మిస్టరీ వీడింది

Wife Ends Husband Lives With Boyfriend Fornication Relationship - Sakshi

నెల్లూరు జిల్లాలో హత్య

కేసును ఛేదించిన పోలీసులు

వివాహేతర సంబంధం వద్దనందుకే..

ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య

నిందితుల అరెస్ట్‌

మృతుడు ఎల్‌ఎన్‌పేట వాసి

రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం వెళ్లిన వైనం

 నెల్లూరు(క్రైమ్‌): హత్య కేసును మిస్టరీని నెల్లూరు వేదాయపాళెం పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం వద్దనుందుకే భర్తను తన ప్రియుడి ద్వారా భార్య దారుణంగా హత్య చేయించిందని తేలింది. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. నగరంలోని వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. కొత్తూరు ఫైరింగ్‌ రేంజ్‌ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేసి పెట్రోలు పోసి నిప్పంటించి దహనం చేశారని గతనెల 22వ తేదీన స్థానిక వీఆర్వో వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ, వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్‌ టీవీ సుబ్బారావు, ఎస్సైలు బి.లక్ష్మణ్, ఎం.పుల్లారెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సంఘటన జరిగి 10 రోజులకు పైగా అయిఉండొచ్చని భావించారు. అక్కడ ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్లలో నమోదైన మిస్సింగ్‌ కేసుల వివరాలను సేకరించడంతోపాటు హత్య జరిగిన ప్రాంతంలో సెల్‌ఫోన్‌ టవర్‌డంప్‌ను పరిశీలించినా ఏమాత్రం క్లూ దొరకలేదు.

ఇలా వెలుగులోకి..
ఉమ్మారెడ్డిగుంటలో నివాసం ఉంటున్న తన కుమారుడు సూర్యనారాయణ (42) కొద్దిరోజులుగా కనిపించడంలేదని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన సన్యాసి వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్‌ టీవీ సుబ్బారావు, ఎస్సై పుల్లారెడ్డిలు వివరాలు ఆరాతీయగా ఫిబ్రవరి 12వ తేదీ నుంచి అతను కనిపించడం లేదని సన్యాసి పేర్కొన్నారు. దీంతో పోలీసులు కొత్తూరు హత్య కేసును లోతుగా పరిశీలించగా హతుడు సూర్యనారాయణగా గుర్తించారు. 

భార్యే సూత్రధారి  
మృతుడి భార్య భద్రమ్మతో మాట్లాడే క్రమంలో ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆమె తన ప్రియుడి ద్వారా భర్తను హత్య చేయించిందని నిర్ధారణ అయింది.

ఉపాధి నిమిత్తం వచ్చి..
శ్రీకాకుళం లక్ష్మీనరసుపేట మండలం యాంబరం గ్రామానికి చెందిన సూర్యనారాయణకు 20 ఏళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన భద్రమ్మతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు, రెండేళ్ల క్రితం వారు ఉపాధి నిమిత్తం నెల్లూరుకు వచ్చారు. పెద్ద కుమార్తెకు వివాహం చేయగా రెండో కుమార్తె చదువుకుంటోంది. ఏడాదిగా భద్రమ్మ సుధాకర్‌ అనే మేస్త్రీ వద్ద పనులకు వెళుతూ అతడితో సన్నిహితంగా మెలగసాగింది. ఈ విషయమై దంపతుల నడుమ విభేదాలు పొడచూపాయి. ఈక్రమంలో గతనెల 11వ తేదీన సూర్యనారాయణ భార్యతో గొడవపడి చేయి చేసుకున్నాడు. జరిగిన విషయాన్ని భద్రమ్మ తన ప్రియుడు సుధాకర్‌కు చెప్పి భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.

పథకం ప్రకారం
భద్రమ్మ గత నెల 12వ తేదీన సుధాకర్‌కు ఫోన్‌ చేసి తన భర్తకు పని ఇప్పిస్తానని తీసుకెళ్లి అతడిని హత్య చేసి శవాన్ని మాయం చేసి తనకు ఫోన్‌ చేస్తే తిరిగి వస్తానని చెప్పి ఊరు వెళ్లిపోయింది. సుధాకర్‌ పథకం ప్రకారం అదేరోజు సాయంత్రం సూర్యనారాయణను కలిసి కూలీ పనులు చేస్తే ఏం సంపాదిస్తావు.. మేస్త్రీ పని ఇప్పిస్తానని.. లక్షల రూపాయలు సంపాదించవచ్చని అందుకు పనులు సైతం తానే చూస్తానని, తనకు 5 శాతం కమీషన్‌ ఇస్తే చాలని నమ్మించాడు. కొత్తూరు సమీపంలో మద్యం కొనుగోలు చేసి కొత్తూరు ఫైరింగ్‌ రేంజ్‌ ప్రాంతానికి సూర్యనారాయణను తీసుకెళ్లాడు. అక్కడ ఫూటుగా మద్యం తాగించి బండరాయితో అతనిపై దాడి చేశాడు. గుండెల్లో కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం సుధాకర్‌ భద్రమ్మకు ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని చెప్పగా ఆమె శవాన్ని కాల్చివేయాలని సలహా ఇచ్చిందని, దీంతో సుధాకర్‌ బైక్‌లోని పెట్రోల్‌ను తీసి సుర్యనారాయణపై పోసి నిప్పంటించి అక్కడినుంచి పరారైయ్యాడని డీఎస్పీ తెలిపారు. విచారణలో భద్రమ్మ హత్య జరిగిన తీరును వెల్లడించడంతో పోలీసులు ఆమె ప్రియుడు వైఎస్సార్‌ నగర్‌కు చెందిన సుధాకర్‌ను సైతం అదుపులోకి తీసుకుని విచారించారు. హత్య చేసింది తామేనని అంగీకరించడంతో అరెస్ట్‌ చేశామని డీఎస్పీ తెలిపారు. హత్య కేసును ఛేదించిన ఇన్‌స్పెక్టర్, ఎస్సై, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top