కస్టమర్లు ప్రాక్టికల్స్‌ కోరుకుంటారు.. | police reveals how cheat rice pulling gang | Sakshi
Sakshi News home page

‘పుల్లింగ్‌’ వయా ‘కుకింగ్‌’!

Dec 23 2017 8:57 AM | Updated on Dec 23 2017 8:57 AM

police reveals how cheat rice pulling gang - Sakshi

రైస్‌పుల్లింగ్‌ బిందెను చూపిస్తున్న కమిషనర్‌ (ఫైల్‌)

సాక్షి, సిటీబ్యూరో: అదో సాధారణ బిందె... దాన్నే అతీంద్రియశక్తులున్న రైస్‌పుల్లర్‌గా మోసగాళ్లు చెప్తుంటారు... వీళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ కొందరు ‘కస్టమర్లు’ మాత్రం ‘ప్రాక్టికల్స్‌’ కోరుకుంటారు... తమ ముందే ఆ బిందె బియ్యాన్ని ఆకర్షించాలని, అప్పుడే ఖరీదు చేస్తామని షరతులు పెడతారు... ఇలాంటి వారిని బుట్టలో వేసుకునేందుకు మోసగాళ్ళు పక్కా పథకం ప్రకారం వ్యవహరిస్తున్నారు... ఈ చీటర్స్‌ సాధారణ బిందెను ‘రైస్‌పుల్లర్‌’గా మార్చడానికి ‘కుకింగ్‌’ చేస్తుంటారు... నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అరెస్టు చేసిన ఘరానా గ్యాంగ్‌ విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 

అసలు కారణం ఇనుప రజను...
రైస్‌పుల్లింగ్‌ బియ్యాన్ని ఆకర్షించడం అని అర్థం. ఇలాంటి శక్తులున్న పాత్రలు, బిందెలు, చెంబుల పేరు చెప్పి మోసగాళ్ళు అందినకాడికి దండుకుంటుంటారు. సాధారణంగా వీళ్ళు కస్టమర్లకు రైస్‌పుల్లింగ్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను మాత్రమే చూపిస్తుంటారు. అనేక సందర్భాల్లో తాము విక్రయిస్తున్న ‘విలువైన పాత్రనూ’ చూసే అవకాశం ఖరీదు చేసుకునే వారికి ఇవ్వరు. అయితే ఎవరైనా తమకు ఆ పాత్ర మహిమల్ని ప్రత్యక్షంగా చూపించమని కోరవచ్చనని ముందే గ్రహించే ఇలాంటి ముఠాలు తమదైన శైలితో అన్నం వండి సిద్ధంగా ఉంచుకుంటారు. బియ్యంలో సన్నని ఇనుప రజను కలిపి బిరుసుగా ఉండేలా అన్నం వండుతారు. దీన్ని ఎంట బెట్టడం ద్వారా మళ్ళీ బియ్యం మాదిరిగా కనిపించేలా చేస్తారు. ఇలా తయారైన ‘సెకండ్‌ హ్యాండ్‌ బియ్యం’లో ఇనుప రజను కూడా ఉంటుంది. మోసగాళ్ళు రైస్‌పుల్లర్‌గా చెప్తున్న పాత్రలో అంతర్భాగంగా అయిస్కాంతం ఏర్పాటు చేస్తారు. దీంతో ఈ పాత్రకు దగ్గరగా ఇనుప రజనుతో తయారైన ‘బియ్యం’ వస్తే అవి దానికి అతుక్కుంటాయి. ఇలాంటి షోలు చూపించే ఈ మోసగాళ్ళు జనాలను బుట్టలో వేసుకుంటుంటారు. 

బాధితుడిగా మారి అధ్యయనం కోసం...
సాధారణంగా ఇలాంటి ముఠాలకు చెందిన వారిలో అనేక మంది తొలుత బాధితులుగా మారినవారే అని పోలీసులు చెప్తున్నారు. తాము నష్టపోయిన మొత్తాన్ని తిరిగి అదే మార్గంలో సంపాదించాలనో, అసలు ఈ రైస్‌పుల్లర్లు ఉన్నాయా? లేవా? అనే అధ్యయనం కోసమో అలాంటి ముఠాలతో జత కడుతున్నారు. ఒకసారి తేలిగ్గా డబ్బు వచ్చిపడిన తర్వాత అదే దందా కొనసాగించేస్తున్నారు. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అరెస్టు చేసిన నలుగురిలో మహ్మద్‌ ఫజలుద్దీన్‌ అలియాస్‌ ఫైజల్‌ ఒకరు. జీడిమెట్లలోని ప్రకాశం పంతులు నగర్‌కు చెందిన ఈ సివిల్‌ కాంట్రాక్టర్‌ నాలుగేళ్ళ క్రితం ఇలాంటి ముఠా చేతిలోనే పడి రూ.లక్షల్లో మోసపోయాడు. దీంతో రైస్‌పుల్లర్స్‌ కోసం అధ్యయనం ప్రారంభించి ఏపీ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో సంచరించాడు. ఈ నేపథ్యంలోనే ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన వి.ఆంజనేయులుతో పరిచయమైంది. మాటకారి అయిన అతడితోనే జట్టుకట్టి రైస్‌ పుల్లింగ్‌ మోసాలు మొదలుపెట్టాడు. 

రాహుల్‌ నగరవాసేనా?
ఈ ముఠాకు సహకరించిన వారిలో కోల్‌కతాలో నివసిస్తున్న రాహుల్‌ హుడా ఒకరు. ఈ గ్యాంగ్‌ తమ వల్లోపడిన వారితో వారు ఖరీదు చేయబోయే రైస్‌పుల్లర్లను తనిఖీ చేయించి, సర్టిఫికేషన్‌ తర్వాతే అందిస్తామని చెప్తుండేవాడు. ఇలా తనిఖీలు చేసే నిపుణుడిగా రాహుల్‌ నటించాడు. కోల్‌కతాలోని చంద్రారోడ్‌లో బీటా ట్రేడర్స్‌ పేరుతో ఓ కార్యాలయం నిర్వహిస్తున్న ఇతగాడు ఈ ముఠా పిలుపు మేరకు రెండుమూడుసార్లు సిటీకి వచ్చాడు. వస్తూ తన వెంట ఇద్దరు ముగ్గురు అనుచరులు, కొన్ని అంతుచిక్కని ఉపకరణాలను తీసుకువచ్చాడు. ఎస్డీ రోడ్‌లో ఉన్న ఆంజనేయులకు చెందిన  కార్యాలయం కేంద్రంగానే ఈ ఉపకరణాలతో ఆయా రైస్‌పుల్లర్స్‌ను పరీక్షించినట్లు నటిస్తూ, వాటికి సర్టిఫికేషన్‌ ఇచ్చేవాడు. దీనికోసం బాధితులే ఇతడితో పాటు మందీమార్బలానికి అవసరమైన ఫ్లైట్‌ టిక్కెట్లు, బస ఖర్చులు భరించేవారు. వీటికి అదనంగా రాహుల్‌ కొంతమొత్తం ఫీజుగానూ వసూలు చేసేవాడు. గురువారం చిక్కిన గ్యాంగ్‌ చెప్పిన వివరాల ప్రకారం ఇతగాడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తేనని, పేరు మార్చుకుని ఏళ్ళుగా కోల్‌కతాలో నివసిస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అరెస్టు చేయడానికి ఓ ప్రత్యేక బృందం త్వరలో అక్కడకి వెళ్ళనుంది. 

పరువు కోసం ఫిర్యాదులు చేయకుండా...
టాస్క్‌ఫోర్స్‌ అరెస్టు చేసిన ఈ నలుగురి పైనా ప్రస్తుతానికి బోయిన్‌పల్లి, మహంకాళి ఠాణాల్లోనే కేసులు నమోదై ఉన్నాయి. అయితే వీరి చేతిలో మోసపోయిన వారి సంఖ్య పదుల సంఖ్యలో ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. బాధితుల్లో అనేక మంది విద్యాధికులు, ఉన్నత కుటుంబాలకు చెందిన వానే కావడంతో ఈ విషయం బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. తమకు జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని భావిçస్తూ మిన్నకుండిపోతున్నారు. గురువారం చిక్కిన ఆంజనేయులు, ఫజలుద్దీన్, బాబుల్, బాబూరావు చేతిలో నగరానికి చెందిన ఓ పెద్దింటి మహిళ సైతం రూ.10 లక్షల మేర మోసపోయారు. దీంతో ఫిర్యాదు చేయమంటూ పోలీసులు కోరగా.. ఆమె నిరాకరించారు. ఈ నలుగురు నిందితులను శుక్రవారం మహంకాళి పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement