
ముంబై: బైక్ పై ప్రపంచాన్ని చుట్టేందుకు బయలుదేరిన ముంబై కంటెంట్ సృష్టికర్త యోగేశ్ అలెకరికి యూకేలో చేదు అనుభవం ఎదురైంది. నాటింగ్ హామ్ లోని ఓ పార్క్ లో పెట్టిన అతని బైక్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. దీనిపై యోగేష్ ఒక వీడియోలో తన ఆవేదనను వెళ్లగక్కాడు. దీనికి స్పందిస్తూ ఒక బైక్ కంపెనీ యోగేశ్ అలెకరికి ఊహించని కానుక ఇచ్చింది. దీంతో అతను ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.
తన బైక్ చోరీకి గురైన సందర్భంలో యోగేష్.. తాను స్థానికంగా ఉంటున్న ఓ స్నేహితుడిని కలిసి, బ్రేక్ ఫాస్ట్ చేసి, తిరిగొచ్చేసరికి బైక్ మాయమైందని తెలిపాడు. నలుగురు యువకులు తన బైక్ ను ఎత్తుకెళ్లారన్నాడు. పాస్ పోర్ట్, వీసా తదితర డాక్యుమెంట్లతో పాటు డబ్బు కూడా అందులోనే ఉందన్నాడు. తాను కట్టుబట్టలతో మిగిలానని ఆవేదన వ్యక్తం చేశాడు. 2025 మే 1న ముంబై నుంచి బైక్ పై ప్రపంచయాత్రకు బయలుదేరినట్లు యోగేశ్ చెప్పారు. యోగేష్ ఇప్పటి వరకు.. 118 రోజుల్లో 17 దేశాలను చుట్టాడు. మొత్తంగా 24 వేల కిలోమీటర్లు తిరిగానని యోగేశ్ తెలిపాడు. బైక్ చోరీ కారణంగా యాత్ర కొనసాగించడం సాధ్యం కాదని యోగేష్ ఆ వీడియోలో పేర్కొన్నాడు.
ఈ వీడియోను చూసిన యూకేకి చెందిన ది ఆఫ్ రోడ్ సెంటర్ అనే మాన్స్‌ఫీల్డ్ వుడ్‌హౌస్ మోటార్‌సైకిల్ డీలర్‌షిప్.. కంటెట్ సృష్టికర్త యోగేష్ అలెకరికి తమ సంస్థ అప్‌గ్రేడ్ వెర్షన్ బైక్‌ను కానుకగా ఇచ్చింది. దీని సాయంతో అలెకరి ఆఫ్రికాలో తన చివరి దశ పర్యటనను కొనసాగించాడు. ఊహించని విధంగా బైక్‌ను కానుకగా అందుకున్న అలెకరి మాట్లాడుతూ 10 రోజుల తర్వాత, తాను ఆనందంగా నవ్వగలుగుతున్నానని, తాను ఇలాంటి మద్దతును ఎప్పుడూ ఊహించలేదన్నాడు. ది ఆఫ్ రోడ్ సెంటర్ యజమాని డేనియల్ వాట్స్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో యోగేష్ అలెకరి పోస్ట్‌లను చూసి, అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నానన్నారు.