దారుణహత్య.. తల, మొండెం లభ్యం! | Sakshi
Sakshi News home page

మహిళ దారుణ హత్య.. తల, మొండెం లభ్యం !

Published Sun, Feb 18 2018 12:25 PM

woman brutal murder in warangal district - Sakshi

సాక్షి, గూడూరు: ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం టేకులతండాలో శనివారం చోటుచేసుకుంది. మృతురాలి అత్త, మామ భూక్య చిలకమ్మ, హర్యానాయక్‌ పోలీసులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన భూక్య వినోద (25), భర్త రమేష్‌ కూలి పనులతోపాటు భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. వారికి చరణ్, సాయిచరణ్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తండా పక్కనే ఉన్న అయోధ్యపురం గ్రామానికి చెందిన సీతారాంరెడ్డి రైతుకు చెందిన 6 ఎకరాల పంట భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. 

అందులో కొంత భాగం మొక్కజొన్న, మరికొంత పత్తి పంట సాగుచేస్తున్నారు. ఇటీవల వ్యవసాయ బావికి ఉన్న విద్యుత్‌ మోటారు స్టార్టర్‌ అపహరణకు గురైంది. దీంతో పంటకు నీరు పారించడం ఇబ్బందిగా మారింది. స్టార్టర్‌ అపహరణపై అనుమానం వచ్చి వీరికి పక్కనే ఉన్న రూపురెడ్డి వెంకన్న, తునికి బొందాలు అనే రైతులను అడిగారు. వారిద్దరు కలిసి వినోద, రమేష్‌తో గొడవకు దిగారు. తునికి బొందాలు కత్తితో పొడిచి చంపుతానని బెదిరించాడు. 

దీంతో భయపడిన వినోద, భర్త రమేష్, అత్తమామలు, కుటుంబ సభ్యులు మాజీ సర్పంచ్‌ భూక్య వెంకన్నకు ఫిర్యాదు చేశారు. వెంకన్న ఐదు రోజుల తర్వాత మాట్లాడుదామని చెప్పారు. ఇరువురు డిపాజిట్‌ పెట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో అపహరణకు గురైన  స్టార్టర్‌ తునికి బొందాలు తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పటి నుంచి సీతారాంరెడ్డి, వెంకన్న, బొందాలు.. వినోద–రమేష్‌ దంపతులపై పగ పెంచుకున్నారు. మూడు రోజుల క్రితం రమేష్‌ హైదరాబాద్‌కు కూలి పనికి వెళ్లగా.. వినోద శనివారం ఉదయం మొక్కజొన్నకు నీళ్లు పెట్టడానికి వెళ్లింది. వినోద వెంట ఆమె 6 సంవత్సరాల కొడుకు సాయిచరణ్‌ కూడా వెళ్లాడు. 

ఉదయం పది గంటలకు ఇంటికి వచ్చి వినోద, సాయిచరణ్‌ అన్నం తిన్నారు. మళ్లీ నీళ్లు పెట్టేందుకు వెళ్లింది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సాయిచరణ్‌ తల్లి వినోద చెప్పులు పట్టుకుని పక్కనే ఉన్న ఇంటికి వచ్చాడు. తల్లి ఏదని అడిగితే సాయిచరణ్‌ ఏమీ చెప్పలేదు. వెంటనే  మొక్కజొన్న చేను సమీపంలో ఉన్న పత్తి చేనులో వినోద రక్తపు మడుగులో కనిపించింది. తల, మొండెం వేరుగా పడేశారు. సమాచారం అందుకున్న మానుకోట డీఎస్పీ నరేష్‌కుమార్, గూడూరు సీఐ రమేష్, ఎస్సైలు యాసిన్, రామారావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. 

ఆ ముగ్గురే చంపారు..
తమ కోడలు వినోదను  సీతారాంరెడ్డి, తునికి బొందాలు, రూపురెడ్డి వెంకన్న చంపారని ఆమె అత్తామామ చిలకమ్మ, హర్యానాయక్‌ ఆరోపించారు. ఇటీవల జరిగిన గొడవలో కత్తితో చంపుతానని తునికి బొందాలు అన్నాడని, అతడిని మాత్రం అటు వైపు వెళ్లడం చూశానని, ముగ్గురు కలిసే చంపారని చిలకమ్మ పోలీసులకు చెప్పింది. 

పోలీసుల అదుపులో నిందితుడు..?
వినోదను చంపిన వ్యక్తి పోలీసుల వద్దకు చేరుకున్నట్లు సమాచారం. తనతో కొంత కాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు, ఇటీవల తనను కాదని మరొకరితో కలిసి తిరుగుతుందని, అదే కోపంతో ఒక్కడినే కత్తితో కోసి చంపానని గ్రామానికి చెందిన ఓ పెద్ద నాయకుడికి చెప్పాడని, ఆయన సూచన మేరకు లొంగిపోయినట్లు తెలిసింది. మృతురాలి తల్లిదండ్రులు నెల్లికుదురు మండలం నర్సింహులగూడెం నుంచి సాయంత్రం చేరుకున్నారు.  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement