దసరాకు పుట్టింటికి పంపించి.. ప్లాన్‌కు తెర తీశాడు

Person Taken Money From Own House In Ranga Reddy - Sakshi

బెట్టింగులకు మరిగి రూ.7 లక్షల అపహరణ

దొంగలుపడ్డారని నమ్మించే యత్నం   

సాక్షి, కొందుర్గు: కష్టపడకుండా అడ్డదారిలో డబ్బులు సంపాదించవచ్చని బెట్టింగ్‌లకు అలవాటుపడిన ఓ వ్యక్తి తన సొంత ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు. ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులను నమ్మించే యత్నం చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన కొందుర్గు మండల కేంద్రంలో వెలుగుచూసింది. షాద్‌నగర్‌ రూరల్‌ సీఐ రామకృష్ణ మంగళవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. కొందుర్గుకు చెందిన కావలి ఆంజనేయులు కొంతకాలంగా బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు.

సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఆశపడ్డాడు. స్థానికంగా క్రికెట్, కబడ్డీ తదితర పోటీలు జరిగే సమయంలో తన తోటిమిత్రులతో బెట్టింగ్‌ కాస్తున్నాడు. ఆంజనేయులుతోపాటు కొందుర్గు గ్రామానికి చెందిన సంజీవ్, సచిన్, చంద్రయ్య, బోయ అంజయ్య, రశీద్, చౌదరిగూడకు చెందిన సతీష్, సలామ్‌ తదితరులు బెట్టింగ్‌లో పాల్గొంటున్నారు. వీరిలో సంజీవ్‌ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ వ్యవహారం నడిపిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో బెట్టింగ్‌కు బానిసైన కావలి ఆంజనేయులు తనకున్న కొద్దిపాటి భూమిని కూడా విక్రయించి బెట్టింగ్‌లో పాల్గొని రూ. లక్షల్లో నష్టపోయాడు. ఇటీవల ఓ ప్లాటును అమ్మడంతో రూ. 7 లక్షలు వచ్చాయి. ఆంజనేయులు దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. డబ్బులను తన భర్త ఖర్చుచేస్తాడని భావించిన ఆయన భార్య నగదును తన వద్దే దాచుకుంది. 

భార్యను నమ్మించేందుకు చోరీ డ్రామా
బెట్టింగ్‌కు అలవాటుపడిన ఆంజనేయులు భార్య దాచుకున్న రూ. 7 లక్షలను ఎలాగైనా కొట్టేయాలని పథకం వేశాడు. తనకు ఇష్టం లేకున్నా భార్యను దసరా పండుగకు పుట్టింటికి పంపించాడు. తల్లిగారింటికి వెళ్లే సమయంలో భార్య రూ. 7 లక్షలను భర్తకు తెలియకుండా హాట్‌బాక్స్‌లో దాచి పెట్టి వెళ్లింది. భార్య పుట్టింటికి వెళ్లగానే ఆంజనేయులు డబ్బులను తన భార్య హాట్‌బాక్స్‌లో ఉంచిందని గుర్తించి తీసుకున్నాడు. దాదాపు రూ. 2 లక్షలకు పైగానే ఇదివరకు తాను చేసిన అప్పులు తీర్చాడు.

ఇక మిగతా రూ. 5 లక్షలు తన స్నేహితులైన సంజీవ్, సతీష్, సలామ్‌తో కలిసి కబడ్డీలో బెట్టింగ్‌ పెట్టాడు. అందులో డబ్బులు పోగొట్టుకున్న ఆంజనేయులు దిక్కుతోచక తన భార్యకు ఏం చెప్పాలో పాలుపోలేదు. ఇంట్లో దొంగలు పడ్డారని నమ్మించేందుకు పథకం పన్నాడు. పుట్టింటి నుంచి ఇంటికి వచ్చిన భార్యకు ఇంట్లో దొంగలు పడి దాచి ఉంచిన రూ.7 లక్షలు అపహరించారని నమ్మించాడు. దీంతో ఆమె ఈనెల 11న కొందుర్గు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇంటికి వేసిన తాళం విరిగిపోలేదు.. ఇల్లు కూడా ఎక్కడ దెబ్బతినలేదు.. మరి డబ్బులు ఎలా పోయాయనే కోణంలో అనుమానించి విచారణ జరిపారు. ఈమేరకు ఆంజనేయులు ఫోన్‌ కాల్‌ డేటాను పరిశీలించారు. 

దీంతో అసలు నిజం బయటికి వచ్చింది. ఆంజనేయులు స్నేహితులను విచారించగా జరిగిన విషయం పూసగుచ్చినట్లు తెలిపారు. ఈమేరకు పోలీసులు సతీష్, సంజీవ్, సలామ్‌ నుంచి రూ. 4.70 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 8 మందిపై రూ. 2 లక్షల ధరావత్తుతో బైండోవర్‌ కేసు నమోదు చేశామని సీఐ రామకృష్ణ తెలిపారు. కొందుర్గు, చౌదరిగూడపరిసర గ్రామాల్లో కొందరు బెట్టింగ్‌నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, త్వరలో వారిని పట్టుకొని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీఐ రామకృష్ణ తెలిపారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top