ఆర్మీ ఉద్యోగి సతీష్‌ది హత్యే

Police Revealed Army Officer Death Mystery In Visakhapatnam - Sakshi

వివాహేతర బంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి కడతేర్చిన భార్య

ఆగస్టు 19న ఆత్మహత్యగా కేసు నమోదు

ఆర్మీ అధికారులు పోస్ట్‌మార్టం రిపోర్టు అడగడంతో వెలుగులోకి వాస్తవాలు

సాక్షి, విశాఖపట్నం: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంగా ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను భార్యే కడతేర్చింది. మద్దిలపాలెంలో గత నెల 18న జరిగిన ఘటనలో చిక్కుముడిని పోలీసులు విప్పారు. మొదట ఆత్మహత్యగా కేసు నమోదు చేసినప్పటికీ ఆర్మీ అధికారులు పోస్టుమార్టం రిపోర్టు అడగడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ మేరకు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్‌ కమిషనర్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నగర పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా వెల్లడించారు.

ఇండియన్‌ ఆర్మీలో పనిచేస్తున్న దల్లి సతీష్‌కుమార్‌ మద్దిలపాలెం పెద్దనుయ్యి ప్రాంతంలో రెండు అంతస్తుల భవనంలో నివసిస్తున్నాడు. ఆయనకి 2010లో మాజీ ఆర్మీ ఉద్యోగి కూతురైన జ్యోతితో వివాహం జరిగింది. వారికి కృష్ణ ప్రవీణ్, కృష్ణ లిథిక్‌ అనే ఇద్దరు కుమారులున్నారు. భర్త సతీష్‌కుమార్‌ ఉద్యోగరీత్యా దూరంగా ఉండటంతో జ్యోతి కొద్ది కాలంగా సిమ్మ భరత్‌(24) అనే యువకుడితో అక్రమసంబంధం పెట్టుకుంది. వారిద్దరూ రహస్యంగా కలుసుకుంటూ ఉండేవారు. ఈ విషయం సతీష్‌కుమార్‌ తల్లి పార్వతి దేవికి తెలియడంతో జ్యోతిని పలుమార్లు మందలించింది.

ఈ క్రమంలో జూలై 28న తన భర్త సెలవు పెట్టుకుని వస్తున్నాడని తెలుసుకున్న జ్యోతి తన ప్రియుడికి విషయాన్ని చెప్పింది. తనను కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారని చెప్పింది. ఇంతలో ఇంటికి వచ్చిన సతీష్‌కుమార్‌ తన భార్య బాగోతం తెలుసుకుని నిలదీశాడు. ఈ నేపథ్యంలో ఆగస్టు 19న వేకువజామున సతీష్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు అతని భార్య జ్యోతి ఎంవీపీ కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అక్కడితో విషయం వదిలేశారు. అయితే ఆర్మీ అధికారులు పూర్తి వివరాలతో పోస్టుమార్టం నివేదిక కావాలని అడగడంతో అధికారులు మళ్లీ దర్యాప్తు చేపట్టడంతో వాస్తవాలు వెలుగుచూశాయి.

మందులో నిద్రమాత్రలు కలిపి... 
సెలవులకు ఇంటికి వచ్చిన భర్త తన ప్రవర్తనపై ప్రశ్నించిన విషయం భరత్‌కు జ్యోతి తెలియచేయడంతో ఇద్దరూ కలిసి సతీష్‌కుమార్‌ను చంపేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో సతీష్‌కుమార్‌ తాగే మందులో నిద్రమాత్రలు కలిపి తరువాత చున్నీతో గొంతు నొక్కి చంపాలని పథకం పన్నారు. అనుకున్నట్లుగానే ఆగస్టు 18న సతీష్‌ తాగే మందులో అతని భార్య జ్యోతి, ఆమె ప్రియుడు భరత్, భరత్‌ స్నేహితుడైన గొడ్ల భాస్కర్‌రావు నిద్రమాత్రలు కలిపారు. అనంతరం మత్తులోకి జారిపోయిన సతీష్‌ను చున్నీతో గొంతు నొక్కి చంపేశారు. తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ట్లు నమ్మించేందుకు అతని బెడ్రూమ్‌లోకి తీసుకెళ్లి చీరతో ఫ్యానుకు వేలాడదీశారు. ఆగస్టు 19న తెల్లవారి తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని అత్తమామలకు చెప్పి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎంవీపీ పోలీసులకు జ్యోతి ఫిర్యాదు చేసింది.

స్థానికులకు, కుటుంబ సభ్యులకు అనుమానం రాకపోవడంతో కేసును పూర్తిగా మూసేశారు. ఆగస్టు 23న పోస్ట్‌మార్టం రిపోర్టులన్నీ వివరంగా కావా లని స్థానిక పోలీసులను ఆర్మీ అధికారులు కోరా రు. దీంతో సతీష్‌ మృతదేహానికి పోస్టుమార్టం చేయించగా వచ్చిన రిపోర్టు ఆధారంగా దర్యాప్తు చేయడంతో సతీష్‌కుమార్‌ది ఆత్మహత్య కాద ని... హత్యేనని ఎంవీపీ పోలీసులు తేల్చారు. హత్య చేసిన రోజే మృతుడి రెండు ఉంగరాలను భరత్, భాస్కరరావులకు జ్యోతి ఇచ్చేయడంతో వారు వాటిని విక్రయించి జల్సాలు చేశారు. లభించిన సాక్ష్యాల ఆధారంగా సెప్టెంబర్‌ 9న జ్యోతి, భరత్, భాస్కర్‌రావును మద్దిలపాలెం బస్సు డిపో వద్ద ఎంవీపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సమావేశంలో డీసీపీ – 1 రంగారెడ్డి, ఏసీపీ ఆర్‌వీఎస్‌ఎన్‌ మూర్తి, ఎంవీపీ కాలనీ పోలీస్‌స్టేషన్‌ సీఐ షణ్ముఖరావు, ఎస్‌ఐ భాస్కర్‌రావు పాల్గొన్నారు. కేసులోని చిక్కుముడి విప్పిన అధికారులను సీపీ అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top