పొట్టకూటి కోసం వెళ్లి పరలోకాలకు..

Two Men Loss in Thunder bolt Attack in SPSR Nellore - Sakshi

పిడుగుపాటుకు ఇద్దరు గొర్రెల యజమానుల మృతి  

ఉదయగిరి: ఎండాకాలంలో ఉదయగిరి ప్రాంతంలో గడ్డి ఉండదు. దీంతో ఇక్కడి వారు గొర్రెలను తీసుకుని డెల్టా ప్రాంతానికి వెళతారు. వర్షాలు కురిసే వరకు అక్కడే ఉంటారు. తొలకరి తర్వాత తిరిగి వస్తారు. ఈ నేపథ్యంలో వరికుంటపాడు మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గొర్రెలను మేపేందుకు దగదర్తి మండలం చెన్నూరుకు వెళ్లారు. గురువారం మధ్యాహ్నం పిడుగులు పడడంతో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. 

వీరికి దిక్కెవరు..
వరికుంటపాడు మండలం మహ్మదాపురం పంచాయతీ గొల్లపల్లికి చెందిన గంగవరపు శ్యామ్‌కు భార్య వజ్రమ్మ, స్నేహ, వందన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పిల్లలు ఇంటర్, పదో తరగతి చదువుతున్నారు. కొంతకాలం క్రితం శ్యామ్‌ తల్లిదండ్రులిద్దరూ మృతి చెందారు. గొర్రెలు మేపగా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల శ్యామ్‌ సోదరుడు కూడా చనిపోయాడు. తన సోదరుడి కుటుంబాన్ని కూడా తానే పోషిస్తున్నాడు. కాగా పిడుగుపాటుకి శ్యామ్‌ చనిపోవడంతో వారంతా దిక్కులేని వారిగా మారారు. 

అనాథలయ్యారు  
మృతుడు అంజయ్యకు ఇద్దరు కుమారులు, భార్య మల్లేశ్వరి ఉన్నారు. పిల్లలు 5, 2వ తరగతులు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. అంజయ్య తండ్రి కొంత కాలం క్రితం మృతి చెందగా, తల్లి వృద్ధాప్యంలో ఉంది. ఈ కుటుంబానికి కూడా అంజయ్య దిక్కుగా మారారు. గొర్రెలు మేపగా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటాడు. పిడుగుపాటుతో అంజయ్య మృతిచెందడంతో భార్యాబిడ్డలు, తల్లి అనాథలుగా మారారు.

రెండు కుటుంబాల్లో విషాదం
నాయుడుపేటటౌన్‌: అకాల వర్షం.. ఊహించని విధంగా పిడుగులు పడడంతో రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి.  మండలంలోని పూడేరు గ్రామానికి చెందిన గుండాల శ్రీనివాసులు (37) సన్నకారు రైతు. అతడికి తల్లిదండులు వెంకటరత్నం, నాగభూషణమ్మ, భార్య సరస్వతీ, బాబు, పాప ఉన్నారు. కొద్దిపాటి పొలమే వారి జీవనాధారం. గురువారం వేరుశనగ పంట వేసేందుకు ట్రాక్టర్‌ తీసుకెళ్లి పొలం సాగు చేశాడు. మధ్యాహ్నం సమీపంలో ఉన్న చెట్టు వద్దకు వెళ్లి భోజనం చేస్తున్నాడు. ఒక్క సారిగా చెట్టుపై  పిడుగులు పడ్డాయి. దీంతో అతను మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృత్యువాత పడడంతో తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా ఉంది. 

సేద తీరుతుండగా..
గొట్టిప్రోలు పంచాయతీ రామరత్నం కాలనీకి చెందిన ఆవుల గురవయ్య (55) వ్యవసాయ కూలి. ప్రస్తుతం కరోనా ప్రభావంతో పనుల్లేకపోవడంతో గేదెల నుంచి వచ్చే పాల ను విక్రయిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం మేత నిమిత్తం గేదెలను సమీపంలో ఉన్న పొలాలకు తో లాడు. గురువయ్య సమీపంలో చెట్టు వద్ద నిలుచుకుని సేద తీరుతుండగా ఒక్కసారిగా పిడుగు పడి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. భర్త చనిపోవడంతో భార్య కృష్ణమ్మ రోదనకు అంతులేకుండా పోయింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top