మట్టిలో కలిసిపోయాడు!

Sand Worker Died In Working Place Anantapur - Sakshi

ఇసుక తవ్వుతుండగా ప్రమాదం

ముగ్గురు కూలీలపై విరిగి పడిన మట్టితిన్నెలు

మట్టిలో ఊపిరాడక     ప్రాణం కోల్పోయిన కూలీ  

అనంతపురం  ,రొద్దం: మట్టి తిన్నెలు విరిగి మీదపడటంతో కూలీ దుర్మరణం చెందాడు. రొద్దం మండలం ఆర్‌ఎల్‌ కొత్తూరు చెరువులో ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన మేరకు... కోగిర గ్రామానికి చెందిన రమేష్‌ ట్రాక్టర్‌ ద్వారా ఇసుక రవాణా చేస్తూ జీవనం సాగించేవాడు. సోమవారం ముగ్గురు కూలీలతో కలిసి ఆర్‌ఎల్‌ కొత్తూరు చెరువులో ఇసుక కోసం ట్రాక్టర్‌లో వెళ్లాడు. అక్కడ కూలీలు మట్టి కింది నుంచి ఇసుకను తవ్వి ట్రాక్టర్‌లోకి లోడ్‌ చేస్తున్నారు. అలా తవ్వుతున్న క్రమంలో మట్టితిన్నెలు విరిగిపడ్డాయి. ఇద్దరు కూలీలు నరసింహ, విజయ్‌లు సగం వరకు, మరొక కూలీ కోగిర గ్రామానికి చెందిన కురుబ రామాంజినప్ప (40) పూర్తిగా మట్టిలో ఇరుక్కుపోయారు.

ఇద్దరు కూలీలు బయటకు వచ్చి.. పూర్తిగా కూరుకుపోయిన రామాంజినప్పను బయటకు తీసేలోపే అతడు ఊపిరాడక మృతి చెందాడు. మృతుడు రామాంజినప్పకు భార్య రామాంజినమ్మ, ఇంటర్‌ చదువుతున్న కుమారులు అనిల్, సురేంద్ర ఉన్నారు. కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న రామాంజినప్ప మృతి చెందడంతో తమకు దిక్కెవరని భార్య బోరున విలపించింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సురేష్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్‌ నరసింహులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రత్యక్ష సాక్షులను విచారించారు. పోస్టుమార్టం నిమితం మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

అనధికారికంగా ఇసుక రవాణా
ఆర్‌ఎల్‌ కొత్తూరు చెరువులో అధికారుల అనుమతులు లేకుండానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. నాలుగేళ్లుగా భారీ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతోందని గ్రామస్తులు తెలిపారు. అధికారులకు, పోలీసులకు సమాచారమందించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టడంతో చెరువులో పెద్దపెద్ద గొయ్యిలు ఏర్పడ్డాయన్నారు. చివరకు అదే మట్టి కిందివైపు నుంచి ఇసుక తవ్వుతూ ఒక కూలీ ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top