మెల్లమెల్లగా నల్లబెల్లం | Smuggling from AP to Telangana through train | Sakshi
Sakshi News home page

మెల్లమెల్లగా నల్లబెల్లం

Mar 11 2018 2:58 AM | Updated on Jul 11 2019 8:43 PM

Smuggling from AP to Telangana through train - Sakshi

మహబూబా బాద్‌లో ఎక్సైజ్‌ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన బెల్లం

ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పరిశీలిస్తున్న గోనె సంచుల మూటలు పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ లోనివి. కేసముద్రం వద్ద రైల్లోనే పట్టుబడ్డాయి. వీటిని గుంటూరు జిల్లా బాపట్ల రైల్వే స్టేషన్‌లో రైలెక్కించారు. పక్కా సమాచారంతో ఎక్సైజ్, సివిల్, రైల్వే పోలీసులు సంయుక్తంగా వలపన్ని పట్టుకున్నారు. 

ఈ చిత్రంలో కనిపిస్తున్నవి కేసముద్రం–నెక్కొండ మార్గమధ్యలో కదులుతున్న రైలులోంచి బయటకు విసిరేసిన బస్తాలు. అందులో గుడుంబా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం ముద్దలు ఉన్నాయి. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న కొందరు వ్యక్తులు మెరుపు వేగంతో ఆ బస్తాలను తీసుకుని మాయమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బెల్లాన్ని నిషేధించింది.

సాక్షి, హైదరాబాద్‌:
100 శాతం గుడుంబా రహిత రాష్ట్రంగా ప్రకటించిన తెలంగాణలోని పల్లెలకు నిత్యం నిషేధిత నల్లబెల్లం దిగుమతి అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ వైపు వస్తున్న రైళ్లలో రోజుకు కనీసం 50 నుంచి 75 టన్నుల నల్లబెల్లం అక్రమ రవాణా కొనసాగుతోంది. దీని నుంచే గుడుంబాను కాస్తున్నారు. పక్క రాష్ట్రంలో తక్కువ ధరకే కావాల్సినంత బెల్లం అందుబాటులో ఉండటం, రోడ్డు మార్గంతో పోల్చితే రైలు ద్వారా అక్రమ రవాణా సులువుగా ఉండటంతో మాఫియా ఇటు మళ్లింది. తొలుత ఒక్కో వ్యక్తి గుట్టుచప్పుడు కాకుండా 30 నుంచి 50 కిలోల బెల్లం అక్రమ రవాణా చేయాగా.. తాజాగా ముగ్గురు నలుగురు వ్యక్తులు ఒక గ్రూప్‌గా ఏర్పడి ట్రిప్పునకు 4 క్వింటాళ్ల వరకు బెల్లం దిగుమతి చేస్తున్నారు. 

మళ్లీ రెచ్చిపోతున్న గుడుంబా మాఫియా 
గుడుంబాతో ప్రాణాపాయం ఎక్కువగా ఉండటం, తెలంగాణ పల్లెలు నాటు సారా మత్తులో జోగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం నాటు సారాను నిర్మూలించాలని సంకల్పించింది. ఈ మేరకు నల్లబెల్లాన్ని నిషేధించి, నాటు సారా కాయటం మానేసిన కుటుంబాలకు పునరావాసం కల్పించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోవైపు గుడుంబా తయారీకి వినియో గించే బెల్లం, పట్టిక అమ్మకాలు సాగిస్తే ఎక్సైజ్‌ అధికారులు పీడీ యాక్టును ప్రయోగించారు. బెల్లం సరఫరా మూలాలను మూసేశారు. బెల్లం అమ్మకాలపై నిఘా పెట్టారు. అయితే పునరావాస ప్యాకేజీ అందరికీ అందకపోవటం, ఏడాదిపాటు గుడుంబా నిర్మూలన కోసం శ్రమ పడ్డ ఎక్సైజ్‌ అధికారులు విశ్రాంతి ధోరణితో కనిపించడంతో నాటు సారా కాసే కుటుంబాలు మళ్లీ రెచ్చిపోతున్నాయి. గుడుంబా దందా ఇప్పుడు గ్రామాల వైపు చొచ్చుకొని వస్తోంది.

అక్కడ కిలో రూ.35.. ఇక్కడ రూ.90 
ఏపీలో కిలో రూ.35 ఉన్న నల్లబెల్లం రాష్ట్రంలో రహస్య మార్కెట్‌లోకి వచ్చే సరికి కిలో రూ.75 నుంచి రూ.90 వరకు పలుకుతోంది. దీంతో బెల్లం అక్రమ రవాణా చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు ముఠాగా ఏర్పడుతున్నారు. విశాఖపట్నం, విజయవాడ, ఒంగోలు, నాగ్‌పూర్, మన్మాడ్, అకోలా వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బెల్లం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వస్తోంది. రైలులో ఖమ్మం జిల్లా మీదుగా సికింద్రాబాద్‌ సమీప గ్రామాల వరకు చేరవేస్తున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య దందా సాగిస్తున్నారు. విశాఖ, తుని, అనకాపల్లి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో 50 కిలోల నుంచి క్వింటాల్‌ వరకు బెల్లం కొనుగోలు చేసి బస్తాల్లో తీసుకుని సాధారణ ప్రయాణికుల్లా రైలు ఎక్కుతున్నారు. జనరల్‌ బోగీల్లో సీట్ల కింద, టాయిలెట్ల వద్ద దాచి ఉంచుతున్నారు. తమ గమ్యానికి రాగానే బస్తాలను కదులుతున్న రైలు లోంచి విసిరేస్తున్నారు. ముఠా సభ్యులు బస్తాలను సేకరించి ఆటోల ద్వారా రాత్రికి రాత్రే గ్రామాలకు తరలించి విక్రయిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement