అపహరించిన చిన్నారిని అమ్మకానికి పెట్టి..

Woman Arrested for Kidnapping Girl Chittoor - Sakshi

నిందితురాలి అరెస్ట్‌

2 నెలల తర్వాత తల్లిదండ్రుల చెంతకు చిన్నారి

గుంటూరు కిడ్నాప్‌ కేసును కొలిక్కితెచ్చిన శ్రీకాళహస్తి పోలీసులు

సాక్షి, శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా) : గుంటూరులో అపహరించిన చిన్నారిని శ్రీకాళహస్తిలో అమ్మకానికి పెట్టి అడ్డంగా దొరికిందో భిక్షగత్తె. ఒకటో పట్టణ సీఐ నాగార్జున రెడ్డి కథనం మేరకు.. గుంటూరు జిల్లా తెనాలి పాతబస్టాండు ప్రాంతానికి చెందిన పోతురాజు, లక్ష్మి దంపతుల కుమార్తె నూకాలమ్మ (3). శ్రీకాళహస్తి సంతమైదానానికి చెందిన ఆదెమ్మ భిక్షాటన చేస్తూ తెనాలికి వెళ్లింది. బస్టాండు ప్రాంతంలో ఆడుకుంటున్న ఆ చిన్నారిని జూన్‌ 30 తేదీన అపహరించింది. రెండు నెలల పాటు తమ కుమార్తె కోసం బాధిత తల్లిదండ్రులు తీవ్రంగా గాలించారు. లాభం లేకపోవడంతో ఆశలు వదులుకున్నారు.

సోమవారం సంతమైదానం అంకాళమ్మ ప్రాంతంలో కిడ్నాప్‌ చేసిన నూకాలమ్మను పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన పెంచలమ్మకు రూ.10,000లకు విక్రయించేందుకు ప్రయత్నించింది. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆదెమ్మను సీఐ నాగార్జునరెడ్డి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పాప తల్లిదండ్రులు పోతురాజు, లక్ష్మి దంపతులకు సమాచారమిచ్చారు. నూకాలమ్మను వారికి అప్పగించారు. నిందితురాలు ఆదెమ్మను, కొనేందుకు ప్రయత్నించిన పెంచలమ్మను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. కేసును గుంటూరు జిల్లా తెనాలికి బదిలీ చేసినట్లు సీఐ పేర్కొన్నారు. కేసును ఛేదించి, చిన్నారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చిన శ్రీకాళహస్తి పోలీసులకు ఎస్పీ అన్బురాజన్, డీఎస్పీ నాగేంద్రుడు రివార్డు అందించారు. రివార్డు అందుకున్న వారిలో ఎస్‌ఐ సంజయ్‌ కుమార్, ఏఎస్‌ఐ మణి, హెడ్‌ కానిస్టేబుల్‌ సహదేవ్, పీసీలు కృష్ణా, చంద్రశేఖర్‌ తదితరులు ఉన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top