
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ : హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్‌పేట్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం మహారాష్ట్రకు చెందిన సుంకర్ శ్యాంరావ్ మొహర్లె తన స్నేహితుడితో కలిసి పెద్ద అంబర్‌పేట్‌లోని సాయి దుర్గా వైన్స్‌లో మద్యం కొనుగోలుచేసి రోడ్డు దాటుతున్నారు.
విజయవాడ వైపునుంచి వేగంగా వచ్చిన కారు (ఏపీ28 సీజే 9706) వారిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. శ్యాంరావ్ జేబులో దొరికిన ఆధారాలను బట్టి అతన్ని గుర్తించిన పోలీసులు మరో మృతుని వివరాలకోసం ప్రయత్నిస్తున్నారు. వారు గణపతి విగ్రహాల తయారీకోసం వచ్చి సమీపంలో నివసిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.