సవతి తల్లి దారుణ హత్య

Step Mother Murdered For Assets in Hyderabad - Sakshi

ఆస్తి పంచినందుకు పగపెంచుకున్న కుమారుడు

కంట్లోకారం చల్లి, వేట కొడవలితో నరికిన వైనం

నిందితుడు పోలీసు శాఖలో బాంబు స్క్వాడ్‌ టీమ్‌లో డాగ్‌ హ్యాండర్‌

చంచల్‌గూడ: ఆస్తి వివాదం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. సవతి తల్లికి ఆస్తి పంచినందుకు ఆమెను కడతేర్చాలని నిశ్చయించుకున్న వ్యక్తి వేట కొడవలితో కిరాతకంగా నరికి చంపాడు. వివరాల్లోకి వెళితే.. మాదన్నపేటకు చెందిన యాదయ్య తన భార్య చెల్లెలు అయిన సుకన్య (57)ను రెండో వివాహం చేసుకున్నాడు. సుకన్య స్థానిక లిటిల్‌ స్టార్స్‌ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయురాలిగా గత 15 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తోంది. సుకన్యకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. యాదయ్య మొదటి భార్య కుమారుడు కొలన్‌ శ్రీకాంత్‌ (46) పోలీసు శాఖలో బాంబు స్క్వాడ్‌ టీమ్‌లో డాగ్‌ హ్యాండర్‌గా విధులు ని ర్వహిస్తున్నాడు. ఇతను 1994లో ఏపీఎస్‌పీ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. కాగా తండ్రి కొడుకుల మధ్య గత పదేళ్లుగా ఆస్తి వివాదం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఆస్తి పంపకాల్లో శ్రీకాంత్‌కు బీహెచ్‌ఈఎల్‌లో ఒక ఇల్లు, మాదన్నపేటలో మరో ఇల్లు వచ్చాయి. సుకన్యకు మాదన్నపేటలో ఒక ఇల్లు దక్కింది. యాదయ్య రెండో భార్యకు కూడా ఆస్తి పంపకం చేయడంతో సుకన్య, శ్రీకాంత్‌ల మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి.

రెండు నెలల క్రితమే హత్యకు పథకం..
ఆస్తి విషయంలో పలుమార్లు శ్రీకాంత్‌ సుకన్యపై బెదిరింపులకు పాల్పడినట్లు బంధవులు తెలిపారు. కాగా రెండు నెలల క్రితం సుకన్య భర్త యాదయ్య కాలం చేశాడు. అంత్యక్రియల రోజు సుకన్యను చంపేస్తానని శ్రీకాంత్‌ బహిరంగంగా బెదిరించినట్లు బంధువులు వెల్లడించారు. శ్రీకాంత్‌ బెదిరింపుల నేపథ్యంలో ఆమె ఇంటికి సీసీ కెమెరాలను సైతం అమర్చుకుంది. ఇటీవల శ్రీకాంత్‌ సీసీ కెమెరాలను ధ్వంసం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. శ్రీకాంత్‌ వ్యవహారంపై సుకన్య పలుమార్లు మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుకన్యకు పంపకాల్లో వచ్చిన భవనంలోని మలిగీలు, కొంత డబ్బు, 15 తులాల బంగారం విషయమై శ్రీకాంత్‌ వివాదానికి తెర తీసినట్లు తెలుస్తోంది. సుకన్య ఇంట్లోనే ఉందన్న ముందస్తు సమాచారంతో ముందే వేసుకున్న పథకం ప్రకారం శ్రీకాంత్‌ మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో సుకన్య ఇంటికి వచ్చాడు.

కళ్లలో కారం చల్లి సుకన్య మెడ, చాతిపై వేటకొడవలితో నరికాడు. సుకన్య అరుపులు కేక లు వినడంతో పాటు స్థానికులు రాగానే శ్రీకాంత్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి పిల్లలు భోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. సంతోష్‌నగర్‌ ఏసీపీ శివరామ్‌శర్మ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యా నేరం కింద కే సు నమోదు చేశామని, ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. గతంలో తండ్రిపై దాడికి దిగిన కేసులో నిందితుడిపై చందానగర్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.  సీసీ ఫుటేజీని  పరిశీలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top