అరెస్టయితే బయటకు రాలేడు

Ravi Prakash seeking anticipatory bail is in pending - Sakshi

కఠిన షరతులతోనైనా బెయిల్‌ ఇవ్వండి 

రవిప్రకాశ్‌ న్యాయవాది వాదన 

టీవీ9 లోగో యాజమాన్యానిదే 

బెయిల్‌ ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారు... 

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రతివాదన 

సాక్షి, హైదరాబాద్‌: టీవీ9 లోగో కంపెనీ పేరిటే రిజిస్టర్‌ అయిందని, ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ వ్యక్తిగతం కాదని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో వాదించారు. లిటిగేషన్‌ కోసమే రూ.వంద కోట్ల విలువ చేసే టీవీ9 లోగోను రూ.99 వేలకే రవిప్రకాశ్‌ అమ్మేశారని చెప్పారు. ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ రవిప్రకాశ్‌ దాఖలు చేసిన రిట్‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును తర్వాత వెల్లడిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గండికోట శ్రీదేవి ప్రకటించారు. టీవీ9 లోగోను 15 ఏళ్లపాటు వాడుకున్నందుకు 4% వాటా ఉంటుందనే వాదనలో అర్థం లేదని ప్రతాప్‌రెడ్డి వాదించారు.

టీవీ9 చానల్‌ కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయలు చేతులు మారాయన్న రవిప్రకాశ్‌ ఆరోపణను ఖండించారు. రూ.500 కోట్లు బ్యాంకు లావాదేవీల ద్వారానే జరిగాయన్నారు. కొత్త యాజమాన్యం చట్ట ప్రకారం డైరెక్టర్లను నియమించిందని, అయితే రవిప్రకాశ్‌ ఫోర్జరీ పత్రాలు తయారు చేసి వాటా బదిలీ అయినట్లు చేశారన్నారు. రవిప్రకాశ్‌కు బెయిల్‌ మంజూరైతే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందన్నారు. రవిప్రకాశ్‌ను అరెస్ట్‌ చేస్తే బయటకు రావడం కష్టమని ఆయన తరఫు న్యాయవాది దిల్జీత్‌సింగ్‌ అహ్లూవాలియా వాదించారు. ముందస్తు బెయిల్‌ ఇస్తే పోలీసుల దర్యాప్తుకు రవిప్రకాశ్‌ సహకరిస్తారని, అందుకు ఎలాంటి కఠిన షరతులు పెట్టినా ఫర్వాలేదన్నారు. కావాలని మూడు కేసుల్లో ఇరికించినప్పుడు ముందస్తు బెయిల్‌ ఇవ్వొచ్చని, సుప్రీం కోర్టు సిబ్బియా కేసులో ఇచ్చిన తీర్పును అనుసరించి బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top