శ్రీనివాసరావుతో అపరిచితుల మంతనాలు!

Strangers Talk with Janupalli Srinivasa Rao - Sakshi

జైలు నుంచి ఆస్పత్రికి.. ఆస్పత్రి నుంచి జైలుకు.. అంతా గోప్యమే
ఎన్నో అనుమానాలకు దారితీస్తున్న అధికారుల తీరు
సాధారణ వార్డులో చికిత్స అని చెప్పి ప్రత్యేక సౌకర్యాలున్న ఐసీయూకు తరలింపు
మామూలు జ్వరానికి ఇంత హడావుడి ఎందుకు?
ఆస్పత్రి అంతా కెమేరాలున్నా.. ఒక్క ఐసీయూలో మాత్రం లేవు
ముందస్తు ప్రణాళికలో భాగంగా టీడీపీ పెద్దలు కలిసినట్లు సమాచారం
జైలులో అయితే రికార్డుల్లో నమోదవుతుందని ఆస్పత్రి ఎంపిక?
కేసును తప్పుదారి పట్టించే వ్యూహాలు పన్నుతున్నట్లు అనుమానాలు  

రాజమహేంద్రవరం క్రైం/ముమ్మిడివరం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ముద్దాయిగా శిక్ష అనుభవిస్తున్న జనుపల్లి శ్రీనివాసరావును జైలు నుంచి ఆస్పత్రికి తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు మాత్రం వైరల్‌ ఫీవర్‌ అని చెబుతున్నారు. అయితే అంత హడావుడిగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి రెండు రోజులపాటు అక్కడే ఉంచి పలువురు అపరిచిత వ్యక్తులతో మాట్లాడించడం వెనుక కుట్ర దాగుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మీడియాకు విషయం తెలియడంతో బుధవారం రాజమహేంద్రవరం త్రీటౌన్‌ సీఐ శేఖర్‌బాబు ఆధ్వర్యంలో ఎస్కార్ట్‌ పోలీసులు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని బందోబస్తు మధ్య సెంట్రల్‌ జైల్‌కు తరలించారు. ఈ నెల 22వ తేదీ సోమవారం శ్రీనివాసరావును ప్రభుత్వ అస్పత్రికి తీసుకువచ్చినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ టి.రమేష్‌ కిశోర్, ఆర్‌ఎంఓ డాక్టర్‌ పద్మశ్రీ, అతనికి చికిత్స అందించిన డాక్టర్లు నాయక్, చంద్రశేఖర్‌లు పేర్కొన్నారు. అతనికి డెంగీ, మలేరియా, టైఫాయిడ్, హెచ్‌ఐవీ వంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మలేరియా వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించి చికిత్స అందించినట్లు డాక్టర్‌ నాయక్‌ పేర్కొన్నారు. శ్రీనివాసరావుకు హార్ట్‌ ఎటాక్‌ లక్షణాలున్నాయని, ఇతర వ్యాధులు ఉన్నట్లు మీడియాలో వస్తున్నవన్నీ వదంతులేనని, అతను ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు స్పష్టం చేశారు.

గోప్యత పాటించిన జైలు అధికారులు...
శ్రీనివాసరావును ఆస్పత్రికి తరలించిడంతో అటు జైలు అధికారులు, ఇటు ఆస్పత్రి వర్గాలు మొదటి నుంచి మీడియాను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆస్పత్రిలో శ్రీనివాసరావు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియనీయకుండా గుట్టుగా ఉంచారు. సాధారణ ఖైదీల వార్డులో చికిత్స అందిస్తున్నట్లు మొదట సమాచారం ఇచ్చారు. అయితే సకల సౌకర్యాలు, ఏసీ ఉన్న ఐసీయూ వార్డులో ఉంచారు. ఆస్పత్రిలో అన్ని ప్రాంతాల్లో సీసీ కెమేరాలు ఉన్నప్పటికీ శ్రీనివాసరావును ఉంచిన ఐసీయూలో మాత్రం కెమేరాలు లేకపోవడం గమనార్హం. సాధారణ జ్వరానికి ఐసీయూలో ఎందుకు ఉంచారనే ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం ఇవ్వడం లేదు. మీడియా కంట పడకుండా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అప్పటికే మీడియా చేరుకోవడంతో శ్రీనివాసరావు ముఖానికి టవల్‌ చుట్టి పోలీస్‌ ఎస్కార్ట్‌ కారు ఎక్కించి జైలుకు తరలించారు.

ముందస్తు జాగ్రత్తతో మంతనాలు..
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండడంతో శ్రీనివాసరావును టీడీపీ పెద్దలు, పలువురు అపరిచిత వ్యక్తులు ఆస్పత్రిలో కలిసినట్లు తెలుస్తోంది. సెంట్రల్‌ జైలులో ములాఖత్‌ కోసం ఎవరు కలసినా ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, వారి పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలు మొత్తం జైలు రికార్డుల్లో నమోదవుతాయి. అలా నమోదు కాకుండా ముందస్తు జాగ్రత్తలతో మంతనాలు చేసేందుకు ప్రభుత్వ ఆస్పత్రిని వేదికగా చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసుకు సంబంధించిన వివరాలు బయటపెట్టకుండా ఏవిధంగా వ్యవహరించాలనే అంశాలపై శ్రీనివాసరావుతో చర్చించి ఉంటారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్ష్యాలు తారుమారు చేసి కేసును తప్పుదారి పట్టించేందుకు వ్యూహం పన్నుతున్నట్టు, ఇందుకు కొంతమంది జైలు, ఆస్పత్రి వర్గాలు సహకరించినట్టుగా భావిస్తున్నారు. కాగా, శ్రీనివాసరావును ఆస్పత్రికి తీసుకెళ్లడంతో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేల్లంకలో తల్లిదండ్రులు తాతారావు, సావిత్రి, సోదరుడు సుబ్బరాజు ఆందోళనకు గురయ్యారు. సుబ్బరాజు ఆస్పత్రికి వెళ్లి సోదరుడిని పరామర్శించాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top