
విలేకరులతో మాట్లాడుతున్న సీఐ తాతారావు
సాక్షి, అనకాపల్లి (విశాఖపట్నం): చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. అపహరణకు గురైన 14 గంటల్లో నిందితుడిని పట్టుకున్నారు. చిన్నారిని కిడ్నాప్ చేస్తే ఆమె తల్లి తనతో కలిసి ఉండేందుకు అంగీకరిస్తున్నందన్న దుర్బుద్ధితోనే నిందితుడు ఈ పనిచేశాడని పోలీసులు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పట్టణ సీఐ ఎస్.తాతారావు శనివారం విలేకరులకు కేసు వివరాలు చెప్పారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన కె.తిరుపతమ్మ భర్తతో గొడవ పడి విడిగా ఉంటోంది. కూలి పనుల నిమిత్తం తన మూడేళ్ల కుమార్తె లక్ష్మీభవానీని తీసుకుని అనకాపల్లికి బయలుదేరింది. ఆమె రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో దిగి మరో రైలు ఎక్కేందుకు సిద్ధపడగా అక్కడ విజయనగరం జిల్లా బాడంగి మండలం కోటిపల్లి గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ ఎం.లక్ష్మణరావు తిరుపతమ్మకు పరిచయమయ్యాడు.
లక్ష్మణరావుకు భార్యాపిల్లలు ఉన్నారు. వారు స్వగ్రామంలో ఉంటున్నారు. వారితో విభేదాలు వచ్చిన లక్ష్మణరావు విజయవాడలో ఉంటూ పని ఉన్న ప్రాంతానికి వెళ్తుంటాడు. రైల్వే స్టేషన్‌లో కలిసిన తిరుపతమ్మను ఎక్కడికి వెళ్తున్నారని లక్ష్మణరావు ప్రశ్నించగా కూలీ పనుల నిమిత్తం వెళ్తున్నట్టు సమాధానమిచ్చింది. కూలీపని ఇప్పిస్తానని లక్ష్మణరావు చెప్పడంతో తిరుపతమ్మ తన కుమార్తెను లక్ష్మీభవానీ తీసుకుని లక్ష్మణరావుతో కలిసి 25వ తేదీ రాత్రి అనకాపల్లి వచ్చింది. అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలో లక్ష్మణరావు భవన నిర్మాణ పని ఉందని అదేరోజు రాత్రి తీసుకెళ్లాడు. ఆ రాత్రి అక్కడ నిద్రించి 26వ తేదీన పని చేశారు. ఆరోజు రాత్రి అక్కడే నిద్రించారు. అయితే తనకు భార్య లేదని, తనతో కలిసి ఉండాలని తిరుపతమ్మను లక్ష్మణరావు కోరాడు. అందుకు తిరుపతమ్మ నిరాకరించింది.
27, 28 తేదీల్లో కూలి దొరకలేదు. పనులు లేకపోవడంతో సినిమా చూద్దామని చెప్పి తిరుపతమ్మను లక్ష్మణరావు బయలుదేరించాడు. తిరుపతమ్మ, ఆమె కుమార్తె, లక్ష్మణరావు అనకాపల్లి పట్టణంలో ఒక థియేటర్‌కు వచ్చి సినిమా చూశారు. సినిమా మధ్యలో పాప ఏడుస్తుండడంతో లక్ష్మణరావు పాప బయటకు తీసుకొచ్చి, ఆమెతో పాటు పరారయ్యాడని సీఐ చెప్పారు. లక్ష్మణరావు, పాప రాకపోవడంతోతిరుపతమ్మకు అనుమానం వచ్చి బయటకు వచ్చి చూడగా లేకపోవడంతో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ చెప్పారు. ఎస్‌ఐలు రామకృష్ణ, స్వీటీ, ఆధ్వర్యంలో పోలీసులు గాలించగా సింహాచలం మెట్లపై పాప లక్ష్మీభవానీతో లక్ష్మణరావు ఉన్నట్టు గుర్తించి, అనకాపల్లి తీసుకొచ్చారు. సీఐ తాతారావు సమక్షంలో తల్లి తిరుపతమ్మకు పాప లక్ష్మీభవానీ అప్పగించారు.