ఒకే నంబర్‌తో రెండు బైక్‌లు

Two Wheeler Numbers Registration Fraud in Visakhapatnam - Sakshi

ప్రయాణం చేయని ప్రాంతంలో చలానాతో విషయం వెలుగులోకి

లబోదిబోమంటున్న అసలు యజమాని

ఆరిలోవ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం

డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): రోడ్డుపై హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే క్లిక్‌.. రాంగ్‌ పార్కింగ్‌ చేస్తే క్లిక్‌.. రికార్డులు లేకుండా వాహనం నడిపితే క్లిక్‌.. ఇలా క్లిక్‌ క్లిక్‌.క్లిక్‌ మనిపిస్తున్నారు మన పోలీసులు. అంత వరకూ బాగానే ఉంది.  హెల్మెట్‌ లేకుండా రోడ్డెక్కితే వెనుక నుంచి ఫొటోలు తీయడంలో మన పోలీసులు దిట్ట. అందులో సందేహమే లేదు. ఇక నేరుగా మేటర్లోకి వచ్చేద్దాం..

నగరంలోని ఆరిలోవ ప్రాంతానికి చెందిన దూళి ప్రభాకర్‌ అనే వ్యక్తికి పల్సర్‌ బైక్‌ ఉంది. దాని నెంబరు ఏపీ 31 డీజే 7499. ఇటీవల కాలంలో హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపినందుకు మద్దిలపాలెం, జగదాంబ జంక్షన్‌ వద్ద రెండు సార్లు ఫైన్‌ వేశారు. రూ.135 చొప్పున. ఇదిలా ఉండగా ఇదే నెంబరుతో భీమిలి నియోజకవర్గం తగరపువలసలో మరో వ్యక్తి సీడీ 100 వాహనాన్ని నడుపుతున్నాడు. దానిపై ఐదారు కేసులు నమోదు చేశారు. తగరపువలస మార్కెట్‌లో అడ్డదిడ్డంగా ఆ వాహనాన్ని నిలిపినందుకు, హెల్మ్‌ట్‌ లేకుండా వాహనం నడిపినందుకు ఆ ప్రాంత పోలీసులు ఇ–చలనాలు పంపారు. ఆ ఇ–చలానాలు నేరుగా ఒరిజినల్‌ వాహనదారుడు(పల్సర్‌ వాహన వ్యక్తి)కి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాను రెండు సార్లే ఫైన్‌ కట్టాల్సి ఉండగా..ఆరేడు కేసులకు సంబంధించి ఫైన్‌ కట్టాల్సి ఉన్నట్టు ఇ–చలానాలు పంపడమేంటని ఒరిజనల్‌ ద్విచక్రవాహనదారుడు వాపోతున్నాడు. ఈ విషయమై ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని లబోదిబోమంటున్నాడు.

ఆ వ్యక్తి ప్రమాదం చేస్తే..
కేసులు సంగతి పక్కనపెడితే..నా బండి నెంబరుతో తగరపువలస పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న ఆ వ్యక్తి ఎవరినైనా ఢీకొట్టినా..వాహనంతో గాయపరిచినా..ఆ కేసులు తనకు చుట్టుకుంటాయనే వచ్చేస్తాయన్న భయం పట్టుకుందని సాక్షి వద్ద వాపోయారు. పోలీసు పెద్దలు ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించి..తన బండి నెంబరుతో వాహనం నడుపుతున్న ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని కోరుతున్నాడు. తన బండి నెంబరుపై నమోదైన(నావి(జగదాంబ జంక్షన్, మద్దిలపాలెంలో నమోదైన వాటికే ఫైన్లు వసూలు చేయాలని విన్నవించుకుంటున్నాడు. ఒకే నంబర్‌తో రెండు వాహనాలు ఉన్నట్టు ఫొటోల్లో కనిపిస్తున్నా ఆ దిశగా పోలీసులు పట్టించుకోక పోవడంపై విమర్శలు వస్తున్నాయి.

నమోదైన కేసులివే..
సెప్టెంబర్‌ 12..2019న హెల్మెట్‌ లేకుండా ఫైన్‌ రూ.135
అక్టోబర్‌ 25, 2019న హెల్మెట్‌ లేకుండా తగరపువలస జాతీయ రహదారిపైన, మార్కెట్‌ వద్ద కేసు నమోదైంది
నవంబర్‌ 29, 2019న తగరపువలస మార్కెట్‌ వద్ద రాంగ్‌ పార్కింగ్‌ చేస్తూ కేసు నమోదు
జనవరి ఒకటి 2020న మద్దిలపాలెంలో హెల్మెట్‌ లేకుండా వాహనం నడుపుతూ(ఒరిజనల్‌ వాహనదారుడు) కేసు నమోదు
జనవరి 28, 2020న భీమిలి పోలీస్‌ స్టేషన్‌ పరిధి తగరపువలసలో రాంగ్‌ పార్కింగ్‌ చేస్తూ కేసు నమోదు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top