కర్నూల్‌లో టెన్త్‌ ప్రశ్నపత్రం లీక్‌

Tenth question paper leak in Kurnoolcr - Sakshi

ఉ.9.30కు పరీక్ష ప్రారంభం..

9.50కు డీఈఓ వాట్సప్‌కు మెసేజ్‌ 

టీడీపీ అమాత్యుని కార్పొరేట్‌ విద్యా సంస్థ ద్వారానేనని ప్రాథమిక సమాచారం 

అక్కడ విద్యార్థులతో బట్టీ పట్టిస్తున్న ఉపాధ్యాయులు 

వెనుకబడ్డ విద్యార్థులకైతే జవాబులను మైక్రో జిరాక్స్‌ల ద్వారా అందజేత 

1995లో ఒకసారి, 1997లో మరోసారి, మళ్లీ ఇప్పుడు మూడు సందర్భాల్లోనూ చంద్రబాబే సీఎం

సాక్షి ప్రతినిధి, కర్నూలు : రాష్ట్రవ్యాప్తంగా శనివారం జరిగిన టెన్త్‌ సోషల్‌ పేపర్‌–2 ప్రశ్నపత్రం ముందుగానే లీకైంది. ఉదయం 9.30గంటలకు పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే వాట్సప్‌లో చక్కర్లు కొట్టింది. ఇది అటు తిరిగి ఇటు తిరిగి చివరికి డీఈఓ సెల్‌కే రావడంతో పేపర్‌ ముందుగానే లీకైన విషయం వెలుగుచూసింది. కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. రోజూలాగే శనివారం ఉదయం 9.30గంటలకు సోషల్‌ పేపర్‌–2 పరీక్ష ప్రారంభమైంది. 9.50గంటల ప్రాంతంలో డీఈఓ తహెరా సుల్తానా సెల్‌కు ప్రశ్నపత్రం వచ్చింది. ఇది ఒరిజినల్‌ ప్రశ్నపత్రమే అని ఆమె ధృవీకరించుకుని కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వెంటనే ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రికి సన్నిహితంగా మెలిగే ఓ అమాత్యుని కార్పొరేట్‌ పాఠశాల ద్వారానే ఈ ప్రశ్నపత్రం లీకైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. దీంతో ఈ కేసు నుంచి సదరు విద్యా సంస్థను తప్పించేందుకు అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

ఆ విద్యా సంస్థకు ముందుగానే..
వాస్తవానికి 10వ తరగతి ప్రశ్నపత్రాలు మొదటి నుంచీ సదరు విద్యా సంస్థకు లీకు అవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇందుకు అనుగుణంగా ఆ పాఠశాల సిబ్బంది విద్యార్థులతో జవాబులను బట్టీ పట్టిస్తున్నారు. అవీ చదవలేని విద్యార్థుల కోసం చిట్టీలను కూడా సదరు యాజమాన్యం అందిస్తోందని తెలుస్తోంది. సమాధానాలను ఒక పేపరు మీద ఉపాధ్యాయులతో రాయిస్తున్నారు. వీటిని మైక్రో జిరాక్స్‌ తీసి విద్యార్థులకు అందజేస్తున్నారు. కాగా, ఏ నెంబరు నుంచి మొదట ప్రశ్నపత్రం లీకై వచ్చిందనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   

గతంలోనూ చంద్రబాబు హయాంలోనే..
వాస్తవానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పలుమార్లు ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. 1995లో ఒకసారి టెన్త్‌ ప్రశ్నపత్రాలు లీకవడంతో చివర్లో జరగాల్సిన మూడు పరీక్షలను వాయిదా వేశారు. అనంతరం తిరిగి షెడ్యూల్‌ ప్రకటించి పరీక్షలను నిర్వహించారు. దీనిపై అప్పట్లోనే అధికార పార్టీ నేతలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత 1997లో ఏకంగా ఇంటర్మీడియట్‌ ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. దీంతో ఆ పరీక్షలూ వాయిదా పడ్డాయి. ఈ రెండుసార్లు కూడా చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అప్పట్లో సీఎం చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉన్న కోలా రామబ్రహ్మం పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ వ్యవహారంలో కార్పొరేట్‌ విద్యాసంస్థలు, ఇంటర్మీడియట్‌ అధికారులతో పాటు ఏకంగా సీఎంపైనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని విపక్షాలు అప్పట్లో బాగా డిమాండ్‌ చేశాయి. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యా సంస్థపైనే అప్పట్లోనూ ఆరోపణలొచ్చాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిగినప్పటికీ అసలు దోషులు మాత్రం తప్పుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి చంద్రబాబు హయాంలోనే టెన్త్‌ ప్రశ్నపత్రం లీక్‌ కావడం గమనార్హం. 

కేసు నమోదు చేశాం :  డీఎస్పీ
కాగా, టెన్త్‌ సోషల్‌ పేపర్‌–2 ప్రశ్నపత్రం లీక్‌ కావడంపై కర్నూలు జిల్లా డీఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని డీఎస్పీ శ్రీనివాసులు చెప్పారు. దీనిపై విచారణ జరుగుతోందన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top