కరకట్ట మీద డొంకలు కదులుతున్నాయి! 

Tadepalli Police Set Up Surveillance And Seized Heavily Marijuana - Sakshi

కొడుకు ప్రవర్తనతో తల్లి ఫిర్యాదు 

దర్యాప్తులో గంజాయి తాగుతున్నట్లు నిర్ధారణ 

విక్రయదారుల డొంకలు కదిలిస్తున్న తాడేపల్లి పోలీసులు

సాక్షి, తాడేపల్లి (మంగళగిరి): తాడేపల్లి పట్టణ పరిధిలోని ఎన్టీఆర్‌ కరకట్ట మీద నివాసం ఉండే ఓ తల్లి తన కొడుకు ప్రవర్తనపై తాడేపల్లి పోలీసులకు అయిదు రోజుల క్రితం ఫిర్యాదు చేయడంతో, తాడేపల్లి పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. ఆ యువకుడిపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి, భారీగా గంజాయి పట్టుకున్నారు. బాధ్యులపై గురువారం కేసు నమోదుచేసి కోర్టుకు హాజరుపరిచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎన్టీఆర్‌ కరకట్ట మీద నివాసం ఉండే జున్ను పద్మ చిన్న కొడుకైన జున్ను తేజ అయిదు రోజుల క్రితం తల్లిపై చెయ్యి చేసుకుని, ఆమె వద్దనున్న డబ్బులు లాక్కొని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. వెంటనే ఆమె తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు తేజపై ప్రత్యేక నిఘా పెట్టారు. తల్లి ద్వారా మరికొంత డబ్బులు ఇప్పించగా, తేజ గంజాయి కొనుగోలు చేసేందుకు తాడేపల్లి పట్టణ పరిధిలోని అమరారెడ్డినగర్‌లో సన్నిధి నాగ అంజయ్య ఇంటికి వెళ్లాడు. అక్కడ నాగ అంజయ్య భార్య సంధ్యారాణి తేజకు గంజాయి ఇస్తుండగా పోలీసులు రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి  

వెంటనే ఇంట్లో తనిఖీలు చేయగా 3 కేజీల గంజాయి దొరికింది. అనంతరం తేజను మళ్లీ విచారించగా, విజయవాడ ప్రకాష్‌నగర్‌లో గంజాయి అమ్మే స్థలం తెలుసని చెప్పడంతో, ముందు పోలీసులు తేజాను పంపించి గంజాయి కొనుగోలు చేశారు. అక్కడ జొన్నలగడ్డ పద్మ ఇంట్లో తనిఖీ చేయగా, 3కేజీల 200 గ్రాముల గంజాయి దొరికింది. తిరిగి మళ్లీ తేజా విజయవాడలోని పైపులరోడ్డు తుపాకుల రామయ్య పార్కు వద్ద జొన్నలగడ్డ సారమ్మ ఇంటికి వెళ్లి గంజాయి కొనుగోలు చేస్తుండగా, అక్కడ దాడి చేసి 4కేజీల 700 గ్రాముల గంజాయితో పాటు, సారమ్మ ఇంట్లో గంజాయి అమ్మగా వచ్చిన రూ.1,42,800  స్వాదీనం చేసుకున్నట్లు తాడేపల్లి పోలీసులు తెలియజేశారు.

తేజ ఇచ్చిన సమాచారం మేరకు గంజాయి విక్రయించే నలుగురిని, గంజాయి కొనుగోలు చేస్తున్న తేజాను, 10 కేజీల 900 గ్రాముల గంజాయిని, రూ.1,42,800 నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి, కోర్టుకు హాజరుపరిచినట్టు సీఐ అంకమరావు చెప్పారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజయవాడలో కూడా తనిఖీలు చేసినట్లు తెలిపారు. కేసులో కీలకపాత్ర పోషించిన సిబ్బందిని ఆయన అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top