ఆ దొంగతనంతో చైనా హర్టయ్యింది

US Man Charged With Stealing Terra-Cotta Warrior Thumb - Sakshi

వాషింగ్టన్‌ : బొటనవేలు దొంగతనం చేసినందుకు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేసింది. అయితే అది మనిషిది కాదు సుమీ... చారిత్రక నేపథ్యం ఉన్న టెర్రా కోట్టా యుద్ధవీరుడి విగ్రహానిది. ఫిలడెల్ఫియాలోని ఫ్రాంక్లిన్‌ ఇనిస్టిట్యూట్‌ మ్యూజియంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... గతేడాది డిసెంబర్‌ 21 మ్యూజియంలో ఓ పార్టీ వేడుకలు జరిగాయి. దీనికి పెద్ద ఎత్తున్న విద్యార్థులు హాజరయ్యారు. వారంతా టెర్రా-కొట్టా వారియర్‌ ఎగ్జిబిషన్‌లో వారంతా కలియదిరిగారు. దానికి బియర్‌ ప్రాంతానికి చెందిన చెందిన మైకేల్‌ రోహనా అనే విద్యార్థి కూడా హజరయ్యాడు. అంతా ఫోటోలు దిగుతున్న సమయంలో మెల్లిగా ఓ విగ్రహాం వద్దకు వెళ్లి దాని బొటనవేలును విరిచేశాడు. దానిని తన జేబులో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

సుమారు 4.5 మిలియన్‌ డాలర్ల విలువైన విగ్రహం కావటంతో ఏకంగా పోలీస్‌ శాఖా ఎఫ్‌బీఐ సాయం కోరింది. సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా ఎఫ్‌బీఐ అతన్ని గుర్తించే ప్రయత్నం చేసింది. దాదాపు నెలన్నరకు పైగా విచారణ చేపట్టి చివరకు అతన్ని అరెస్ట్‌ చేసింది. బోటనవేలును అతని నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆపై రోహనా బెయిల్‌ పై విడుదలయ్యాడు. కాగా, ఈ ఘటనపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. షాంక్సి కల్చరల్‌ హెరిటేజ్‌ ప్రమోషన్‌ సెంటర్‌.. అమెరికా విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది. ‘అది మా జాతి గౌరవానికి సంబంధించింది. నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించటం దారుణం. ఈ కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలి’ అని పేర్కొంది. 

టెర్రా-కొట్టా మ్యూజియాలు...
చైనాకు చెందిన బలమైన సైన్యం టెర్రా-కొట్టా సుమారు 2 వేల సంవత్సరాల క్రితం నాటిది. చైనా తొలి చక్రవర్తి క్విన్‌ షీ హువాంగ్‌ సమాధికి రక్షణగా ఈ టెర్రా-కొట్టా యుద్ధవీరుల విగ్రహాలను నిర్మించారు. 1974లో  ఓ రైతు వీటిని గుర్తించటంతో వెలుగులోకి వచ్చింది. అందులోని కొన్ని విగ్రహాలను ప్రపంచంలోని వివిధ మ్యూజియాలకు తరలించి ప్రదర్శిస్తున్నారు. తమ సంప్రదాయాలకు, చరిత్రకు గుర్తుగా చైనా వీటికి అపూర్వ గౌరవం ఇస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top