ఆస్తులివ్వాలా.. పారిపోయిన మీ కోడల్ని రమ్మను : సుప్రీం

Supreme Court Asks Woman To Bring Back Daughter In Law - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పారిపోయిన కోడల్ని పట్టుకొస్తేనే ఆస్తులపై ఉన్న సీజ్‌ను ఎత్తివేస్తామని సుప్రీంకోర్టు ఓ అత్తకు స్పష్టం చేసింది. ఆమె కోడలు కోర్టుకు ఇచ్చిన మాట తప్పిందని, ముందు న్యాయ వ్యవస్థపై ఆమెకు లెక్కలేనితనం, గౌరవం లేకపోయినా.. వెనక్కు వచ్చి కనీసం మంచి కోడలు అనిపించుకోవాలని హితవు పలికింది.

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రితికా అవస్తీ అనే మహిళ బుష్‌ ఫుడ్స్‌ ఒవర్‌సీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకీ ప్రమోటర్‌గా పనిచేసేవారు. ఈ కంపెనీతో చాలా మందికి టోకరా పెట్టారు. చీటింగ్‌, ఫోర్జరీ, కుట్ర పూరిత నేరం తదితర నేరాలకు పాల్పడింది. అయితే, ఆమె అరెస్టు సమయంలోనే తాను లండన్‌ వెళ్లి వస్తానని కోర్టుకు హామీ ఇచ్చి వెళ్లి ఇక తిరిగి రాలేదు. సుప్రీంకోర్టు పలుమార్లు నోటీసులు పంపించినా పట్టించుకోలేదు. దీంతో కోర్టు దిక్కారం కింద సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె అత్తగారి ఆస్తులన్నింటిని సీజ్‌ చేసింది. అయితే, ఆమె తరుపు న్యాయవాది కోర్టుకు హాజరై సీజ్‌ చేసిన ఆస్తులను తిరిగి అప్పగించాలంటూ కోరారు. ఇందుకు స్పందించిన కోర్టు..

'మీరు మీ కోడల్ని వెనక్కి తీసుకురాకుంటే మేం అటాచ్‌ చేయించిన ఆస్తులను విడుదల చేయలేము. ఆమె తిరిగి భారత్‌కు వస్తే కచ్చితంగా ఆస్తులు ఇచ్చేస్తాం. మీరే ఆమెను వెనక్కు తీసుకురావాలి. ఆమెతో మాట్లాడండి.. ఇక్కడకు రమ్మని చెప్పండి.. మా ఆదేశాల్లో మార్పు చేసుకుంటాం.. ఆమె వెనక్కు వచ్చినప్పుడు మాత్రమే. ఆమెతో చెప్పండి కనీసం మంచి కోడలిగానైనా నడుచుకోవాలని' అంటూ సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. అయితే, ఢిల్లీలో ఉన్న ఆమె అత్తగారి నివాస ఆస్తులను కూడా అటాచ్‌ చేశారని, ఆమె ఎక్కడకు వెళ్లే పరిస్థితి లేనప్పుడు అలా చేయడం సరికాదని, కనీసం వాటినైనా విడిపించాలని కోర్టును కోరారు. దీనిపై విచారణను ఏప్రిల్‌ 5కు కోర్టు వాయిదా వేసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top