తహసీల్దార్‌ సుధను అరెస్టు చేశాం

Tahasildar Arrest in Cheating Case - Sakshi

న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది

యాదాద్రి కలెక్టర్‌కు సీసీఎస్‌ పోలీసుల లేఖ

కేసులో నిందితుల ఆస్తుల స్వాధీనానికి సన్నాహాలు

సాక్షి, సిటీబ్యూరో: చిట్టీల పేరుతో చీటింగ్‌ చేసి చిక్కిన తహసీల్దార్‌ లింగాల సుధ అరెస్టు విషయాన్ని హైదరాబాద్‌ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధికారులు యాదాద్రి జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న ఏసీపీ జి.వెంకటేశ్వర్లు గురువారం లేఖ రాశారు. ఈమె తన  సమీప బంధువులతో పాటు మరికొందరితో కలిసి సనత్‌నగర్‌ కేంద్రంగా అక్రమంగా చిట్టీల దందా నిర్వహించడంతో పాటు రూ.2 కోట్లు స్వాహా చేసిన కేసులో అరెస్టైన విషయం విదితమే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అరెస్టై, 48 గంటలకు మించి రిమాండ్‌లో ఉంటే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమికంగా సంబంధిత శాఖాధిపతి సదరు ఉద్యోగిపై సస్పెన్షన్‌ వేటు వేస్తారు. ఇందుకుగాను పోలీసులు అరెస్టుకు సంబంధించి అధికారిక సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. యాదాద్రి జిల్లా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో తహశీల్దార్‌గా పని చేస్తున్న సుధను సీసీఎస్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడలోని మహిళా జైలుకు పంపారు.

శుక్రవారంతో సుధ 48 గంటల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న నేపథ్యంలో సీసీఎస్‌ పోలీసులు యాదాద్రి కలెక్టర్‌కు ఈ విషయం తెలియపరుస్తూ లేఖ రాశారు. మరోపక్క ఈ స్కామ్‌లో నిందితుల చేతిలో మోసపోయిన వారిలో అత్యధికులు ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారే ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది సుధ ప్రోద్బలంతోనే చిట్టీలో సభ్యులుగా చేరినట్లు పోలీసులు చెబుతున్నారు. మరోపక్క చిట్టీలు పాడుకున్న వారిలో కొందరికి డబ్బు చెల్లించడానికి ముఠా సభ్యులు చెక్కులు జారీ చేశారు. ఈ ఖాతా సైతం సుధతో పాటు మరో నిందితుడి పేరుతో ఉన్న జాయింట్‌ ఖాతా కావడం గమనార్హం. వీరు చిట్టీ పాడుకున్న వారిలో కొందరికి నగదు ఇవ్వకుండా నెలకు నూటికి రూ.2 వడ్డీ ఇస్తామంటూ తమ వద్దే డిపాజిట్‌గా ఉంచుకున్నారు.

దీంతో ఈ కేసులో సీసీఎస్‌ పోలీసులు డిపాజిట్‌దారుల పరిరక్షణ చట్టంలోని సెక్షన్లను సైతం పొందుపరిచారు. వీటి ప్రకారం నమోదైన కేసుల్లో నిందితుల ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సుధతో పాటు ఇతరుల పేర్లతో సిటీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కొన్ని స్థిరాస్తులను గుర్తించిన సీసీఎస్‌ పోలీసులు వాటి జాబితా రూపొందించారు. వీటిని సీజ్‌ చేయడానికి అను మతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. సర్కారు అనుమతితో సీజ్‌ చేసిన తర్వాత ఆ జాబితాలను కోర్టుకు సమర్పిస్తామని, ఇతర చర్యల తర్వాత న్యాయస్థానం వాటిని వేలం లో విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని బా«ధితులకు పంచుతుందని అధికారులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top