పట్టపగలే చోరీకి యత్నం

Theft Attempt - Sakshi

చోరులు మహిళలు..

కామారెడ్డిలో ఘటన

సీసీ కెమెరాల్లో రికార్డు  

కామారెడ్డి క్రైం : కామారెడ్డిలో లేడీ దొంగల ముఠా సంచరిస్తోంది. దొంగలంటే సహజంగా గుర్తుకువచ్చేది పురుషులే. కానీ గురువారం పట్టణంలోని ఓ ఇంట్లో చొరబడిన దొంగల తాలూకు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే వారు మహిళలని తేలింది. గురువారం మధ్యాహ్నం ముగ్గురు సభ్యులున్న లేడీ దొంగల ముఠా జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌ కాలనీలో తాళం వేసిన ఓ ఇంట్లోకి చొరబడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని అశోక్‌నగర్‌ కాలనీలో సాందీపని డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న వీధిలో ఆర్టీసీ కండక్టర్‌ జానకి రాములు నివాసం ఉంటున్నాడు.

గురువారం ఆయన విధులకు వెళ్లగా, అతని భార్య సుధారాణి ఇంటికి సెంట్రల్‌లాక్‌ చేసుకుని మధ్యాహ్నం బంధువుల ఇంటికి వెళ్లింది. దీంతో తాళం వేసి ఉండడాన్ని గమనించిన లేడి దొంగల ముఠా కొద్దిసేపటికే ఇంట్లోకి చొరబడ్డారు. ఇళ్లంతా చిందరవందరగా చేశారు. బంగారం, నగదు లభించకపోవడంతో అక్కడి నుంచి వట్టి చేతులతోనే వెళ్లిపోయారు. ఎలాంటి ఆస్తినష్టం జరుగలేదు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన సుధారాణి తలుపులు తెరిచి ఉండడం, ఇళ్లంతా చిందరవందరగా ఉండడాన్ని గమనించి భర్తకు సమాచారం అందించింది. దీంతో జానకి రాములు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.  

14 నిమిషాల పాటు.. 

సదరు కాలనీవాసులందరు కలిసి ఇదివరకే వీధి చివరన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. జానకి రాములు ఇంట్లో దొంగలు పడ్డారని సీసీ కెమెరా ఫుటేజీలను శుక్రవారం పరిశీలించారు. దొంగతనానికి పాల్పడింది ముగ్గురు మహిళల దొంగల ముఠాగా గుర్తించారు. ప్రధాన ద్వారానికి సెంట్రల్‌ లాక్‌ వేయగా ఇంటికి ఉన్న మరో మార్గం గుండా ఉన్న తలుపు గొళ్లెంలను పగులగొట్టి లోనికి చొరబడ్డారు. సరిగ్గా 12.35 గంటలకు ఇంటి యాజమాని సుధారాణి బయటకు వెళ్లింది.

12.45 నిమిషాలకు ముగ్గురు మహిళ దొంగల ముఠా నుంచి ఇద్దరు ఇంట్లోకి చొరబడ్డారు. మరొకరు కొద్ది దూరంలో కూర్చుని గమనిస్తున్నారు. 12.59 గంటలకు ఇంట్లోకి చొరబడిన ఇద్దరు బయటకు వచ్చారు. సరిగ్గా 14 నిమిషాల పాటు ఇద్దరు మహిళా దొంగలు ఇంట్లో విలువైన వస్తువుల కోసం గాలించారు. నగదు, బంగారం కోసం మాత్రమే వారు ఇళ్లంతా గాలించినట్లు తెలుస్తోంది. ఇంట్లోని అల్మారాలో వెండి వస్తువులు ఉన్నప్పటికి పక్కన పడేశారు.

కామారెడ్డిలో కలకలం.. 

కామారెడ్డిలో లేడీ దొంగల ముఠా సంచరిస్తుండడం కలకలం రేపుతోంది. వారంతా పంజాబీ డ్రెస్సులు వేసుకుని కాలనీలో తిరుగుతున్నారు. వారిలోని ఓ మహిళ వద్ద ఏడాది వయసున్న చిన్నారి ఉంది. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు చిన్నారిని ఎత్తుకుని కాలనీల్లో తిరుగుతున్నట్లు తెలుస్తోంది. సంచరిస్తున్న ముఠాలో ముగ్గురు మహిళలే ఉన్నారా, లేక వారి వెనుక ఇంకా ఎవరైనా పురుషులు కూడా ఉన్నారా అనే సందేహాలు ఉన్నాయి.

కామారెడ్డి పట్టణానికి నిత్యం ఎంతోమంది వలస కార్మికులు, చిరు వ్యాపారులు, ఇతర అవసరాల నిమిత్తం వస్తుంటారు. కొత్త వ్యక్తులపై నిఘా కొరవడుతోంది. అందులోనూ దొంగల ముఠాలు సంచరిస్తుండడంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సి ఉంది. వేసవికాలం కావడంతో దొంగతనాలు పెరిగే అవకాశం ఉంది. గతంలోనూ ప్రతి వేసవిలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి దొంగల ముఠాలు మన ప్రాంతంలో సంచరించడం తెలిసిందే. పోలీస్‌శాఖ తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top