సుపారీ ఇచ్చి చంపించారు | Police Arrested Victims Regarding Mysterious Murder | Sakshi
Sakshi News home page

సుపారీ ఇచ్చి చంపించారు

Feb 15 2020 9:39 AM | Updated on Feb 15 2020 9:39 AM

Police Arrested Victims Regarding Mysterious Murder - Sakshi

వివరాలను వెల్లడిస్తున్న ఏఎస్పీ, వెనుక నిందితులు

సాక్షి, చర్ల: దుమ్ముగూడెం మండలంలోని లచ్చిగూడెంలో ఈ నెల 10న అర్ధరాత్రి భూవివాదంలో ఓ వ్యక్తిని గొంతుకోసి హతమార్చిన ఘటనలో పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. శనివారం దుమ్ముగూడెం పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ రాజేష్‌చంద్ర వివరాలు వెల్లడించారు. లచ్చిగూడేనికి చెందిన తండ్రి కొడుకులు సోంది ముద్దరాజు, రవిబాబులతో అదే గ్రామానికి చెందిన హత్యకు గురైన కారం రామకృష్ణకు మధ్య కొంతకాలంగా భూవివాదం నడుస్తుంది. ఈ క్రమంలో తహసీల్దార్‌ ఆ భూ వ్యవహరంపై విచారణ నిర్వహించి, భూమి ముద్దరాజు కుటుంబీకులకే చెందుతుందని తెలియజేయడంతో ఆ నాటి నుంచి హత్యకు గురైన రామకృష్ణ కుటుంబం వివాదాస్పద భూమి నుంచి వైదొలిగింది.

కాగా భూవివాదం కొనసాగుతున్న సందర్భంలో గ్రామంలో పంచాయితీ చేసిన పెద్దల్లో ఇద్దరు పెనుబల్లి భద్రయ్య, సోంది అర్జున్‌ అతడ్ని చంపితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడంతో రామకృష్ణను చంపాలని ముద్దరాజు కుటుంబీకులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కుంట సమీపంలో గల మైతా గ్రామానికి చెందిన పొడియం నగేష్, పొడియం లచ్చు, పొడియం భద్రయ్యలతో రూ.40వేలకు రామకృష్ణను చంపేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. హత్యకు సంబంధించి సుపారీ తీసుకున్న వారు జాప్యం చేస్తుండడంతో ముద్దరాజుకు బంధువైన రాళ్లగూడేనికి చెందిన పాయం సతీష్‌ ఈ నెల 7న మైతాకు వెళ్లి వారితో మాట్లాడి రూ.2 వేలు చెల్లించి వచ్చాడు.

9న రాత్రి వచ్చిన మైతా గ్రామస్తులు రవిబాబుకు ఫోన్‌ చేయగా ముద్దరాజు, మడకం సతీష్‌ లతో కలిసి గుర్రాలబైలు సమీపంలో వారిని కలుసుకుని ఎలా హత్య చేయాలనే దానిపై చర్చించుకున్నారు. రాత్రి 12.30 గంటలకు రామకృష్ణ ఇంటికి చేరుకోగా, ముద్దరాజు, సతీష్, పొడియం భద్రయ్య ఇంటి సమీపంలో మాటు వేశారు. రవిబాబు, లచ్చు, నగేష్‌ ఇంటిలోకి ప్రవేశించి నిద్రలో ఉన్న రామకృష్ణను హతమార్చారు. రవిబాబు, నగేష్‌ కాళ్లు, చేతులు పటుకోగా, లచ్చు కత్తితో గొంతు కోశాడు. ఈ సందర్భంగా నిద్రలో నుంచి మేల్కొన్న మృతుడి భార్య తులసీ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెను కూడా హతమార్చేందుకు నిందితులు యత్నించడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది.

ఈ క్రమంలో తులసీని గొడ్డలితో కొట్టి, కత్తితో పొడిచేందుకు యత్నించారు. ఆమె చేయి అడ్డుపెట్టకోవడంతో చేతికి గాయమైంది. తులసీ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఎస్‌ఐ రితీష్‌ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం గంగోలు సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంగా రెండు బైకులపై వస్తున్న రవిబాబు, ముద్దరాజు, నగేష్, లచ్చు, భద్రయ్య, సతీష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు గ్రామపెద్దలు అర్జున్, పెనుబల్లి భద్రయ్యలను కూడా అరెస్ట్‌ చేసి, విచారించడంతో నేరం అంగీకరించినట్లు ఏఎస్పీ తెలిపారు. వీరిందరిపై హత్య కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఆయన వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement