నిందితుల కోసం గాలింపు

Police Inquiry on Bangi Upendra Murder Case Kurnool - Sakshi

31 రాత్రి ఉపేంద్ర హత్య కేసు నిందితుల కోసం ప్రత్యేక బలగాలు

నంద్యాల ఆస్పత్రిలో కత్తితో హల్‌చల్‌ చేసిన ఘటనపై ఎస్పీ సీరియస్‌

కర్నూలు,మహానంది: మహానందిలోని ఈశ్వర్‌నగర్‌కు చెందిన బంగి ఉపేంద్ర (21) హత్య కేసు నిందితుల కోసం వివిధ ప్రాంతాలకు చెందిన ప్రత్యేక పోలీసులు బరిలోకి దిగారు. అలాగే మహానంది ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కాలనీలో పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. నిందితులను పట్టుకునేందుకు మహానందిలో గతంలో పనిచేసిన పోలీసు కానిస్టేబుళ్లు, ప్రస్తుతం స్పెషల్‌పార్టీలో ఉన్న మరికొందరిని పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దింపారు. హత్యకు పాల్పడిన మహానంది యువకుడు నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో కత్తితో హల్‌చల్‌ చేసిన ఘటన పత్రికల్లో రావడంతో జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎస్పీ  స్వయంగా మహానంది ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఫోన్‌ చేసి మాట్లాడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా హత్యకు గురైన ఉపేంద్ర ఇంటి సమీపంలో ఎస్‌ఐ ఆధ్వర్యంలో ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుళ్లు, పోలీసులు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గురువారం పికెటింగ్‌ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హత్యకు పాల్పడిన వారిలో ఓ నిందితుడి స్నేహితుడి కోసం మహానంది పోలీసులు గాలించారు. అతడిని పట్టుకుంటే అసలు నిందితుడు దొరకవచ్చనే కోణంలో గాలిస్తున్నారు. అలాగే ఉపేంద్రపై కత్తితో దాడిచేసిన వసీం తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. 

నవ్వుతూ కామెంట్లు చేయడంపై ఉద్రిక్తత..
హత్యకు పాల్పడిన వారి బంధువులు కొందరు అదే కాలనీలో, ఉపేంద్ర ఇంటి సమీపంలో ఉంటున్నారు. దీంతో వారు అక్కడివారిని చూస్తూ నవ్వుతూ హేళనగా మాట్లాడుకోవడంపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. విషయం తెలిసిన మహానంది ఎస్‌ఐ వెంటనే సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హేళనగా మాట్లాడిన వారిని మందలించి వారి బంధువుల ఇళ్లకు పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది.  

మహానందిలో యువకుల మధ్య వర్గపోరు..
మహానందిలో యువకుల మధ్య వర్గ విభేదాలు నడుస్తున్నాయి. గతంలో పలు ఘటనలు చోటు చేసుకోవడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతేడాది జూన్‌లో క్యారంబోర్డు ఆట విషయంలో వివాదం తలెత్తడం, జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందడం తెలిసిందే. అలాగే మహానందిలో విద్యుత్‌సబ్‌స్టేషన్‌ వద్ద  ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో  పలువురు గాయపడ్డారు. ఈ ఘర్షణలో ప్రస్తుతం జరిగిన ఉపేంద్ర హత్యలో పాల్గొన్నవారి పాత్ర కీలకంగా ఉంది. దీంతో మహానందిలో యువకులు రెండు వర్గాలుగా తయారవడం, తమ మాటే చెల్లాలంటూ దాడులకు పాల్పడుతుండటంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top