ఏవోబీలో ఎర్రజెండా!

Red flag in the AOB - Sakshi

దేశ వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం సంఘటనలు 2,212

చనిపోయిన పౌరులు 626

చనిపోయిన భద్రతా సిబ్బంది 277

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రలో విస్తరించిన ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఏఓబీ)ను కంచుకోటగా చేసుకుని ఉద్యమాన్ని సాగిస్తున్న మావోయిస్టులు ఒకానొక సమయంలో తమ ఉనికిని చాటుకోవాల్సిన దుస్థితి నుంచి ఏకంగా ఒక శాసనసభ్యుడిని, మరో మాజీ ఎమ్మెల్యేను చంపే స్థాయికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఏవోబీలో ఎర్రజెండాపై ‘సాక్షి’ కథనం.
భద్రతా విధానాల్లో మార్పులు: మావోయిస్టుల భద్రతా విధానాలు పకడ్బ్డందీగా ఉంటాయి. ఏవోబీకి కేంద్ర కమిటీ సభ్యులు వచ్చినప్పుడు, పోలీసులు తమ శిబిరాలపై దాడులు చేసినప్పుడు మావోయిస్టులు మూడంచెల భద్రతా విధానాన్ని అనుసరిస్తుంటారు. దానిలో లోపాలపై ముఖ్య నేతలు కొంత కాలం క్రితం సమీక్ష చేశారు. కొత్త వ్యూహం ప్రకారం..  డెన్‌లో కొందరు ఉంటే 25 మంది వరకు రక్షణ సెంట్రీల మాదిరిగా నాలుగు వైపులా ఉంటారు. 
సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు: మారుతున్న కాలానికనుగుణంగా మావోయిస్టులు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఏవోబీలో చెడ్డా భూషణం గురించి తెలియని వారుండరు. అతను ఉద్యమంలో ఉన్నంత వరకు సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉండేది. అతను పట్టుబడ్డాక  కుడుముల రవి, చలపతి వంటి వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాచార మార్పిడి కోసం ఉపయో గించారు. అలాగే  తమకు అవసరమయ్యే ఆయుధాలను, ఆయుధ తయారీ సామగ్రిని మన్యంలో వ్యాపారాలు, కాంట్రాక్టు పనులు చేసే వారి నుంచే సమకూర్చుకుంటున్నారనే విషయం చాలా కాలం క్రితమే బయటపడింది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి మావోయిస్టులను రప్పించి కేడర్‌ను పెంచుకోవడంతోపాటు అగ్రనాయకత్వంలో మార్పులు చేశారు.

సరికొత్త విధానాలు
సాధారణంగా మావోయిస్టులు సమాచార మార్పిడికి సంప్రదాయ పద్ధతులనే ఎక్కువగా ఆచరిస్తుంటారు. ముఖ్యంగా కోడ్‌ భాషలోనే వారి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థ అందుబాటులోకి వచ్చి కోడ్‌ భాషకు బదులు వాకీ టాకీలు, వైర్‌లెస్‌ పరికరాలు, స్మార్ట్‌ సెల్‌ఫోన్లు వినియోగిస్తున్నారు. సెల్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా మావోయిస్టుల స్థావరాలను పోలీసులు సులభంగా కనిపెట్టగలుగుతున్నారు. ఒకప్పుడు మీడియాకు సమాచారం చెప్పాలంటే విలేకరులను అడవిలోకి తీసుకువెళ్లి మాట్లాడే వారు.కానీ ఇప్పుడు సీడీలు చేసి
మరీ పంపిస్తున్నారు. 

దళపతి.. చలపతి
అనంతపురం జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి అలియాస్‌ చలపతి ఈస్ట్‌ డివిజన్‌ కార్యదర్శిగా ఉండేవారు. ఆయనే ఇప్పుడు మావోయిస్టు పార్టీకి ఏవోబీలో దళపతి అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రా–ఒడిశా బోర్డర్‌ (ఏవోబీ) ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఇటీవలే జాంబ్రిని ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులు చలపతిని టార్గెట్‌ చేశారు. కొరుకొండ ఏరియా కమిటీకి ఒకప్పుడు పట్టున్న ప్రాంతమైన అన్నవరం ప్రాంతంలో కొద్ది కాలంగా మావోయిస్టుల  కదలికలు తగ్గాయి. డిప్యూటీ కమాండర్‌ వంతల మల్లేష్‌ లొంగుబాటుతో పోలీసుల దృష్టి ఈ ప్రాంతం నుంచి పక్కకు మళ్లడంతో చలపతి ఈ ప్రాంతాన్ని షెల్టర్‌ జోన్‌గా మార్చుకున్నాడని తెలుసుకుని పోలీసులు చేసిన దాడిలో అతను తప్పించుకున్నాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top