18 ఏళ్ల తర్వాత అరెస్ట్‌.. ఢిల్లీలో అలర్ట్‌

Red Fort terror attack accused arrested after 18 years - Sakshi

సాక్షి, ఢిల్లీ : ఉగ్రవాది అరెస్ట్‌ తో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కి పడింది. లష్కర్‌-ఇ-తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2000 సంవత్సరంలో ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో ఇతను నిందితుడు.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 37 ఏళ్ల బిలాల్‌ అహ్మద్‌ కవాను న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ వద్ద బుధవారం అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్‌ నుంచి అతను వచ్చినట్లు గుజరాత్‌ ఏటీస్‌-స్పెషల్‌ సెల్‌ పోలీసులు వెల్లడించారు. హెడ్‌ క్వార్టర్స్‌కు అతన్ని తరలించిన అధికారులు ప్రస్తుతం అతన్ని ప్రశ్నిస్తున్నారు. 

కవా బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు సేకరించిన అధికారులు హవాలా ద్వారా జమ్ము కశ్మీర్‌లోని ఉగ్ర సంస్థలకు అతను నగదు బదిలీ చేసినట్లు ధృవీకరించారు. ఎర్ర కోట దాడి తర్వాత 18 ఏళ్లుగా కవా పలు ప్రాంతాలు తిరుగుతూ.. చివరకు కశ్మీర్‌కు చేరాడని తెలుస్తోంది. గణతంత్ర్య దినోత్సవ వేడుకలు దగ్గర పడుతుండటంతో మరోసారి ఏదైనా దాడులకు ఫ్లాన్‌ చేశారేమోనన్న అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అలర్ట్‌ ప్రకటించిన ఢిల్లీ పోలీసులు రద్దీ ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

అయితే తన సోదరుడిని చూడటానికి ఢిల్లీకి వచ్చానని.. పోలీసులు అరోపిస్తున్నట్లు తనకు ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేదని కవా చెబుతున్నాడు.  డిసెంబర్‌ 20, 2000 సంవత్సరంలో ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్ర కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన సంబంధించి పాక్‌కు చెందిన మహ్మద్‌ అరిఫ్‌తోపాటు మరో 10 మందిని దోషులుగా న్యాయస్థానం తేల్చింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top