వేర్వేరు చోట్ల ముగ్గురి మృతి

three died in different locations - Sakshi

జిల్లాలో వేర్వేరు చోట్ల ముగ్గురు మృతి చెందారు. శ్రీకాకుళం నగరంలో అనుమానాస్పద స్థితిలో ఓ యువతి, పాలకొండలో చెరువు గట్టుపై ఓ యువకుడు, ఇచ్ఛాపురంలో రైలు పట్టాలపై ఓ వృద్ధుడు దుర్మరణం చెందారు. 

శ్రీకాకుళం రూరల్‌: నగరంలోని వెంకటేశ్వర ఆలయం వెనుక చెరువు గట్టుపై ఉన్న ఇంట్లో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కిలుగు శాంతి(19) తంర్రి  మృతి చెందడంతో కొన్నాళ్లుగా తల్లి, అమ్మమ్మతో కలిసి చెరువు గట్టుపై ఉన్న ఇంట్లో ఉంటోంది. చుట్టుపక్కల వీధుల్లోని చిన్నారులకు ట్యూషన్‌ చెబుతూ  ఇంటిని నెట్టుకొస్తోంది. ఏం జరిగిందో గానీ సోమవారం ఉదయం విగతజీవిగా కనిపించింది. శాంతి మృతిపై బిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతమంది అనారోగ్యం కారణంగా ఉరివేసుకొందని చెబుతుండగా, మరికొందరు ఇంట్లోకి నీరు తీసుకువెళ్తుండగా మెట్లపై నుంచి జారిపడి తలకు బలమైన గాయమై చనిపోయిందని చెబుతున్నారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందలేదు.  

రైలుపట్టాలపై వృద్ధుడు.. 
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైలు నిలయం సమీపంలో బెల్లుపడ కాలనీ వద్ద ఇచ్ఛాపురం నుంచి బరంపురం వైపు వెళ్లే డౌన్‌ట్రాక్‌లో గుర్తు తెలియని రైలు ఢీకొట్టడంతో ఓ వృద్ధుడు మృతిచెందాడు. తెలుపు షర్టు, పంచె ధరించిన ఈ వృద్ధుడి వయసు సుమారు 63 ఏళ్లు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. జీఆర్‌పీ ఎస్‌ఐ కె.రవికుమార్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కోనేటి గట్టుపై యువకుడు... 
పాలకొండ రూరల్‌: వడమ గ్రామ సమీపంలోని కళ్యాణి కోనేటి గట్టుపై ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించి సోమవారం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ కె.వాసునారాయణ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పాలకొండ ఇందిరానగర్‌ కాలనీకి చెందిన కళివరపు రమణ(25) స్థానికంగా వంట పనులు చేస్తుండేవాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో దూరప్రాంతాల్లో వంటలకు వెళ్తుండేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసై చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రమణ కుటుంబీకులకు సమాచారం అందించి మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదుచేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top