సంతకాల ఫోర్జరీతో ఘరానా మోసం

TDP Sarpanch Cheated Dwakra Womens With Bank Loans - Sakshi

అమాయకుల పేరుతో బ్యాంక్‌ల నుంచి రుణాలు

టీడీపీ మాజీ సర్పంచ్‌ మాయాజాలం

ఖాతాదారులకు నోటీసుల జారీతో బట్టబయలు

లబోదిబోమంటున్న బాధితులు

టీడీపీ మాజీ సర్పంచ్‌ తన పలుకుబడిని ఉపయోగించి 33 మంది డ్వాక్రా సభ్యుల పేరుతో బ్యాంకులో రూ.13 లక్షలు రుణాలు మంజూరు చేయించారు. అనంతరం వారి సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బు స్వాహా చేశారు. సంఘాల సభ్యులకు బ్యాంకుల నుంచి నోటీసులు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

కేవీబీపురం : మండలంలోని దిగువపుత్తూరుకు చెందిన టీడీపీ మాజీ సర్పంచ్‌ అదే గ్రామంలో పాల కేంద్రాన్ని నిర్వహిస్తోంది. తన వద్ద పాలు పోసే అదే గ్రామానికి చెందిన 33 మంది డ్వాక్రా మహిళలకు ఆవులపై బ్యాంకు రుణాలు మంజూరు చేయిస్తానని నమ్మబలికింది. పాలు పోయగా వచ్చిన డబ్బులో కొంత చెల్లిస్తే సరిపోతుందని పేర్కొంది. దీంతో మహిళలు ఆమెను నమ్మారు. 2016 ఆగస్టులో పాలమంగళం సప్తగిరి గ్రామీన బ్యాంకు నుంచి ఆవులపై వ్యక్తిగత లోన్ల కింద ఒక్కోక్కరికి రూ.40 వేల రుణం మంజూరు చేయింది. అప్పటి నుంచి మహిళలు సంబంధిత పాల కేంద్రంలో పాలు పోస్తూ కొద్ది కొద్దిగా డబ్బు జమచేసుకుంటూ వచ్చారు.

రూ.83 వేలు చెల్లించాలని బ్యాంకు నోటీసులు
డ్వాక్రా మహిళలకు గత మంగళవారం వారికి బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి. అందులో బ్యాంకులో రూ.83 వేలు అప్పు ఉందని, వెంటనే చెల్లించాలని ఉంది. దీంతో డ్వాక్రా మహిళలు ఖంగుతిన్నారు. మునెమ్మ అనే బాధితురాలు మాజీ సర్పంచ్‌ను నిలదీయగా పొంతన లేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చింది. తక్షణం లెక్కలు తేల్చాలని నిలదీసింది. ఇప్పటి వరకు తీసుకున్న బ్యాంకు రుణంలో రూ.20 వేలు మాత్రమే తీరిందని, ఇంకా రూ.20 వేలు చెల్లించాలని పాల కేంద్రం నిర్వాహకురాలు, మాజీ సర్పంచ్‌ తెలిపింది. మహిళలు బ్యాంకులో ఆరా తీయగా 2017 జూలైలో రూ.40 వేలు రుణం తీసుకున్నారని, ప్రస్తుతం రూ.83 వేలు బకాయి ఉందని అధికారులు తేల్చి చెప్పారు. గతంలో తీసుకున్న అప్పుకు రూ.20 వేలు జమ అయిందని, రెండో విడత తీసుకున్న రూ.40 వేలు, వడ్డీ కలిపి రూ.83 వేలు అప్పు ఉన్నట్లు వివరించారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడడంతో పలువురు డ్వాక్రా సంఘాల సభ్యులు బ్యాంకులో ఆరాతీస్తున్నారు. బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తమకు జరిగిన మోసంపై ప్రశ్నించిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని సంబంధిత మాజీ సర్పంచ్‌ బెదిరిస్తున్నట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

బ్యాంకు అధికారుల పాత్రపైనా అనుమానాలు
సాధారణంగా బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం అంత సులభం కాదు. అలాంటిది ఖాతాదారులు లేకుండా.. వారితో ప్రత్యక్షంగా సంతకాలు తీసుకోకుండా 33 మందికి చెందిన రూ.13 లక్షలు ఒకరికే ఇవ్వడంపై బ్యాంకు అధికారుల పాత్రపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతంలో తీసుకున్న రుణం తీరకముందే రుణాలు మంజూరు చేయడంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రెండేళ్లుగా లెక్కలు లేవు
రెండేళ్ల క్రితం బ్యాంకు నుంచి రూ.40 వేలు రుణం తీసుకున్నాము. అప్పటి నుంచి పాలు పోస్తూనే ఉన్నాం. వాటికి సంబంధించి లెక్కలు లేవు. అడిగితే వాయిదాలు వేస్తూ వస్తోంది. నిజం తెలిసి నిలదీస్తే కేసులు, పరువు నష్టం దావా వేస్తానని బెదిరిస్తోంది. మాకు న్యాయం చేయండయ్యా.   – మునెమ్మ, బాధితురాలు

మా కడుపు కొట్టడం ధర్మం కాదు
కూలీ నాలీ చేసుకుని బతికేవాళ్లం. మాలాంటి వాళ్ల ను మోసం చేసి..మా కడుపు కొట్టడం ధర్మంకాదు. బ్యాంకు నుంచి డబ్బు తీసుకున్నది ఒకరైతే.. వాళ్లని వదిలేసి మాకు నోటీసులు పంపిస్తే అంత డబ్బు మేమెక్కడి నుంచి కట్టేది. ఒత్తిడి పెరిగితే ఆత్మహత్యలే గతి.  – చిట్టెమ్మ, బాధితురాలు

మేము లేకుండా రుణాలు ఎలా ఇస్తారు
నేను బ్యాంకుకు అప్పు ఉన్నప్పటికీ మళ్లీ అప్పు ఎలా ఇస్తారు. అది కూడా మేము లేకుండా మా సంతకాలను చూసి ఎలా ఇస్తారు. బ్యాంకు అధికారులు తప్పుడు లెక్కలు చూపించి కావాలనే మమ్మల్ని  ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు న్యాయం చేయాలి. – రాణెమ్మ, బాధితురాలు

నిబంధనల ప్రకారమే రుణాలు మంజూరు చేశాం
పూర్తి నిబంధనలతో వారి సంతకాల ప్రకారమే రుణాలు మంజూరు చేశాం. ఏది ఏమైనా వారు తీసుకున్న రుణాలు చెల్లించాల్సిందే. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బ్యాంకును, ప్రజలను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం.– మురళి,సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజర్,పాలమంగళం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top