
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తండ్రి నడుపుతున్న ట్రాక్టరే ఆ ముద్దుల పాపకు మృత్యుశకటమైంది. ఇంటి ముందున్న ట్రాక్టర్‌ను వెనక్కు తీస్తున్న క్రమంలో ఆడుతూ అక్కడికి వచ్చిన చిన్నారి వెనుక చక్రాల కింద పడి అసువులు బాసింది. ఈ విషాదకర సంఘటన కరీంనగర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. కరీంనగర్ మండలం చెర్లబూత్కూర్ గ్రామానికి చెందిన జక్కు ప్రసాద్ ఇంటి ముందున్న తన ట్రాక్టర్‌ను వెనక్కి తీస్తున్న సమయంలో ఆయన మూడేళ్ల కుమార్తె రితిక ట్రాక్టర్ చక్రాల కింద పడి నలిగిపోయింది.
తల్లి అన్నం తినిపిస్తుండగా రితిక ఇంటి ముందు ఆడుకుంటోంది. గిన్నెలో అన్నం పూర్తికాగా మరింత పెట్టుకొని వచ్చేందుకు తల్లి ఇంట్లోకి వెళ్లింది. ఆ సమయంలోనే తండ్రి ట్రాక్టర్‌ను వెనక్కి తీస్తుండగా, రితిక ఆ వైపుగా వెళ్లి ట్రాక్టర్ కింద పడింది. అరుపులు విని ప్రసాద్ ట్రాక్టర్ ఆపి పాపను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చిన్నారి ప్రాణాలు విడిచింది. కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.