breaking news
karimnagar rural
-
అయ్యో.. పాపం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తండ్రి నడుపుతున్న ట్రాక్టరే ఆ ముద్దుల పాపకు మృత్యుశకటమైంది. ఇంటి ముందున్న ట్రాక్టర్ను వెనక్కు తీస్తున్న క్రమంలో ఆడుతూ అక్కడికి వచ్చిన చిన్నారి వెనుక చక్రాల కింద పడి అసువులు బాసింది. ఈ విషాదకర సంఘటన కరీంనగర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. కరీంనగర్ మండలం చెర్లబూత్కూర్ గ్రామానికి చెందిన జక్కు ప్రసాద్ ఇంటి ముందున్న తన ట్రాక్టర్ను వెనక్కి తీస్తున్న సమయంలో ఆయన మూడేళ్ల కుమార్తె రితిక ట్రాక్టర్ చక్రాల కింద పడి నలిగిపోయింది. తల్లి అన్నం తినిపిస్తుండగా రితిక ఇంటి ముందు ఆడుకుంటోంది. గిన్నెలో అన్నం పూర్తికాగా మరింత పెట్టుకొని వచ్చేందుకు తల్లి ఇంట్లోకి వెళ్లింది. ఆ సమయంలోనే తండ్రి ట్రాక్టర్ను వెనక్కి తీస్తుండగా, రితిక ఆ వైపుగా వెళ్లి ట్రాక్టర్ కింద పడింది. అరుపులు విని ప్రసాద్ ట్రాక్టర్ ఆపి పాపను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చిన్నారి ప్రాణాలు విడిచింది. కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కరీంనగర్ రూరల్ జోన్ క్రీడలు ప్రారంభం
సత్తా చాటిన కరీంనగర్, తిమ్మాపూర్ మండలాలు 7 మండలాల నుంచి 500 మంది క్రీడాకారులు హాజరు కరీంనగర్: జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో 2016–17 విద్యాసంవత్సరానికి నిర్వహిస్తున్న కరీంనగర్ రూరల్ జోన్ క్రీడోత్సవాలు బుధవారం అంబేద్కర్ స్టేడియంలో పారంభమయ్యాయి. పోటీలను ఉపవిద్యాధికారి వెంకటేశ్వర్ రావు క్రీడాపతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నేటి కాలంలో విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. సింధు,సాక్షి మాలిక్ లను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. రూరల్ జోన్ పరిధిలోని 7 మండలాల నుంచి సుమారు 500 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. అండర్ 14, 17 బాలురకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ అంశాలలో, అండర్ 17 బాలికలకు ఖోఖో పోటీలు నిర్వహించారు. సాయంత్రం జరిగిన బహుమతి కార్యక్రమానికి తిమ్మాపూర్ ఎంపీపీ బూడిద ప్రేమలత, ఉపవిద్యాధికారి వెంకటేశ్వర్ రావు, ఎస్జీఎఫ్ కార్యదర్శి తిరుపతి రెడ్డి లు హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కరీంనగర్ రూరల్ జోన్ కార్యదర్శి గిన్నె లక్ష్మణ్, మండల కార్యదర్శులు బిట్ర శ్రీనివాస్, సమ్మయ్య, రవి కుమార్, పిఈటీ, పీడీలు యూనిష్ పాష, సత్యానంద్, కృష్ణ, గోపాల్, శ్రీ లక్ష్మీ, సంధ్య, రూపారాణి పాల్గొన్నారు. సత్తాచాటిన కరీంనగర్, తిమ్మాపూర్... బాలుర విభాగంలో జరిగిన పోటీల్లో కరీంనగర్, తిమ్మాపూర్ మండలాల జట్లు సత్తా చాటాయి. తిమ్మాపూర్ జట్టు కబడ్డీ, ఖోఖోలో విజయం సాధించగా, కరీంనగర్ మండల జట్లు వాలీబాల్, ఖోఖోలో గెలుపొందాయి.