గోదావరిలో రెండు మృతదేహాలు

Two Dead Bodies Dumped Into The Godavari River In Mancherial - Sakshi

మంచిర్యాల జిల్లాలో కలకలం

 పదిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఆనవాళ్లు

 అధికారి వేధింపులు భరించలేకే అని సూసైడ్‌ నోట్‌

సాక్షి, జైపూర్‌(ఆదిలాబాలద్‌) : గోదావరి నదిలోకి రెండు మృతదేహాలు కొట్టుకువచ్చాయి. ఒకే చోట రెండు మృతదేహాలు లభ్యం కావడం మంచిర్యాల జిల్లాలో కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా సుమారు పది రోజుల కిందట గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడగా మృతదేహాలు మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం టేకుమట్ల గోదావరి నది శివారు ప్రాంతం వైపుకు కొట్టుకువచ్చాయి. గోదావరి నదిలో ఒకరి మృతదేహం పైకి తేలివుండటాన్ని గమనించిన జాలర్లు పోలీసులకు సమాచారం అందించగా జైపూర్‌ ఎస్సై విజేందర్‌ నేతృత్వంలో ఒడ్డుకు చేర్చగా అదే ప్రాంతంలో మరో మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన పొనగంటి పురుషోత్తం (50) వడ్రంగి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ కారణాల మూలంగా ఆయన వారం రోజుల కిందట గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. గోదావరి నదిలో జాలర్లకు పురుషోత్తం మృతదేహం కనిపించగా దాన్ని ఒడ్డుకు చేర్చుతున్న క్రమంలో అదే ప్రాంతంలో మరో వ్యక్తి మృతదేహం లభించింది. ఆ మృతదేహాన్ని పెద్దపల్లి జిల్లా యైటిన్‌క్‌లైన్‌ కాలనీకి చెందిన ఎనగందుల రమేశ్‌ (35)అనే కాంట్రాక్టు ఉద్యోగిగా గుర్తించారు. మృతదేహాలను ఒడ్డుకు చేర్చి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అమ్మా నిన్ను వదిలిపోవడం నాకు ఇష్టం లేదమ్మా
‘అమ్మా నిన్ను వదిలిపోవడం నాకు ఇష్టం లేదమ్మా’ కానీ నాకు మనస్సు మంచిగా అనిపించడం లేదు. టైంకి తిని పడుకో ఆరోగ్యం జాగ్రత్త. తమ్ముడూ నీకు నేను ఏం చేయలేదుగా నువ్వే ఏదో ఒక పని చేసి ఈ అప్పులు అన్ని మెల్లమెల్లిగా కట్టురా ఎవరికి డబ్బులు ఎగొట్ట వద్దు నమ్మకంతో ఇచ్చారు వాళ్లంతా. ఇదీ పెద్దపల్లి జిల్లా  యైటిన్‌క్‌లైన్‌ కాలనీకి చెందిన ఎనగందుల రమేశ్‌ చనిపోయే ముందు రాసిన సూసైడ్‌ నోట్‌. పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఎల్‌ఓటీ అధికారిగా కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న అతడు ఉన్నతాధికారి స్థానంలో ఉన్న ఓ మహిళా అ««ధికారి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతన్నట్లు మూడు పేజీల సూసైడ్‌ నోట్‌ రాశాడు.

అందులో ఒక పోస్టు ఖాళీగా ఉండగా తను దరఖాస్తు చేసుకుంటే అన్ని అర్హతలు ఉన్నా తనకు రాకుండా ఆ మహిళా అధికారి చేసిందని, 7 నెలలుగా మనస్తాపంతో ఆరోగ్యం కూడా సరిగా ఉండడం లేదని అన్ని పరీక్షలు చేయిస్తే మంచిగానే వచ్చాయని సూసైడ్‌ నోట్‌లో రాశాడు. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం నాలాంటి కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకోకుండా చూడండి అని రాశాడు.  తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు కుటుంబ సభ్యుల బాగోగులు ఆఫీసు మిత్రులతో ఆయన పంచుకున్న విషయాలను క్లుప్తంగా రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top