సాత్విక్‌ కేసులో మలుపు.. అది హత్య కాదు!

Six Years Old Boy Siddhu Murdered in Macharla - Sakshi

మాచర్ల: ఆరేళ్ల చిన్నారి సాయి సాత్విక్‌ సిద్ధు మృతి వ్యవహారంలో షాకింగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. సాయి సాత్విక్‌ సిద్ధూ హత్యకు గురికాలేదని, ఆ బాలుడు ఆడుకుంటూ వెళ్లి క్వారీ గుంటలో పడి చనిపోయాడని గురజాల డీఎస్పీ శ్రీధర్‌ బాబు వెల్లడించారు. మాచర్లలో ఈనెల 22న ఇంటిముందు ఆడుకుంటూ సిద్ధూ అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ మహిళ ఇచ్చిన సమాచారంతో సిద్ధు కిడ్నాప్‌కు గురయ్యాడని భావించామని, గుంటూరు రైల్వే స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. ఓ వ్యక్తి భుజాలపై ఉన్న బాలుడిని సాత్విక్‌ అనుకున్నామని ఆయన వివరించారు. అయితే, విచారణలో అతను గుంటూరు అరండల్‌ పేటకు చెందిన మరో బాలుడిని తేలిందని చెప్పారు. అసలు సాత్విక్‌ కిడ్నాప్‌కు గురికాలేదని, ఇంటి ముందు ఆడుకుంటూ.. ఇంటికి 400 మీటర్ల దూరంలో ఉన్న క్వారీ గుంటలో ప్రమాదవశాత్తు పడిపోయి చనిపోయాడని తెలిపారు. క్వారీ దగ్గర సాత్విక్‌ ఆడుకుంటున్నప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించామని, ఆ బాలుడిది హత్య కాదని డీఎస్పీ తెలిపారు.

ఈనెల 22న ఇంటిముందు ఆడుకుంటూ సిద్ధు అదృశ్యమైన సంగతి తెలిసిందే. దీంతో బాలుడు కిడ్నాప్‌ అయ్యాడని భావించారు. 23న గుంటూరు రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో ఓ వ్యక్తి బాలుడిని ఎత్తుకెళుతున్న దృశ్యాలు చూసి.. సాత్విక్‌ అనుకొని పోలీసులు భ్రమపడ్డారు. ఈ క్రమంలో గురువారం ఉదయం మాచర్ల శివారులోని క్వారీ గుంతలో బాలుడి మృతదేహం లభ్యమవ్వడంతో బాలుడు దారుణ హత్యకు గురైనట్టు తొలుత భావించారు. అయితే, విచారణలో అది నిజం కాదని తేలింది. మాచర్లలోని నెహ్రూనగర్‌లో నివసిస్తున్న వెంకటేశ్వర నాయక్, సరోజ దంపతుల కుమారుడు సాయి సాత్విక్‌ సిద్ధు. బాలుడి తండ్రి వెంకటేశ్వర నాయక్ వెల్దుర్తి మండలం కండ్లకుంటలోని మోడల్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ.. మాచర్లలోని నెహ్రూనగర్‌ 2వ లైన్‌లో అద్దెకు ఉంటున్నారు. సిద్ధూ మృతి విషయం తెలియడంతో బాలుడి కుటుంబసభ్యులు గుండెలవిసేలా కన్నీరుమున్నీరవుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top