బాలికలపై వల

Target Tribal Girls For Contract Marriages - Sakshi - Sakshi

గిరిజన తండాలే లక్ష్యం

పెళ్లి పేరుతో కొసాగుతున్న మోసాలు

కుటుంబ సభ్యులకు తెలియకుండా

అన్నీ తామై నడిపిస్తున్న మధ్యవర్తులు

నెక్కొండ ఘటనతో వెలుగులోకి వాస్తవాలు

గతంలో జరిగిన ఘటనలపై అనుమానాలు

లంబాడీ గిరిజన బాలికల జీవితాలతో మోసగాళ్లు చెలగాటమాడుతున్నారు. నిరక్షరాస్యులు, పదో తరగతి లోపు చదివిన మైనర్లే లక్ష్యంగా వల విసురుతున్నారు. వారి బారిన పడి అనేక మంది కష్టాలు
అనుభవిస్తుండగా.. మరికొందరు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు.. ఇంకొందరు కనిపించకుండా పోతున్నారు. నెక్కొండలో శుక్రవారం వెలుగు చూసిన కాంట్రాక్ట్‌ వివాహాల  నేపథ్యంలో గతంలో జరిగిన గిరిజన బాలిక ల అదృశ్యం.. మృతి చెందిన ఘటనలపై అనుమానాలు  వ్యక్తం అవుతున్నాయి.  
   

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: జిల్లాలోని నెక్కొండ మండలం గొట్లకొండ తండాలో ఇద్దరు బాలికలు, ఓ వివాహితను పెళ్లి చేసుకునేందుకు రాజస్థాన్‌కు చెందిన 55 ఏళ్లు పైబడిన ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించిన ఘటన సంచలనం రేపింది. ఆ వ్యక్తులతో వివాహానికి సిద్ధమైన ముగ్గురిలో ఇద్దరు పూర్తిగా నిరక్షరాస్యులు. ఒకరు ఆరో తరగతి వరకు చదువుకుని మధ్యలో ఆపేశారు. ఇందులో ఆరో తరగతి వరకు చదివిన ఒక బాలిక వివాహాన్ని వ్యతిరేకించిం  తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం  శుక్రవారం బయటకు పొక్కింది. దీంతో పోలీసులు శనివారం తండాకు చేరుకుని విచారణ చేపట్టారు.

గిరిజనులే లక్ష్యంగా..
మహబూబాబాద్‌ చుట్టు పక్కల ఉన్న గ్రానైట్, మార్బుల్స్‌ వ్యాపార లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. వీటి నిమిత్తం ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో వయసు పైడిన వారు, స్థానికంగా పెళ్లి సంబంధాలు కుదరని వారు ఇక్కడి గిరిజన యువతులను వివాహం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొంత కాలంగా> ఈ తరహా పద్ధతి చాపకింద నీరులా కొనసాగుతోంది. గిరిజన తండాలు, అందులో పేదరికంలో ఉండే నిరక్ష్యరాస్యులైన బాలికలను వివాహానికి ఒప్పిస్తున్నారు. ఇందుకుగాను గిరిజన యువతులను వెతికి పెట్టేందుకు మహబూబాబాద్‌ కేంద్రంగా కొన్ని ముఠాలు/వ్యక్తులు పని చేస్తున్నారు. వీరి మాటలు నమ్మి కొందరు పెళ్లికి సిద్ధపడుతుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు నెక్కొండ సంఘటనే నిదర్శనం. పట్టపగలు పార్కులో ఈ తంతు జరగడంతో బాలిక వివాహానికి వ్యతిరేకించడం తేలికైంది. అదే తెలియని ప్రదేశంలో, అపరిచిత వ్యక్తుల సమక్షంలో జరిగితే ఆ బాలిక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వచ్చేది.

వీడని మిస్టరీ
నెక్కొండ ఘటన నేపథ్యంలో గతంలో ఇక్కడ జరిగిన రెండు దుర్ఘటనలకు కారణం ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మహబూబాబాద్, నర్సంపేట నియోజకవర్గాల పరిధిలో 2012, 2015 సంవత్సరాల్లో చోటుచేసుకున్న రెండు సంఘటనల్లో నలుగురు లంబాడా బాలికలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇప్పటీకీ ఆ మరణాలకు కారణం ఏమిటనేది పోలీసుల దర్యాప్తులో తేలలేదు.

చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేట దగ్గర బోడగుట్ట తండా వద్ద ఇద్దరు బాలికలు బానోతు ప్రియాం క, బానోతు భూమిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరు మరణించి శవాలు కుళ్లిపోయిన దశలో ఓ బాలిక మృతదేహాం తాలూకు పుర్రెను కుక్కలు గ్రామంలోకి తీసుకురావడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. చనిపోయిన ఈ బాలికలను 2015 డిసెంబరు 27న గుర్తించారు. ఇద్దరిదీ పర్వతగిరి మండలం రోళ్లకల్లు గ్రామ శివారు కంబాలకుంట తండా. వీరు నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుకునే సందర్భంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఎవరు హత్య చేశారు.. బాలికలను అక్కడికి ఎవరు తీసుకెళ్లారు.. అక్కడం ఏం జరిగిందనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఈ కేసు పెండింగ్‌లోనే ఉంది.

నెక్కొండ మండలం మరిపెల్లి శివారు వాజ్యానాయ క్‌ తండాకు చెందిన బానోత్‌ అనూష, జాటోతు వనిత వయస్సు 16 ఏళ్లు. పదో తరగతి చదివే ఈ ఇద్దరు గిరిజన బాలికలు 2012 నవంబరు 14న కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వేస్టేషన్‌ సమీపంలో శవమై కనిపించారు. ఇంటర్మీడియట్‌ చదవే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వీరు రెండు రోజుల తర్వాత రైల్వేట్రాక్‌ పక్కన శవాలుగా తేలారు. రైల్వే ట్రాక్‌ దగ్గరకు ఎందుకు వెళ్లారు.. ఎవరూ తీసుకెళ్లారు.. ఎటు ప్రయాణిస్తున్నారనే అంశాలపై స్పష్టత రాలేదు. దీంతో ఈ కేసు చిక్కుముడి కూడా వీడిపోలేదు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top