‘పామునే కాదు..నిన్నూ పట్టుకుంటా’

Puducherry Goverment Official Harassments On Women Employees - Sakshi

ప్రభుత్వ సంచాలకుని రాసలీల సంభాషణలు

27 మంది మహిళా ఉద్యోగినుల ఫిర్యాదు

విచారణకు ఆదేశించిన పుదుచ్చేరి గవర్నర్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు గురిచేయడంలో తమకేమీ మినహాయింపు లేదని పుదుచ్చేరి ప్రభుత్వ ఉన్నతాధికారి జుగుప్సాకరమైన తీరులో రుజువు చేసుకున్నాడు. సదరు దుశ్సాసన అధికారిని శిక్షించేందుకు పుదుచ్చేరి గవర్నర్‌ ప్రత్యేక విచారణ కమిటీని నియమించినా మహిళల ఫిర్యాదుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా కోర్టు నుంచే రక్షణ పొంది కాలక్షేపం చేస్తున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.

పుదుచ్చేరిలో ప్రభుత్వశాఖలు, ప్రయివేటు సంస్థల్లో పనిచేసే మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు గవర్నర్‌ కిరణ్‌బేడీకి ఇటీవల కాలంలో తరచూ ఫిర్యాదులు అందాయి. దీంతో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

పుదుచ్చేరి బాలల రక్షణ, సంక్షేమ కమిటీ చైర్మన్, డాక్టర్‌ విద్యా రామ్‌కుమార్‌ నేతృత్వంలో ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటైంది. అనేక ప్రభుత్వ శాఖల, ప్రయివేటు సంస్థల ఉద్యోగులు తమను లైంగికంగా వేధిస్తున్నట్లు పలువురు బాధితులు విద్యా రామ్‌కుమార్‌కు చెప్పుకుని వాపోయారు. ప్రభుత్వంలో సంచాలకుల స్థాయిలోని ముగ్గురు అధికారులు సహా పదిమంది తమను వేధిస్తున్నట్లు 27 మంది మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. లైంగిక కార్యకలాపాలకు తలొగ్గకుంటే బదిలీ చేస్తామని బెదిరింపులు, ఇతరత్రా ఇబ్బందులు పెడుతున్నట్లు ఫిర్యాదు చేశారు. నేరుగా వచ్చి సంజాయిషీ ఇవ్వాల్సిందిగా సదరు సంచాలకులకు విద్యారామ్‌కుమార్‌ సమన్లు పంపారు. అయితే సమన్లు అందినా బుధవారం ఆయన హాజరుకాలేదు. అంతేగాక విద్యా రామ్‌కుమార్‌ తనను విచారించేందుకు వీలులేదంటూ మద్రాసు హైకోర్టు ద్వారా ఆయన స్టే పొందారు. దీంతో కోర్టు మంజూరు చేసిన స్టేను ఎత్తివేసి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు.

విచారణ కమిటీకి అందిన ఆడియో
ఇద్దరు మహిళా ఉద్యోగినులతో తప్పుడు సంకేతాలతో సంచాలకులు జరిపిన సెల్‌ఫోన్‌ సంభాషణ ఆడియోను ఉద్యోగినులు బయటపెట్టారు. విధుల్లో పడుతున్న ఇబ్బందులు చెప్పుకున్నçప్పుడు ద్వంద్వార్థాలతో బదులివ్వడం, నన్ను గమనించుకుంటే నీకు కష్టాలే ఉండవు అనడం, ఆఫీసు పరిసరాల్లో పాములు వస్తున్నాయి సార్‌ అంటే.. నేను స్వయంగా వచ్చి పాములూ పట్టుకుంటా.. నిన్నూ పట్టుకుంటానని వెకిలిగా మాట్లాడిన సెల్‌ సంభాషణల ఆడియోను మహిళా ఉద్యోగినులు విచారణ కమిటీకి అందజేశారు. సదరు సంచాలకులకు వ్యతిరేకంగా మరికొందరు ఉద్యోగినులు కొన్ని వీడియో టేపులను సైతం గురువారం అప్పగించనున్నట్లు తెలుస్తోంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top