మధ్యప్రదేశ్‌లో చోరీ.. కాకినాడకు చేరి

Robbery in Madhya Pradesh Man Arrest in Kakinada - Sakshi

2.300 కిలోల బంగారాన్ని దొంగిలించిన వ్యక్తి అరెస్టు

తూర్పుగోదావరి, కాకినాడ క్రైం: మధ్యప్రదేశ్‌లోని ఓ హోటల్‌లో మారు తాళంతో బంగారు వ్యాపారి ఉండే రూమ్‌ను తెరచి రూ.2.300 కిలోల బంగారాన్ని దొంగిలించిన ఓ వ్యక్తిని కాకినాడలో త్రీటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా కుప్పం గ్రామానికి చెందిన పిన్నిటి రమేష్‌బాబు కాకినాడలో కొన్ని సంవత్సరాలుగా ఇత్తడి వ్యాపారం చేస్తూ కాకినాడ రూరల్‌ మండలం సర్పవరం వివేకనగర్‌లో ఉంటున్నాడు. ఇతడు 20 రోజుల క్రితం మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌ సిటీ, రాజ్వాడ్‌కు వెళ్లి హోటల్‌ పుష్కర్‌లో రూమ్‌ తీసుకొని ఆ హోటల్‌లో ఉన్న మిగిలిన రూములకు సంబంధించి నకిలీ తాళాలు తయారు చేయించారు. దీనిలో భాగంగా ఆ హోటల్‌లో బస చేసిన ఒక బంగారు వ్యాపారి రూమ్‌ తాళాన్ని తెరిచి ఆ రూమ్‌లో ఉన్న బంగారాన్ని రమేష్‌బాబు దొంగిలించాడు.

దీనిపై మధ్యప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు దర్యాప్తులో ముద్దాయి కాకినాడలో ఉన్నట్టు ఇండోర్‌ ఎస్పీ, జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీకి తెలిపారు. దీనిపై అప్రమత్తమైన జిల్లా పోలీస్‌ యంత్రాంగం కాకినాడ ఎస్‌డీపీవో కరణం కుమార్‌ను అప్రమత్తం చేశారు. కాకినాడ మూడో పట్టణ పోలీసులు పలు చోట్ల దర్యాప్తు చేపట్టారు. ఇండోర్‌ పోలీసులు కాకినాడకు చేరుకోవడంతో త్రీటౌన్‌ శాంతి, భద్రతల విభాగం సిబ్బందితో కలసి సర్పవరం వివేకనగర్‌లో ఉన్న ముద్దాయి రమేష్‌బాబు ఇంటిని చెక్‌ చేయగా ఇండోర్‌ సిటీ, రాజ్వాడ్‌లోని హోటల్‌ పుష్కర్‌లో ముద్దాయి దొంగిలించి తీసుకొచ్చిన 2.300 కిలోల బంగారాన్ని సీజ్‌ చేసి ముద్దాయిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ కరణం కుమార్, సీఐ శ్రీరామకోటేశ్వరరావు శుక్రవారం సాయంత్ర తెలిపారు. ముద్దాయి పిన్నిటి రమేష్‌బాబును నాలుగో అదనపు మొదటి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా రిమాండ్‌ విధించినట్టు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top