
సముద్రంలో విసిరేసి పరారైన పాక్ స్మగ్లర్లు
స్వాధీనం చేసుకున్న గుజరాత్ కోస్ట్‌గార్డ్
అహ్మదాబాద్: గుజరాత్ తీరంలో మాదకద్రవ్యాలను అక్రమంగా తీసుకువచ్చే పాకిస్తాన్ స్మగ్లర్ల ఆటకట్టింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ బృందం(ఏటీఎస్), తీర రక్షక దళం(ఐసీజీ) సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రూ.1,800 కోట్ల విలువైన 300 కిలోల మెథాంఫెటమైన్ అనే సింథటిక్ డ్రగ్ పట్టుబడింది. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి దాటాక అరేబియా సముద్రంలో ఘటన చోటుచేసుకుంది. ఫిదా అనే పేరున్న మాఫియా ముఠా చేపల పడవలో భారత జలాల్లోకి ప్రవేశించనుందంటూ ఏటీఎస్ అందించిన నిఘా సమాచారం మేరకు ఐసీజీ గస్తీని ముమ్మరం చేసింది.
అంతర్జాతీయ సముద్ర జలాలకు అత్యంత సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఐసీజీ గస్తీ ఓడను దూరం నుంచే గమనించిన స్మగ్లర్లు తమ బోటులో ఉన్న డ్రగ్స్ డ్రమ్ములను సముద్రంలో విసిరేశారు. వేగంగా అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దుల వైపు వెళ్లిపోయారు. ఇదంతా వెంటవెంటనే జరిగిపోయింది. వారిని పట్టుకునేందుకు ఐసీజీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. కటిక చీకటిలోనే వారు విసిరేసిన డ్రగ్ పార్శిళ్లను ఐసీజీ, ఏటీఎస్ సిబ్బంది గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 311 ప్యాకెట్లలో 311 కిలోల మెథాంఫెటమైన్‌ను పోర్బందర్ తీరానికి తరలించి, దర్యాప్తు చేపట్టామని ఐసీజీ తెలిపింది.
ఈ ప్యాకెట్లను ప్లాస్టిక్ డ్రమ్ముల్లో సీల్ వేసి ఉంచారని, సముద్ర జలాల్లో వేసినా అందులోని సరుకు పాడవదని ఏటీఎస్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సునీల్ జోషి చెప్పారు. ఈ డ్రగ్స్ గమ్యస్థానం తమిళనాడని ఆయన వివరించారు. పాక్‌లోని పస్ని పోర్టు నుంచి బయలుదేరిన మాఫియా సభ్యులు సముద్ర జలాల్లోనే డ్రగ్స్‌ను మరో బోటులోకి మార్చి, ఆపైన తమిళనాడుకు చేరవేయాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఇటువంటి 13 ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసి, అక్రమార్కుల ఆటకట్టించామని వివరించారు. కాగా, ఐస్, క్రిస్టల్ మెథ్ అని కూడా పిలిచే మెథాంఫెటమైన్ చాలా శక్తివంతమైన డ్రగ్.
పొట్టలో రూ.7.85 కోట్ల కొకైన్
ముంబై: ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఉగాండా దేశస్తుడి పొట్టలో రూ.7.85 కోట్ల విలువుండే 785 గ్రాముల కొకైన్‌ను గుర్తించారు. ఈ నెల 9వ తేదీన రాత్రి ఓ విమానంలో వచ్చిన అతడిని అధికారులు అడ్డుకున్నారు. విచారణ సమయంలో అతడు ఆందోళనతో కనిపించడంతో కనిపించాడు. దీంతో, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేయించగా పొట్టలో టాబ్లెట్లు ఉన్నట్లు తేలింది.