గమ్మత్తు చిత్రాలు

Synthetic drug sale In hyderabad city  - Sakshi

ఎల్‌ఎస్‌డీ మాదకద్రవ్యం రవాణా, వినియోగం తీరిది

సిటీలో జోరుగా సింథటిక్‌ డ్రగ్‌ విక్రయం

నెదర్లాండ్స్, గోవా తదితర ప్రాంతాల్లో తయారీగా అనుమానం

పెడ్లర్స్‌పై ముమ్మర నిఘా 

‘న్యూ ఇయర్‌’ నేపథ్యంలో దందాలు పెరిగే అవకాశం

అవి చూడ్డానికి బొమ్మలు, డిజైన్లతో ఉన్న చిన్న సైజు పేపర్లు.. కానీ ఆ బొమ్మల్లో భయంకరమైన సింథటిక్‌ డ్రగ్‌ ఎల్‌ఎస్‌డీ దాగుంది. వీటిని నయాసాల్‌ వేడుకల్లో విక్రయించేందుకు పొరుగు రాష్ట్రాల ముఠాలు, స్థానిక డ్రగ్‌ పెడ్లర్లు సిటీపై కన్నేశారు. తమ రెగ్యులర్‌ క్లయింట్స్‌తో సోషల్‌ మీడియా ద్వారా సంప్రదింపులు జరపడంతో పాటు డ్రగ్‌ అందుబాటుపై సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్‌ పార్టీల నేపథ్యంలో వీటి విక్రయం పెరిగే అవకాశం ఉందనే సమాచారంతో నగర పోలీసు విభాగం నిఘా ముమ్మరం చేసింది.

సాక్షి, సిటీబ్యూరో: అక్కడ న్యూ ఇయర్‌ పార్టీ జోరుగా సాగుతోంది... పాల్గొన్న యువత చిట్‌చాట్‌ చేస్తూ వివిధ రకాలైన డిజైన్లు, బొమ్మలతో ఉన్న చిన్న సైజు పేపర్లను చేత్తోకున్నారు. అప్పడప్పుడు ఆ కాగితాలను చిన్న ముక్కగా చేసి యాదృచ్ఛికంగా అన్నట్లు నాలికపై పెట్టుకుని చప్పరిస్తున్నారు... ఈ ఉదంతాన్ని ఎవరు చూసినా అనుమానించాల్సిన  అవసరం లేదనే భావిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే... ఆ బొమ్మల్లో భయంకరమైన సింథటిక్‌ డ్రగ్‌ ఎల్‌ఎస్‌డీ దాగుంటుందని. ఈ మాదకద్రవ్యం కలిగి ఉన్న ఆరోపణలపై వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం ఇరువురిని అరెస్టు చేశారు. ‘డిసెంబర్‌ 31’ సమీపిస్తుండటంతో పొరుగు రాష్ట్రాలకు చెందిన ముఠాలు, స్థానిక డ్రగ్‌ పెడ్లర్లు ఈ సింథటిక్‌ డ్రగ్‌ను విక్రయించే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. 

‘బోల్ట్స్‌’ తయారీ ఈజీ కావడంతో..
గత కొన్నేళ్లుగా నగర పోలీసులు అనేక డ్రగ్స్‌ ముఠాలను పట్టుకున్నాయి. వీరి నుంచి బ్రౌన్‌షుగర్, కొకైన్, ఎక్ట్ససీ, ఖత్‌ వంటి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి డ్రగ్స్‌ను నగరానికి తరలించడం, విక్రయించడంలో కీలకపాత్ర పోషిస్తున్న (పెడ్లర్స్‌) సౌతాఫ్రికా జాతీయులతో పాటు కొన్ని పబ్స్‌లో పని చేసే స్థానికుల పైనా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో విక్రేతలు, వినియోగదారుల కన్ను బోల్ట్స్‌గా పిలిచే ఎల్‌ఎస్‌డీ స్టాంపులపై పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లినర్జిక్‌ యాసిడ్‌ డై థైలామెడ్‌ (ఎల్‌ఎస్‌డీ) మాదకద్రవ్యం వాస్తవానికి ఘనరూపంలో కనిపించే ద్రావణం. కొన్ని ప్రత్యేక పద్దతుల్లో దీనిని బ్లాటింగ్‌ పేపర్‌పై పూతలా ఏర్పాటు చేస్తారు. ఇలా పూత ఏర్పాటుకు ముందు ఆ కాగితంపై ఓ డిజైన్‌ రూపొందిస్తారు. కంప్యూటర్‌ సహాయంతో అలాంటి డిజైన్‌ ఉన్న కాగితాలను ఒకే సైజులో పెద్ద సంఖ్యలో తయారు చేస్తారు. ఈ కాగితాలపై ఎల్‌ఎస్‌డీ పూసే విధానం పూత రేకుల తయారీని పోలి ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు.  ఈ కాగితాన్ని పరీక్షగా పరిశీలిస్తే మాత్రమే దానిపై ఎల్‌ఎస్‌డీ పూత ఉందనే విషయాన్ని గుర్తించగలం.  సయమం, డిమాండ్‌ను బట్టి ఒక్కో గ్రాము ఎల్‌ఎస్‌డీ రూ.1500 నుంచి రూ.2500 వరకు పలుకుతోందని సమాచారం. 

ప్రధానంగా అక్కడే తయారీ...
ఎల్‌ఎస్‌డీ మాదకద్రవ్యం ఎక్కువగా నెదర్లాండ్స్‌లో తయారవుతోంది. భారత్‌కు సంబంధించి గోవాతో పాటు ఉత్తరాదిలో ఉన్న కొన్ని నగరాల్లో దీని ‘యూనిట్లు’ ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. గురువారం చిక్కిన ‘డ్రగ్స్‌ ద్వయం’ ఎల్‌ఎస్‌డీని గోవాతో పాటు కోడైకెనాల్‌లో ఖరీదు చేసినట్లు వెలుగులోకి వచ్చిన విషయం విదితమే. వీటిని పోస్ట్, కొరియర్, ప్రైవేట్‌ ట్రావెల్స్, వ్యక్తుల ద్వారా నగరానికి పంపుతున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్థారిస్తున్నారు. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో వ్యాపారమే లాభసాటిగా ఉండటంతో ఆయా ముఠాలు ఇక్కడే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నాయని సమాచారం. ఈ డ్రగ్‌ను తీసుకోవడం కూడా చాలా తేలికకావడం పెడ్లర్స్‌కు కలిసి వస్తున్న అంశం. పెడ్లర్స్‌ బ్లాటింగ్‌ కాగితాలపై ఎల్‌ఎస్‌డీని తీసుకువచ్చి ఒక్కో కాగితం లేదా గ్రాము చొప్పున విక్రయిస్తున్నారని తెలిసింది. ఈ విక్రయాలపై పోలీసులకు పెద్దగా సమాచారం, అనుమానం లేకపోవడంతో ఉత్తరాదికి చెందిన అనేక మంది పథకం ప్రకారం బెంగళూరు మీదుగా నగరానికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సిటీలోని పెడ్లర్స్‌ వీటిని పబ్స్‌తో పాటు అనేక ప్రాంతా ల్లో విక్రయిస్తున్నారు. బ్లాటింగ్‌ పేపర్‌లో నుం చి ఓ ముక్కను చింపుకుని నేరుగా నాలికపై పెట్టుకుంటూ వాడుతున్నారని తెలుస్తోంది.

‘సోషల్‌’ సంప్రదింపులు, సమాచారం...
నగరంలోని కొందరు పెడ్లర్స్‌ తమ రెగ్యులర్‌ క్‌లైంట్స్‌తో సోషల్‌ మీడియా ద్వారా సంప్రదింపులు జరపడంతో పాటు డ్రగ్‌ అందుబాటుపై సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. తమ ‘వినియోగదారుల’తో ఆయా సోషల్‌ మీడియాల్లో ప్రత్యేక గ్రూప్‌లు ఏర్పాటు చేస్తూ సంప్రదింపులు జరుపుతున్న విక్రేతలు శని, ఆదివారాల్లో కొన్ని పబ్బులు, హోటళ్ళ కేంద్రంగా భారీ విక్రయాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. పెడ్లర్లు పదుల సంఖ్యలో ఈ పేపర్లు పట్టుకు వచ్చినా, కొరియర్, పోస్టు ద్వారా పంపినా ఎవరికీ అనుమానం రాదు. ఆయా పార్శిళ్ళను స్కానింగ్‌ చేసినప్పటికీ డ్రగ్‌ పూతను కనిపెట్టడం సాధ్యం కాకపోవడం వీరికి కలిసి వస్తోంది. న్యూ ఇయర్‌ పార్టీల నేపథ్యంలో సిటీలో ఎల్‌ఎస్‌డీ విక్రయం పెరిగే అవకాశం ఉందనే సమాచారంతో నగర పోలీసు విభాగం నిఘా ముమ్మరం చేసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top