ఉపాధ్యాయుడి వేధింపులకు విద్యార్థిని బలి | Student suicide for teacher harassment | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడి వేధింపులకు విద్యార్థిని బలి

Nov 20 2019 4:54 AM | Updated on Nov 20 2019 5:01 AM

Student suicide for teacher harassment - Sakshi

పుల్లంపేట: ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన మంగళవారం వైఎస్సార్‌ జిల్లా పుల్లంపేటలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్‌ జిల్లా రాజంపేట పట్టణంలో నివసించే కొండపల్లి కృష్ణమూర్తి, గౌరి దంపతులు తమ కుమార్తె లక్ష్మీప్రసన్నను పుల్లంపేటలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో పదో తరగతిలో చేర్పించారు. అక్కడ సైన్సు ఉపాధ్యాయుడు శివ తనను చదువు విషయమై తరచూ వేధిస్తున్నాడని లక్ష్మీప్రసన్న పలుమార్లు తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి, కన్నీరు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కుమార్తెను ఓదార్చేందుకు విద్యార్థిని తల్లి గౌరి మంగళవారం సాయంత్రం పాఠశాల వద్దకు వచ్చింది.

సిబ్బంది అనుమతించకపోవడంతో వెలుపల వేచి ఉంది. పాఠశాల విడిచిపెట్టాక లక్ష్మీప్రసన్నను హస్టల్‌కు తీసుకెళ్లింది. దుస్తులు మార్చుకుంటానని గది లోపలికి వెళ్లిన లక్ష్మీప్రసన్న చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థిని ఆత్మహత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement