
గాయాలు చూపుతూ జరిగిన సంఘటన తెలుపుతున రైల్వే ట్రాక్‌మన్ హరిబాబు భార్య
అనంతపురం, యాడికి: రాయలచెరువులో ముసుగు దొంగ పట్టపగలే బీభత్సం సృష్టించాడు. ఓ ఇంట్లోకి దూరి ఒంటరిగా ఉన్న మహిళను కత్తితో బెదిరించి ఆమె మెడలోని బంగారు తాళిబొట్టు చైనును లాక్కెళ్లాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. రాయలచెరువు గ్రామంలోని శివాలయం వీధిలో రైల్వే ట్రాక్‌మన్ హరిబాబు నివాసం ఉంటున్నాడు. మంగళవారం స్థానిక స్టేట్ బ్యాంకులో డబ్బు డ్రా చేసి ఇంటికి వచ్చి భద్రపరిచాడు. అనంతరం బయటకు వెళ్లాడు. కాసేపటి తర్వాత ముసుగు ధరించిన ఓ వ్యక్తి ఆ ఇంట్లోకి వచ్చి ‘నీ భర్త బ్యాంకు నుంచి తెచ్చిన డబ్బు ఇంట్లో ఉంచాడు. వెళ్లి తీసుకురా’ అంటూ హరిబాబు భార్య లక్ష్మిని గద్దించాడు.
భయపడిపోయిన ఆమె ఊయల్లో పడుకున్న చంటిబిడ్డను కాపాడుకునేందుకని వెళ్తుండగా ఆ వ్యక్తి కత్తితో బెదిరించి ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు తాళిబొట్టు చైనును లాక్కుని పరారయ్యాడు. దుండగుడి దాడిలో లక్ష్మి చేతులకు గాయాలయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న హరిబాబు పరుగున ఇంటికి చేరుకున్నాడు. తనను ఎవరో బ్యాంకు నుంచే ఫాలో అయ్యారని, ఇంట్లో లేని సమయం చూసి కత్తితో బెదిరించి దోపిడీకి పాల్పడ్డాడని విలేకరులకు తెలిపాడు. ఎస్‌ఐ ఫణీంద్రనాథరెడ్డి సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.