దుర్మార్గులు దొరికారు

Police Arrested Accused Who Physical Assaulting Girl In Mandapet - Sakshi

సాక్షి, మండపేట: పట్టణంలో సంచలనం సృష్టించిన దళిత విద్యార్థినిపై లైంగికదాడి ఘటనలో నిందితులను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని బైపాస్‌రోడ్డులో నిందితులు ఉన్నట్టు అందిన సమాచారం మేరకు దాడి చేసి వారిని అరెస్టు చేసినట్టు రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాలరెడ్డి తెలిపారు. సంఘటన వివరాలను శుక్రవారం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. మండపేటలోని ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ చదువుకుంటున్న విద్యార్థిని ఈనెల 3వ తేదీన కళాశాలకు వెళ్లి సాయంత్రం స్నేహితుడి మోటారు సైకిల్‌పై ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యలో బైపాస్‌ రోడ్డులోని సంఘం కాలనీ జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు బండిని ఆపి పోలీసులమంటూ రికార్డులు చూపాలని అడిగారు.

అందులో ఒక వ్యక్తి యువతి స్నేహితుడిని పక్కకు తీసుకువెళ్లగా మరో వ్యక్తి మరో ఇద్దరికి ఫోన్‌ చేసి రప్పించాడు. ముగ్గురు కలిసి విద్యార్థినిని పక్కనే పంట పొలాల్లోకి తీసుకువెళ్లి సామూహికంగా లైంగికదాడికి పాల్పడినట్డు డీఎస్పీ రాజగోపాలరెడ్డి తెలిపారు. స్పృహ కోల్పోయిన ఆమె కొద్దిసేపటి తర్వాత తేరుకుని స్నేహితుల సాయంతో ఇంటికి చేరుకుంది. భయపడి జరిగిన సంఘటనను ఇంట్లో చెప్పలేకపోయింది. మరుసటి రోజు జరిగిన అన్యాయం గురించి తన సోదరుడితో చెప్పి అతడి సాయంతో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  చదవండి: సామూహిక అత్యాచారం

బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ ఎ.నాగమురళి నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా రాజగోపాలరెడ్డి దర్యాప్తు చేపట్టారు. లైంగికదాడికి పాల్పడిన నలుగురు నిందితులు బైపాస్‌ రోడ్డులో ఉన్నట్టు గురువారం సాయంత్రం సమాచారం అందడంతో సీఐ నాగమురళీ, ఎస్సై రాజేష్‌కుమార్‌ దాడిచేసి మధ్యవర్తుల సమక్షంలో వారిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుగుతున్నందున నిందితులను మీడియా ముందుకు తీసుకురాలేమని, అలాగే వారి పేర్లను ఇంకా వెల్లడించలేమని డీఎస్పీ రాజగోపాలరెడ్డి తెలిపారు.  

యువతిపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన స్థలం 
ప్రాధేయపడినా విడిచిపెట్టలేదు 
పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం పట్టణానికి చెందిన వల్లూరి మురళీకృష్ణ, సుంకర వెంకన్న, మొలకల వీరబాబు, చామంతి మధులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. తొలుత ప్రధాన నిందితుడు వల్లూరి మురళీకృష్ణ విద్యార్థినిపై ఘాతుకానికి ఒడిగట్టగా, ఆ తర్వాత సుంకర వెంకన్న లైంగికదాడికి పాల్పడ్డాడు. ములకల వీరబాబు సంఘటన స్థలంలోనే ఉండి యువతి కాళ్లను గట్టిగా పట్టుకుని వారికి సహకరించాడు. వదిలిపెట్టమని విద్యార్థిని ఎంత ప్రాధేయపడినా పట్టించుకోకుండా అత్యంత పాశవికంగా వారు లైంగికదాడికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. రాత్రి ఎనిమిది గంటల సమయం కావడం, రోడ్డు నుంచి పొలాల్లోకి దూరంగా తీసుకువెళ్లిపోవడంతో ఆమె కేకలు వేసినా ఫలితం లేకపోయింది.

విడిపించుకునే ప్రయత్నం చేసినా ఆమెపై దాడిచేయడంతో పాటు పరుష పదజాలంతో దూషిస్తూ కాళ్లు కదలకుండా తొక్కిపెట్టి అత్యంత పాశవికంగా దారుణానికి పాల్పడ్డారు. స్పృహలేకుండా పడి ఉన్న ఆమెను అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు. ఫోన్‌ రింగవుతున్నా తీయలేని నిస్సత్తువలో పాక్కుంటూ ఫోన్‌ తీసుకుని స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను ఇంటికి చేర్చే సరికి రాత్రి 9 గంటలైంది. జరిగిన దారుణం గురించి ఆ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి చెప్ప లేక, సోదరుడికి చెప్పే ధైర్యం చేయలేక తీవ్ర క్షోభను అనుభవించింది. ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ధైర్యం తెచ్చుకుని మరుసటి రోజు సోదరుడికి చెప్పి అతడి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

బాధితురాలికి పూర్తి న్యాయం చేస్తాం డిప్యూటీ సీఎం బోస్‌ 
కాకినాడ సిటీ: సభ్యసమాజం తలదించుకునేలా మండపేటలో దళిత యువతిపై జరిగిన లైంగికదాడి ఘటనను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ పరంగా ఆమెకు పూర్తి న్యాయం జరిగేలా కృషి చేస్తానని డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంప్స్‌ రిజిస్ట్రేషన్‌శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని శుక్రవారం రాత్రి పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాజుబాబు తదితరులతో కలసి ఆయన పరామర్శించారు. ∙బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమెకు భరోసానిచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమన్నారు.

ఎఫ్‌ఐఆర్‌ కాపీని చూశానని, నిర్భయ చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. విశాఖపట్నంలో ఉన్న తన దృష్టికి రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాలరెడ్డి సంఘటన వివరాలను తీసుకురాగా నిందితులు ఎంతటి వారైనా, ఎటువంటి ఒత్తిళ్లు వచ్చిన తలొగ్గకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారన్నారు.  బాధితురాలికి నష్టపరిహారం అందించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు కృషి చేస్తానని డిప్యూటీ సీఎం బోస్‌ స్పష్టం చేశారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు కర్రి జయశ్రీ, కొవ్వాడ అప్పన్నబాబు, అడ్డూరి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top