తప్పుటడుగుకు ఇద్దరు బలి..!

Two Persons Died In Nalgonda - Sakshi

పురుగుల మందు తాగి బలవన్మరణం

వివాహేతర సంబంధమే కారణం

సాక్షి, నల్లగొండ (నకిరేకల్‌) : నకిరేకల్‌ మండలం తాటికల్‌ గ్రామానికి చెందిన ముచ్చపోతుల సైదులు(38) వృత్తిరీత్యా గోర్లకాపరి. దీంతో పాటు భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటాడు. ఇతనికి తిప్పర్తి మండలం చిన్న సూరారం గ్రామనికి చెందిన మమతతో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి  కూతురు,కూమారుడు ఉన్నారు.

ఇదే గ్రామానికి చెందిన ఏకల శంకరయ్య కూతురు భవాని(32)కి నకిరేకల్‌కు చెందిన కారింగు సుదర్శన్‌తో  పదేళ్ల క్రితం వివాహం జరిగింది. భవానికి కుమారుడు. బాబు ఏడాదిన్నర  వయసుకు రాగానే సుదర్శన్‌ అనారోగ్యనికి గురై మృతి చెందాడు. దీంతో భవాని కొంతకాలానికి తాటికల్‌కు వచ్చి తల్లిగారింట్లో ఆశ్రయం పొందుతూ కూలీగా జీవనం సాగిస్తోంది. 

తీరుమారక.. గొడవలు ఎక్కువై..
సైదులు, భవానీలకు పోలీసులు సైతం కౌన్సిలింగ్‌ ఇచ్చినా వారి ప్రవర్తనలో మార్పు కనిపించలేదు. ఈ విషయం తెలుసుకున్న మమత భర్తతో తరచు గొడవ పడుతోంది. అయితే సైదులుతో కొనసాగిస్తున్న వివాహేతర సంబంధం కారణంగా భవాని రెండు నెలల క్రితం ఓ పాపకు కూడా జన్మనిచ్చింది. ఆ శిశువు పిల్లలు లేని వారికి దత్తత ఇచ్చినట్టు తెలిసింది.

కలిసి ఉండనివ్వడం లేదని..
సైదులు కుటుంబంలో జరుగుతున్న గొడవల కారణంగా ఇక కలిసి జీవించలేమని ఒక్కటిగాౖనైనా చనిపోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇద్దరూ కలిసి  గ్రామ శివారులోని కిషన్‌రావు నిమ్మతోటకు కూల్‌డ్రింక్‌ బాటిల్, పురుగుల మందు డబ్బాతో చేరుకున్నారు. అర్ధరాత్రి తర్వాత తోటలోని షెడ్డులో తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును కూల్‌డ్రింక్‌లో కలుపుకుని తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఆకర్షణ మొదలై..
ఏకల శంకరయ్య, ముచ్చపోతుల సైదులు నివాసాలు పక్కపక్కనే ఉన్నాయి. దీంతో భవానికి సైదులు మధ్య పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరి మధ్య ఆకర్షణ మొదలై వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం కుటుంబాల్లో తెలవడంతో తగా దాలు మొదలయ్యాయి. దీంతో సైదులు, భవాని కలిసి గత ఆగస్టు 3వ తేదీన ఇళ్లనుంచి పారిపోయారు.

దీంతో రెండు కుటుంబాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మూడు రోజుల అనంతరం వారే తిరిగి రావడంతో పెద్ద మనుషుల వద్ద పంచాయితీలు కూడా చేసుకున్నారు. మరోసారి ఇలాంటి తప్పు జరగకూడాదని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో కేసులు కూడా నమోదయ్యాయి.

తోట యజమాని చూడడంతో వెలుగులోకి..
రోజువారీ మాదిరిగా గురువారం ఉదయం కిషన్‌రావు తన తోటను సాగు చేస్తున్న రైతుతో కలిసి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. షెడ్డు వైపు వెళ్లే సరికి సైదులు, భవానిలు నోట్లోనుంచి నురగలతో విగత జీవులుగా కనిపించారు. వెంటనే వారు గ్రామస్తులకు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శాలిగౌరారం ఎస్‌ఐరాజు  ఘటన స్థలాన్ని పరిశీలించారు.

అయితే ఘటన స్థలంలో పరుగుల మందు డబ్బ వెంట ఉన్న సూచన చిట్టీపై ‘మా చావుకు సైదులు భార్య మమతే కారణం ’అని రాసి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, సైదులు సోదరుడు జానయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top