‘దిశ’ కాల్‌తో అర్ధరాత్రి బాలికకు రక్షణ 

Protection for a girl at midnight with Disha App - Sakshi

బాలిక వెంటబడిన కామాంధుడు

దిశ యాప్‌తో బాలిక ఫిర్యాదు 

10 నిమిషాల్లో చేరుకున్న పోలీసులు

అదుపులోకి నిందితుడు

గుమ్మఘట్ట: మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ యాప్‌ మారుమూల గ్రామాల్లో సైతం సకాలంలో సేవలను అందిస్తోంది. అనంతపురం జిల్లాలో ఓ బాలిక అర్ధరాత్రి వేళ దిశ యాప్‌ ద్వారా రక్షణ పొందింది. స్థానిక ఎస్‌ఐ తిప్పయ్యనాయక్‌ తెలిపిన పూర్తి వివరాల మేరకు.. గుమ్మఘట్ట మండలంలోని 75–వీరాపురం తండాలో గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్‌ జయంతి వేడుకలను శనివారం రాత్రి  ఘనంగా నిర్వహించారు.

ఊరు ఊరంతా ఉత్సవంలో పాల్గొంది. మహిళలు ఉత్సాహంగా కోలాటమాడారు. ఓ 16 ఏళ్ల బాలికకు నిద్ర వస్తోండడంతో రాత్రి 12:45 నిమిషాలకు పక్క వీధిలో ఉన్న ఇంటికి వెళ్లసాగింది. ఎప్పటి నుంచో ఆమెపై కన్నేసిన గ్రామానికి చెందిన తిరుపాల్‌నాయక్‌ (21) అనే యువకుడు వెంటపడ్డాడు. కోరిక తీర్చాలని చెయ్యి పట్టుకున్నాడు. అమ్మాయి చెంప మీద కొట్టి గట్టిగా కేకలు పెట్టింది.

వెంటనే తక్షణ సాయం కోసం ‘దిశ యాప్‌’కు మెసేజ్‌ చేసింది. ఆ లోపు అటువైపు ఇంటికి వెళ్తున్న బాలిక చిన్నాన్న ఈ ఘటనను గమనించి అక్కడికి చేరుకునేలోగా యువకుడు పరారయ్యాడు. విజయవాడ ‘దిశ’ కంట్రోల్‌ రూమ్‌ నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయానికి బాధితురాలి సమాచారం అందింది. అక్కడి నుంచి రాయదుర్గం రూరల్‌ సీఐ పి.రాజ, ఎస్‌ఐ తిప్పయ్యనాయక్‌లను ఎస్పీ అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేవలం 10 నిమిషాల్లోనే ఘటన స్థలానికి చేరుకున్నారు.

బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఓ ఇంట్లో దాక్కున్న తిరుపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. మారుమూల గ్రామాల్లోని యువతులు కూడా ‘దిశ యాప్‌’ గురించి తెలుసుకోవడం వల్లే నిందితున్ని వెంటనే పట్టుకోగలిగామని పోలీసులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top