ఎమ్మెల్యే కొలికపూడికి టీడీపీ క్రమశిక్షణ సంఘం సూచన
విజయవాడ ఎంపీ అవినీతిపై లేఖ ఇచ్చిన కొలికపూడి
కొలికపూడిపైనా ఆరోపణలు చేసిన ఎంపీ చిన్ని
ఇద్దరితో విడివిడిగా మాట్లాడి సర్దుబాటు ప్రయత్నాలు
ఈ సమయంలోనే పార్టీ కార్యాలయానికి వచ్చిన లోకేశ్
సాక్షి, అమరావతి: పార్టీకి సంబంధించి ఏ విషయం బహిరంగంగా మాట్లాడవద్దని, మీడియా, సోషల్ మీడియాలోనూ వాటి ప్రస్తావన తేవద్దని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని), తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌కి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం సూచించినట్టు తెలిసింది. ఏవైనా అభ్యంతరాలు, ఇబ్బందులు ఉంటే తమకు చెప్పాలని స్పష్టం చేసినట్టు సమాచారం. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలు ఇటీవల తీవ్రస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు పలు ఆరోపణలు చేసుకున్నారు.
తన వద్ద ఎమ్మెల్యే సీటు కోసం ఎంపీ కేశినేని చిన్ని రూ.5 కోట్టు తీసుకున్నట్టు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వెల్లడించడంతో టీడీపీ అధిష్ఠానం ఉలిక్కిపడింది. పార్టీకి సంబంధించిన మరిన్ని అక్రమాలు బయటకు వస్తాయనే ఆందోళనతో చంద్రబాబు కొలికపూడితో మాట్లాడారు. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య సర్దుబాటు చేయాలని క్రమశిక్షణ సంఘానికి సూచించారు. దీంతో సంఘం సభ్యులైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, నేతలు వర్ల రామయ్య, పంచుమర్తి అనూరాధ, కొనకళ్ల నారాయణ మంగళవారం ఉదయం కొలికపూడిని పిలిచి మాట్లాడారు.
పార్టీలో తనకు జరుగుతున్న అవమానాల గురించి కొలికపూడి వారి వద్ద ఏకరువు పెట్టినట్టు తెలిసింది. ఎమ్మెల్యేనైనా తనకు నియోజకవర్గంలో ఎటువంటి అధికారాలు లేకుండా చేశారని, నియామకాలు, కార్యక్రమాలు, పనులన్నింటిలో ఎంపీ జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఎంపీ చిన్ని తిరువూరు నియోజకవర్గంలో చేసిన అవినీతి వ్యవహారాలు, తనకు తెలియకుండా చేపట్టిన పనులు, నియామకాలు వంటి అన్నింటి గురించి లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చారు.
ఆ లేఖ తీసుకున్న క్రమశిక్షణ సంఘం సభ్యులు ఇకపై ఏ విషయం బయట మాట్లాడకూడదని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు తెలిసింది. ఎంపీ తన నియోజకవర్గంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ఆయన ప్రశ్నించగా.. దానికి సమాధానం దాటవేసిన సభ్యులు.. పార్టీ చెప్పినట్టు వినాలని చెప్పారు. దీంతో కొలికపూడి ఆగ్రహంతో బయటకు వచ్చారు. తన అనుచరులతో కూడా మాట్లాడకుండా ఒంటరిగానే కారులో వెళ్లిపోయారు.
ఆ తర్వాత కేశినేని చిన్ని కమిటీ సభ్యులను కలిసి తన వాదన వినిపించారు. తన పరిధిలోని ఎమ్మెల్యేలు కొందరు పార్టీకి నష్టం చేస్తున్నారని చెప్పారని, కొలికపూడికి స్థానిక పార్టీతో విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని చెప్పినట్టు తెలిసింది. ఇకపై ఇద్దరూ బహిరంగంగా మాట్లాడకూడదని చెప్పిన సంఘం నేతలు నివేదికను చంద్రబాబుకు ఇస్తామని, ఆ తర్వాత తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు.
లోకేశ్ ఎంట్రీ
మరోవైపు తన నివాసంలో ప్రజాదర్బార్ పేరుతో ప్రజల నుంచి వినతులు తీసుకునే సీఎం కుమారుడు, మంత్రి లోకేశ్ మంగళవారం మాత్రం పార్టీ కార్యాలయానికి వచ్చి వినతులు తీసుకున్నారు. తన అనుయాయుడైన విజయవాడ ఎంపీ చిన్ని క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై వివరణ ఇచ్చే సమయంలో ఎన్నడూ లేనివిధంగా లోకేశ్ పార్టీ కార్యాలయానికి రావడం చర్చనీయాంశమైంది. చిన్నికి మద్దతుగానే ఆయన మంగళవారం తన కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది.


