నిర్లక్ష్యం ఖరీదు నిండుప్రాణం! | RIMS Staff negligence Patient Died | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం ఖరీదు నిండుప్రాణం!

Apr 22 2019 1:53 PM | Updated on Apr 22 2019 1:53 PM

RIMS Staff negligence Patient Died - Sakshi

మృతురాలిని అంబులెన్స్‌లో తీసుకెళ్తున్న దృశ్యం

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో (రిమ్స్‌) ఆదివారం సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం బలైందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యం కోసం వచ్చిన రోగులను  వైద్యులు, సిబ్బంది పట్టించుకోలేదని ఆవేదన చెందారు. నాలుగు రోజులుగా అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నా.. నర్సింగ్‌ సిబ్బంది, వైద్యులు సరైన వైద్యం అందించలేదని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. సంతకవిటి మండలం మందరాడ గ్రామానికి చెందిన ఈసర్ల పార్వతి (55) ఈ నెల 18వ తేదీన షుగర్, బీపీ అధికంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్చారు.

ఆమెను చేర్చిన నాటి నుంచి మృతిచెందిన వరకు తూతూ మంత్రంగా వైద్యం చేశారే తప్ప.. ఎటువంటి పరీక్షలు జరపలేదన్నారు. రోగి పరిస్థితి రోజురోజుకీ విషమించడంతో కుటుంబ సభ్యులు పలుమార్లు ఆ వార్డులో ఉన్న సిబ్బందికి, వైద్యుల వద్ద మొరపెట్టుకున్నా వారి మనస్సు కరగలేదని ఆరోపిస్తున్నారు. అత్యవసర విభాగంలోనే ఇంత నిర్లక్ష్యం చోటుచేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండో పట్టణ సీఐ మల్లా మల్లేశ్వరరావు, ఐస్‌ఐ, కానిస్టేబుల్‌ వచ్చి డాక్టర్లకు, ఇటు మృతుని బంధువుల వద్ద ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు. మృతిపట్ల ఏదైనా అనుమానాలుంటే రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తామన్నారు. మృతురాలి బంధువులు రిమ్స్‌ వద్ద కొంతసేపు ఆందోళన చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని సద్దుమనిగించారు. రోగి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి మెరుగైన వైద్యం అందించామని, ఈ సంఘటపై తమ పొరపాటు లేదని వైద్యులు అంటున్నారు. వైద్యం అందించినప్పటికీ అనారోగ్య పరిస్థితి వల్ల ఆమె మృతి చెందిందారన్నారు.

సిబ్బంది సెల్‌ఫోన్‌లో వీడియోగేమ్‌లుఆడుకుంటున్నారు
వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందికి మా అమ్మ పరిస్థితి బాగోలేదని, మెరుగైన వైద్యం అందించాలని కోరినప్పటికీ నిర్లక్ష్యం వహించారు. సెల్‌ ఫోన్‌లలో వీడియోగేమ్‌లు, వాట్సాప్‌లో చాటింగ్‌లు చేసుకున్నారే తప్ప సకాలంలో స్పందించలేదు. ఇటువంటి పరిస్థితి మరే ఇతర రోగులకు రాకూడదు. డ్యూటీ సమయంలో సెల్‌ఫోన్‌లు అత్యవసర సమయంలో తప్ప అనవసరంగా వాడకుండా నియంత్రించాలి. – ఈసర్ల వెంకటరమణ, మృతురాలి కుమారుడు

రిమ్స్‌లో జాయిన్‌ చేసి తప్పుచేశాం
ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బులు తట్టుకోలేక మెరుగైన వైద్యం అందిస్తారనే నమ్మకంతో రిమ్స్‌లో జాయిన్‌ చేశాం. వైద్యులు, సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఉంటారని తెలిస్తే చేసేవారం కాదు. ఇంత జరిగినా డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బందిలో ఎటువంటి చలనం లేదు. అవసరమైన సమయంలో రక్త పరీక్షలు, స్కానింగ్‌లు చేసి ఎప్పటికప్పుడు రిపోర్టులు ఇచ్చి ఉంటే ఎటువంటి మందులు వాడాలో తెలిసేది.
–  బి.ఈశ్వరరావు, మృతురాలి బంధువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement