢీ కొట్టిన విషయం పాఠకులకు విదితమే. కిందపడిపోయిన సరితపై టిప్పర్‌ చక్రాలు వెళ్లడంతో ఆమె కూడా మృతి చెందిన ఘటన మరవక ముందే మరో ప్రమాదం చోటు చేసుకోవడం స్థానికుల హృదయాలను కలచివేస్తోంది. 

మరో ప్రమాదంలో...

ఇద్దరు స్నేహితులు కలిసి రాత్రి పొద్దు పోయేదాగా మద్యం తాగారు. మత్తులో ఉన్న వారు సిగరెట్‌ కోసమని బైక్‌పై బయలుదేరారు. బైక్‌ కాస్తా అదపుతప్పి రోడ్డు పక్క డివైడర్‌కు ఢీ కొనడంతో ఒకరు మృతిచెందగా మరొకరు గాయాలతో బయట పడ్డ సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నేరేడ్‌మెట్‌ ఓల్డ్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో నివసించే  దుర్గం భిక్షపతి ఆటోడ్రైవర్‌. అతని పెద్ద కుమారుడు దుర్గం సాయికిరణ్‌(26) డిగ్రీ మధ్యలోనే మానేసి ఖాళీగా ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో భగత్‌సింగ్‌ కాలనీకి చెందిన మిత్రుడు సాయిరాజ్‌ వద్దకు వెళ్లాడు. ఇద్దరు కలిసి రాత్రి పొద్దు పోయేవరకు మద్యం సేవించారు. అప్పటికే ఒంటి గంట దాటడంతో సమీపంలో పాన్‌షాపులన్నీ మూసేశారు. మత్తులో ఉన్న వారు సిగరెట్‌ కోసమని ప్యాషన్‌ బైక్‌(ఏపీ 13 హెచ్‌ 0982)పై ఈసీఐఎల్‌ చౌరస్తాకు బయలుదేరారు. ఈ క్రమంలో నార్త్‌ కమలానగర్‌ మూల వద్ద అదుపు తప్పిన బైక్‌ రోడ్డు పక్క డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌ నడుపుతున్న సాయికిరణ్‌గౌడ్‌ పక్కనే గోడపైకి ఎగిరిపడి అక్కడిక్కడే మృతిచెందాడు. వెనుక ఉన్న సాయిరాజ్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: రాధిక హత్య కేసు: వీడిన మిస్టరీ..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top