పొలిటీషియన్లే ఇతడి టార్గెట్‌!

Politicians are his target! - Sakshi

     కేంద్ర, రాష్ట్ర పథకాల పేరుతో టోకరా

     ఇప్పటి వరకూ 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలకు టోపీ

     19 సార్లు జైలుకు వెళ్లివచ్చినా మారని బుద్ధి

     మరోసారి అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌  

సాక్షి, హైదరాబాద్‌: అతడు పుట్టింది తూర్పుగోదావరి జిల్లాలో.. కరీంనగర్, ఖమ్మం, విశాఖ జిల్లాల్లో పని చేశాడు.. గుంటూరు జిల్లాలో స్థిరపడ్డాడు.. అతడు టార్గెట్‌ చేసింది మాత్రం రాజకీయ నాయకుల్నే.. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, రాజీవ్‌ యువకిరణాలు, ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన తదితర పథకాల పేరు చెప్పి ఇప్పటి వరకు 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలకు టోకరా వేశాడు.. ఏపీ, తెలంగాణల్లోని 29 పోలీస్‌స్టేషన్లలో ఇతడిపై కేసులున్నాయి. ఇప్పటి వరకు 19 సార్లు జైలుకు వెళ్లివచ్చాడు. ఘరానా మోసగాడు తోట బాలాజీనాయుడు(40) నేర చరిత్ర ఇదీ. తాజాగా తెలంగాణ ఎమ్మెల్సీ ఆకుల లలిత నుంచి రూ.10 లక్షలు కాజేసిన కేసులో నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు బాలాజీ చిక్కినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌ రావు బుధవారం వెల్లడించారు. 

బీటెక్‌ చదివి.. ఏసీబీకి చిక్కి.. 
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన బాలాజీ బీటెక్‌ పూర్తి చేశాడు. 2003లో ఎన్‌టీపీసీలో జూనియర్‌ ఇంజనీర్‌గా చేరి రామగుం డం, పాల్వంచ, విశాఖల్లో పని చేశాడు. అప్ప టి తణుకు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు ఆనంద్‌ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుం టూ ఏసీబీకి చిక్కాడు. కేసు నిరూపితం కావ డంతో ఉద్యోగం కోల్పోయాడు. విశాఖ జైల్లో నేరగాళ్లతో ఏర్పడిన పరిచయాలతో మోసాలు చేయడమే వృత్తిగా మార్చుకున్నాడు. 

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి ఫోన్‌ నంబర్లు.. 
బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎంక్వైరీ నంబర్‌ ద్వారా ప్రజాప్రతినిధుల ఫోన్‌ నంబర్లు తెలుసుకుని 2013లో వారిని టార్గెట్‌ చేశాడు. తాను రాజీవ్‌ యువకిరణాలు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌నంటూ వారి పీఏలకు చెప్పి ఒక్కో అభ్యర్థికీ రూ.1,060 చొప్పున డిపాజిట్‌ చేయాలంటూ బ్యాంకు ఖాతా నంబర్లు ఇచ్చి రూ.3.50 లక్షల వరకు వసూలు చేశాడు. బీజేపీ నాయకుడు రాంజగదీష్‌ ఫిర్యాదుతో పోలీసులు 2013లో అరెస్టు చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన బాలాజీ అప్పటి ఎంపీలు వీహెచ్, దేవేందర్‌గౌడ్, పాల్వాయిలను టార్గెట్‌ చేశాడు. వారితో పాటు వారి పీఏలకూ ఫోన్లు చేసి యువకిరణాల ద్వారా ఉద్యోగాల పేరు చెప్పాడు. వీరి నుంచి రూ.3.07 లక్షలు స్వాహా చేశాడు. తానే ఫోన్‌ చేస్తానని చెప్పిన వ్యక్తి అందుబాటులోకి రాకపోవడంతో అనుమానం వచ్చి ఫిర్యాదు చేయగా అరెస్టయ్యాడు. 

కేంద్ర పథకం పేరుతో ఎమ్మెల్సీని.. 
హైదరాబాద్‌ పోలీసులు గత జనవరిలో బాలాజీపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. ఏడాది పాటు జైల్లో ఉండి ఈ ఏడాది జనవరిలో విడుదలైన బాలాజీ సెప్టెంబర్‌ 12న ఎమ్మెల్సీ ఆకుల లలితకు కాల్‌ చేసి తాను కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతోద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు చెందిన రూ.2 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, ముందుగా 5శాతం చెల్లిస్తే ఆ మొత్తం విడుదల చేయిస్తానని చెప్పాడు. దీంతో ఆమె తన కుమారుడు దీపక్‌ ద్వారా బాలాజీ చెప్పిన బ్యాంకు ఖాతాలోకి రూ.10 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేయించారు. మోసపోయానని గుర్తించి సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలోని బృందం బాలాజీని పట్టుకుంది. 

ఒక్కోసారి ఒక్కోలా.. 
ప్రజాప్రతినిధుల వ్యక్తిగత కార్యదర్శులకు ఫోన్లు చేసి ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు ఉన్నాయని, మీ నియోజకవర్గం నుంచి యువతను సిఫార్సు చేయాల్సిందిగా మీమీ ఎమ్మెల్యేలకు సూచించాలంటూ ఎర వేశాడు. డిపాజిట్‌ పేరుతో కొంత మొత్తం బ్యాంకు ఖాతాలో వేయించుకుని మోసం చేశాడు. ఈ నేరంపై విజయనగరం రెండో టౌన్‌ పోలీసులు 2009లో బాలాజీని అరెస్టు చేసి జైలుకు పంపారు. నల్లగొండ జిల్లాలోనూ అనేక మందిని మోసం చేయడంతో 2010లో యాదగిరిగుట్ట పోలీసులు కటకటాల్లోకి పంపారు. ఇలానే మరికొందరిని ముంచి జైలుకు వెళ్లివచ్చాడు. సత్యనారాయణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ముఠా కట్టి కొన్ని నేరాలు చేశాడు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top