సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్‌కు టెన్షన్ పట్టుకుంది. ముఖ్యంగా టీడీపీలో నేతల వరుస వివాదాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు తలపట్టుకుంటున్న సమాచారం. మొన్న కొలికపూడి.. నిన్న సుధా మాధవి ఆరోపణలతో టీడీపీలో ఆందోళన మొదలైంది. నేతల ఆరోపణలపై టీడీపీ అధిష్టానం నోరు మెదపకపోవడం గమనార్హం.
అధికార టీడీపీలో సీటుకు కోట్లు ఆరోపణలు సంచలనంగా మారాయి. రైల్వే కోడూరు టికెట్ ఇప్పిస్తానని టీడీపీ ఎన్‌ఆర్‌ఐ నేత వేమన సతీష్ తన వద్ద రూ.7 కోట్లు తీసుకున్నారని టీడీపీ కార్యకర్త సుధా మాధవి రోదించారు. ఆస్తులు, ఇల్లు అమ్ముకుని అప్పులు పాలై పోయామంటూ ఆవేదన చెందారు. సమస్య చెప్పుకునేందుకు కార్యాలయానికి వెళితే నంబర్‌లేని కారులో నా భర్తను, నన్ను తీసుకెళ్లిపోయారు. తనను కిడ్నాప్ చేశారని తెలిపారు. తమకు ప్రాణహని ఉందని కన్నీరు పెట్టుకున్నారు. కాగా, సుధా మాధవి ఆరోపణలపై టీడీపీ సైలంట్‌గా ఉంది.
మరోవైపు.. కేశినేని చిన్ని దందాల చిట్టాను టీడీపీ క్రమశిక్షణ కమిటీకి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఇచ్చారు. ఎన్నికల్లో సీటు కోసం 5 కోట్లు ఇచ్చిన లెక్కలు వివరించారు. కేశినేని చిన్ని మంత్రి లోకేష్ పేరు చెప్పి చేస్తున్న పనులను కూడా వెల్లడించారు. తిరువూరులో గంజాయి, మద్యం, రేషన్, ఇసుక దందాలలో కేశినేని చిన్ని పాత్రపై ఆరోపణలు చేశారు. పార్టీ పదవులు కేశినేని చిన్ని అమ్ముకున్నారని కమిటీకి కొలికపూడి ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో కొలికపూడి ఆరోపణలపై కమిటీకి ఎంపీ కేశినేని చిన్ని వివరణ ఇచ్చారు. అనంతరం, కొలికపూడి కోవర్టు అంటూ చిన్ని ఆరోపించారు. ఈ ఎపిసోడ్‌లో రంగంలోకి దిగిన ఎల్లో మీడియా తన వంతుగా కొలికపూడిదే తప్పు అంటూ ఎంపీని రక్షించే ప్రయత్నం చేస్తోంది. కొలికపూడి ఎపిసోడ్ టీడీపీని టెన్షన్ పెడుతున్న సమయంలో సుధా మాధవి విషయం బయటకు రావడంతో పచ్చ పార్టీలో ఆందోళన మొదలైంది. అధికార కూటమి వరుస వివాదాలు బయటకు వస్తున్నప్పటికీ టీడీపీ, చంద్రబాబు మాత్రం ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం గమనార్హం.


